బీమా సొమ్ము.. ఆర్టీసీ సొంత అవసరాలకు
సాక్షాత్తూ భవిష్యనిధి(పీఎఫ్) సంస్థ కల్పించిన బీమా పథకానికి ఆర్టీసీ గండి కొట్టింది. ఆ పథకం ద్వారా మృతుడి కుటుంబ సభ్యుల(నామినీకి)కు గరిష్టంగా రూ.7 లక్షలు అందే ఓ చట్టబద్ధ ప్రయోజనాన్ని ఏడాదిన్నరగా అందించటం లేదని తెలిసింది. ఇప్పుడు ఈ ఆర్థిక ప్రయోజనం కోసం దాదాపు 300కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: భవిష్యనిధిలో అంతర్భాగంగా ‘‘ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూ్యరెన్స్ (ఈడీఎల్ఐ)’’స్కీమ్ ఆర్టీసీలో కొనసాగుతోంది. ఓ సంస్థలో 20 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులుండి, వారికి ఇంతకంటే మెరుగైన మరే బీమా పథకాన్ని సంస్థ అమలు చేయని పక్షంలో, కచ్చి తంగా దీనిని అమలు చేయాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగి నుంచి ఎలాంటి ప్రత్యేక కాంట్రిబ్యూషన్ అంటూ లేకుండా సాగుతుంది. ఉద్యోగి బేసిక్ ప్లస్ డీఏ (మూల వేతనం ప్లస్ కరువు భత్యం)మీద 0.5 శాతం లేదా గరిష్టంగా రూ.75 చొప్పున ప్రతినెలా సంస్థ ఉద్యోగిపక్షాన అతని/ఆమె భవిష్య నిధి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. భవిష్యనిధిలో సభ్యత్వం ఉన్న ప్రతి ఉద్యోగి (అర్హతలను అనుసరించి) దీని ప్రయోజనం పొందవచ్చు. ఉద్యోగి చనిపోతే అతని/ఆమె నామినీకి కనిష్టంగా రూ.రెండున్నర లక్షలు.. నెలవారీ వేతనం, భవిష్యనిధి నిల్వ తదితరాల ఆధారంగా గరిష్టంగా రూ.ఏడు లక్షల వరకు చెల్లిస్తారు. ఉద్యోగి నయాపైసా కాంట్రిబ్యూషన్ లేకుండా ఇది అందుతుంది. ఇష్టారాజ్యానికి ఇదే కారణం.. భవిష్యనిధి ఖాతాల నిర్వహణలో ఆరీ్టసీకీ ప్రత్యేక మినహాయింపు ఉంది. సొంతంగానే పీఎఫ్ ట్రస్టును నిర్వహిస్తుంది. దీనికి ఓ నిర్వహణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తుంది (ప్రస్తుతం కమిటీ లేదు). ఈ వెసులుబాటే ఇప్పుడు ఆర్టీసీ ఇష్టారాజ్యానికి కారణమైంది. భవిష్యనిధి చెల్లింపులు పూర్తి చట్టబద్ధమైనమే అయినా, కాంట్రిబ్యూషన్‌ను ట్రస్టుకు జమ చేయకుండా సొంత అవసరాలకు వాడుకుంటోంది. దాదాపు పదేళ్ల క్రితం ఈ కట్టు తప్పే సంప్రదాయం ఆర్టీసీలో మొదలైంది. ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత దాన్ని కొంతమేర తగ్గించి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నా.. సంస్థ ఆర్థిక అవసరాలు, ప్రభుత్వం నుంచి సకాలంలో సాయం అందకపోవటం లాంటి వాటి వల్ల దానికి పూర్తిగా అడ్డుకట్ట పడలేదు. ఈ క్రమంలోనే ఈ బీమా పథకం కోసం యాజమాన్యం చెల్లించే వాటాను ట్రస్టులో డిపాజిట్ చేయకుండా సొంత అవసరాలకు వాడుకుంటోంది. ఫలితంగా ఏడాదిన్నరగా దీని చెల్లింపులు నిలిచిపోయాయి. గతేడాది మార్చి వరకు భవిష్యనిధి బీమా పథకం చెల్లింపులు జరిగాయి. ఆ తర్వాత నిలిచిపోయినట్టు సమాచారం. ప్రతి మూడు నెలలకోమారు ఈ పథకం కోసం ఆర్టీసీ నిధులు విడుదల చేసే పద్ధతి ఉండేది. ఏడాదిన్నరగా అవి కూడా నిలిచిపోయాయి. అప్పటి నుంచి దాదాపు 300 మందికిపైగా ఉద్యోగులు మరణించారు. వీరి కుటుంబ సభ్యుల(నామినీ)కు ఆ బీమా మొత్తాన్ని చెల్లించటం లేదని తెలిసింది.