
క్యాన్సర్, అనారోగ్యాలు వచ్చే ప్రమాదం
ఆరోగ్యమంత్రి దినేశ్ వెల్లడి
రెండురోజుల్లో నిషేధ ఉత్తర్వులు జారీ అవుతాయని వెల్లడి
రంగు కలిపిన బొంబై మిఠాయి తింటే ఉదరకోశ రోగాలు, క్యాన్సర్ రావచ్చునని గతంలో సర్కారు హెచ్చరించింది. అదే రంగు కలిపిన చికెన్ పకోడా, గోబీ ఆరగిస్తే కూడా జబ్బులు తప్పవని హెచ్చరించి రంగులను నిషేధించింది. ఇప్పుడు ఇడ్లీలకు అలర్ట్ జారీ అయ్యింది. ప్లాస్టిక్ కవర్లు వేసి వండిన ఇడ్లీలను తినరాదని, క్యాన్సర్ ప్రమాదం ఉందని హెచ్చరించారు. కనుక వినియోగదారులు జాగ్రత్త వహించాల్సిందే.
బనశంకరి : ప్రతి ఇంటా, హోటల్‌లో ఇడ్లీలు చేస్తారు, కడుపారా ఆరగించి ఆకలి తీర్చుకుంటారు. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇడ్లీ తగిన ఆహారం. కానీ వండే సమయంలో తప్పుడు విధానాల వల్ల క్యాన్సర్‌కు గురి కావచ్చు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ ఇదే విషయం చెప్పారు.
ప్లాస్టిక్ కవర్లు.. ప్రమాదం
ఇడ్లీలను వండడానికి కొన్ని హోటళ్లలో ప్లాస్టిక్ పేపర్లు ఉపయోగిస్తారు, ప్లాస్టిక్‌లో క్యాన్సర్ కారకాలు చేరడం వల్ల ఆ ఇడ్లీలను తినడంతో రోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ఈ నివేదికలు ప్రభుత్వం చేతికి రెండురోజుల్లో అందుతాయని మంత్రి దినేశ్ చెప్పారు. ఇటీవలి కాలంలో ఇడ్లీల తయారీలో, వడ్డించడంలో ప్లాస్టిక్ కవర్ల వాడకం అధికమైంది. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో హోటల్స్‌లో, క్యాంటీన్లలో ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ కవర్లను వాడరాదని నిషేధం విధించామన్నారు. మరో రెండురోజుల్లో అధికారిక ఆదేశాలు జారీచేస్తామని తెలిపారు. బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పక్కన చిన్న చిన్న హోటళ్లు, తోపుడు బండ్లు, పెద్ద పెద్ద హోటల్స్‌లో ఇడ్లీ తయారీలో, పార్శిల్ కట్టడంలో ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నారు. దీనిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి తెలిపారు. అందులోనే ఇడ్లీ తయారీదారులకు సలహాలు, సూచనలు ఉంటాయన్నారు.
నమూనాల పరీక్షల్లో వెల్లడి
రాష్ట్ర ఆరోగ్య శాఖ సిబ్బంది బెంగళూరుతో పాటు పలు జిల్లాల నుంచి ఇడ్లీల్లో ప్లాస్టిక్ కవర్లు వాడే చోట్ల నుంచి 500 శాంపిల్స్‌ను పరిశీలించారు. ఇందులో 35 నివేదికలు సాధారణం కాగా పలు నివేదికల్లో క్యాన్సర్ కారకాలు బయటపడ్డాయి. ఇడ్లీలు సులభంగా ఊడి రావడానికి ప్లాస్టిక్ పేపర్ పరిచి దానిపై ఇడ్లీ పిండి వేసి వేడి చేస్తారు. నిజానికి అక్కడ తెల్ల నూలు బట్టను వాడాలి. ప్లాస్టిక్ కవర్ అధిక వేడిమి వల్ల ప్రమాదకర రసాయాలను విడుదల చేస్తుంది. అవి కాస్తా ఇడ్లీల్లోకి, ఆపై శరీరంలోకి చేరుతాయి. దీంతో క్యాన్సర్, గుండెపోటు, ఇతరత్రా అనారోగ్యాలు తలెత్తుతాయి.
Comments
Please login to add a commentAdd a comment