Insurance Fraud Survey 2023: బీమాలో పెరుగుతున్న మోసాలు | Insurance Fraud Survey 2023: 60 percent private insurers see rapid rise in fraud | Sakshi
Sakshi News home page

Insurance Fraud Survey 2023: బీమాలో పెరుగుతున్న మోసాలు

Published Mon, Feb 20 2023 6:39 AM | Last Updated on Mon, Feb 20 2023 6:39 AM

Insurance Fraud Survey 2023: 60 percent private insurers see rapid rise in fraud - Sakshi

న్యూఢిల్లీ:  బీమా సంబంధిత మోసాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయని బీమా సంస్థలు భావిస్తున్నాయి. ఈ విధమైన మోసాల రిస్క్‌ నేపథ్యంలో.. చురుకైన రిస్క్‌ నిర్వహణ విధానం అవసరమని అవి భావిస్తున్నట్టు డెలాయిట్‌ సర్వే నివేదిక వెల్లడించింది. జీవిత బీమా, ఆరోగ్య బీమాలో మోసాలు పెరిగిపోవడాన్ని బీమా సంస్థలు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. డిజిటైజేషన్‌ పెరిగిపోవడం, కరోనా తర్వాత మారుమూల ప్రాంతాల నుంచి పనిచేస్తుండడం, నియంత్రణలు బలహీనపడడం వంటివి మోసాలు పెరిగిపోవడానికి కారణాలుగా డెలాయిట్‌ ‘ఇన్సూరెన్స్‌ ఫ్రాడ్‌ సర్వే 2023’ నివేదిక వెల్లడించింది.

మోసాలు భారీగా పెరిగిపోయాయని సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది బీమా కంపెనీల ప్రతినిధులు చెప్పగా, మోస్తరుగా ఉన్నట్టు 10 శాతం మంది తెలిపారు. 2020 జూలై–సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఈ సర్వే నిర్వహించారు. బీమా సంస్థల సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగుల అభిప్రాయాలను డెలాయిట్‌ తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. టెక్నాలజీతో కూడిన ఆవిష్కరణలు బీమా రంగంలో వేగం, మెరుగైన కస్టమర్‌ అనుభవం, సులభ వినియోగానికి సాయపడినట్టు డెలాయిట్‌ తెలిపింది. అదే సమయంలో రిస్క్‌లు సైతం పెరిగినట్టు పేర్కొంది. డేటా చోరీ, థర్డ్‌ పార్టీల కుమ్మక్కు, బీమా ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో విక్రయించడం అన్నవి బీమా రంగానికి ఆందోళనకర అంశాలుగా ప్రస్తావించింది. ఈ మోసాలను అధిగమించేందుకు వ్యూహాత్మక జోక్యం, బీమా కార్యకలాపాల నిర్వహణపై ఉన్నతస్థాయి మేనేజ్‌మెంట్‌ దృష్టి సారించడం, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసమని సూచించింది.  

తిరిగి ఆవిష్కరించుకోవాలి..
‘‘భారత బీమా రంగం డిజిటల్‌ విప్లవం ఆరంభ దశలో ఉంది. వేగవంతమైన వ్యాపార కార్యకలాపాలు, కస్టమర్లను సొంతం చేసుకోవడం, టెక్నాలజీతో కూడిన అనుభవాన్ని అందించేందుకు ఇతర రంగాల మాదిరే బీమా పరిశ్రమ సైతం తనను తాను తిరిగి ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’’అని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లీడర్‌ సంజయ్‌ దత్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ కంపెనీ బోర్డ్, యజమాన్యానికి మోసాల నివారణ ప్రాధాన్య అంశంగా ఉన్నట్టు 40 శాతం జీవిత బీమా, ఆరోగ్య బీమా కంపెనీల ప్రతినిధులు ఈ సర్వేలో తెలిపారు. మిగిలిన బీమా కంపెనీల ప్రతినిధులు సైతం తమ ప్రాధాన్య అంశాల్లో మోసాల నివారణ కూడా ఒకటిగా పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పటిష్టమైన మోసాల నివారణ కార్యాచరణ అవసరమని ఈ సర్వే నివేదిక ప్రస్తావించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement