ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్
ఉద్యోగులకు సామాజిక భద్రతా కల్పించేందుకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) స్కీమ్ 1976లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) నిర్వహించే ఈ పథకం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లో సభ్యులుగా ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జీవిత బీమా ప్రయోజనాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈపీఎఫ్‌లో వాటాదారులైన ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఈ పథకాన్ని ఉచితంగా అమలు చేస్తారు.
ఈడీఎల్ఐ స్కీమ్ వివరాలు
అర్హతలు: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), ఇతర నిబంధనల చట్టం 1952 కింద నమోదైన అన్ని సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. నెలకు రూ.15,000 వరకు మూల వేతనం ఉన్న ఉద్యోగులు ఈ స్కీమ్‌లో డిఫాల్ట్‌గా చేరతారు.
యాజమాన్యం వాటా: ఉద్యోగి నెలవారీ వేతనంలో 0.5% యజమానులు ఈడీఎల్‌ఐ పథకానికి విరాళంగా ఇస్తారు. గరిష్ట వేతన పరిమితి రూ.15,000 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈడీఎల్‌ఐలో ఉద్యోగి నుంచి ఎలాంటి కంట్రిబ్యూషన్ అవసరం లేదు.
బీమా కవరేజీ: సర్వీసులో ఉండగా ఉద్యోగి మరణిస్తే, రిజిస్టర్డ్ నామినీకి ఏకమొత్తంలో బీమా డబ్బులు అందుతాయి. గత 12 నెలల్లో ఉద్యోగి తీసుకున్న సగటు నెలవారీ వేతనానికి 30 రెట్లు, నెలకు గరిష్టంగా రూ.15,000కు లోబడి ఈ బెనిఫిట్‌ను లెక్కిస్తారు.
ప్రయోజనాలు: కనీస హామీ ప్రయోజనం రూ.2.5 లక్షలు, గరిష్ట ప్రయోజనం రూ.7 లక్షలుగా ఉంది. ఇది నెలవారీ గరిష్టవేతన పరిమితిపై ఆధారపడుతుంది. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.
గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్
ఈడీఎల్‌ఐ(EDLI) పథకంలో ఉద్యోగి వేతనంలో 0.5 శాతం వాటాను యాజమాన్యం జమచేయాలి. అయితే దీని కంటే మెరుగైన ఇన్సూరెన్స్ పాలసీ(Insurance Policy)లు ఏవైనా ఉంటే యజమానులు తమ ఉద్యోగుల కోసం గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇది ఈడీఎల్‌ఐ స్కీమ్ ద్వారా అందించబడే కవరేజీకి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి.
ఇదీ చదవండి: కూతురి కోసం మంచి పథకం
ఎలా క్లెయిమ్ చేయాలి?
ఉద్యోగి మరణిస్తే నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు ఆ డబ్బులు చెందుతాయి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లతో పాటు క్లెయిమ్ ఫారాన్ని ఈపీఎఫ్ఓకు సమర్పించాలి. క్లెయిమ్ మొత్తం నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అందుకోసం నామినీ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లేదా సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయం నుంచి ఫారం 5 ఐఎఫ్ (ఇన్సూరెన్స్ ఫండ్) పొందాలి. మరణించిన ఉద్యోగి పీఎఫ్ ఖాతా నంబర్, మరణించిన తేదీ, నామినీ వివరాలతో సహా అవసరమైన అన్ని వివరాలను ఫారంతో నింపి కార్యాలయంలో అందించాలి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లను జతచేయాలి.
Comments
Please login to add a commentAdd a comment