insurance fraud
-
రెండు సార్లు ‘మరణం’!! రూ.1.1 కోట్ల కోసం మహిళ మోసం
ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు తమ కుటుంబానికి ఆదరవుగా ఉంటుందని బీమా చేయిస్తుంటారు. కానీ బీమా సొమ్ము కోసమే చనిపోయినట్లు అదికూడా రెండు సార్లు మరణించినట్లు మోసగించిన ఉదంతం ముంబైలో బయటపడింది.ముంబై ప్రాంతంలోని భయాందర్‌కు చెందిన 45 ఏళ్ల మహిళ కంచన్ పాయ్ అలియాస్ పవిత్ర రూ.1.1 కోట్ల ఇన్సూరెన్స్ రెండేళ్లలో రెండుసార్లు తన మరణాన్ని ఫేక్ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే రూ.70 లక్షలను నిందితురాలి కుటుంబం అందుకుంది.కంచన్ పాయ్ భర్త, కుమారుడు 2021-2023 మధ్య ఐదు ప్రైవేట్ రంగ బీమా కంపెనీల నుంచి రూ .1.1 కోట్లు క్లెయిమ్ చేశారు. వారికి ఇప్పటికే డెత్ క్లెయిమ్ రూపంలో దాదాపు రూ.70 లక్షలు వచ్చాయి. మిగిలిన మొత్తం కోసం ఎదురు చూస్తుండగా మోసం బయటపడింది. ముగ్గురూ పరారీలో ఉన్నారు.అశుతోష్ యాదవ్ అనే వైద్యుడి సాయంతో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు, దహన సంస్కారాల రశీదులు పొంది ఈ మోసానికి పాల్పడ్డారు. ఈ డాక్టర్ కూడా పరారీలో ఉన్నాడు. కంచన్ అలియాస్ పవిత్ర రెండు వేర్వేరు ఆధార్ కార్డు, పాన్ కార్డులను ఉపయోగించి మొత్తం ఐదు ప్రైవేటు సంస్థల నుంచి బీమా పాలసీలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. -
Insurance Fraud Survey 2023: బీమాలో పెరుగుతున్న మోసాలు
న్యూఢిల్లీ: బీమా సంబంధిత మోసాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయని బీమా సంస్థలు భావిస్తున్నాయి. ఈ విధమైన మోసాల రిస్క్ నేపథ్యంలో.. చురుకైన రిస్క్ నిర్వహణ విధానం అవసరమని అవి భావిస్తున్నట్టు డెలాయిట్ సర్వే నివేదిక వెల్లడించింది. జీవిత బీమా, ఆరోగ్య బీమాలో మోసాలు పెరిగిపోవడాన్ని బీమా సంస్థలు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. డిజిటైజేషన్ పెరిగిపోవడం, కరోనా తర్వాత మారుమూల ప్రాంతాల నుంచి పనిచేస్తుండడం, నియంత్రణలు బలహీనపడడం వంటివి మోసాలు పెరిగిపోవడానికి కారణాలుగా డెలాయిట్ ‘ఇన్సూరెన్స్ ఫ్రాడ్ సర్వే 2023’ నివేదిక వెల్లడించింది. మోసాలు భారీగా పెరిగిపోయాయని సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది బీమా కంపెనీల ప్రతినిధులు చెప్పగా, మోస్తరుగా ఉన్నట్టు 10 శాతం మంది తెలిపారు. 2020 జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ సర్వే నిర్వహించారు. బీమా సంస్థల సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగుల అభిప్రాయాలను డెలాయిట్ తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. టెక్నాలజీతో కూడిన ఆవిష్కరణలు బీమా రంగంలో వేగం, మెరుగైన కస్టమర్ అనుభవం, సులభ వినియోగానికి సాయపడినట్టు డెలాయిట్ తెలిపింది. అదే సమయంలో రిస్క్‌లు సైతం పెరిగినట్టు పేర్కొంది. డేటా చోరీ, థర్డ్ పార్టీల కుమ్మక్కు, బీమా ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో విక్రయించడం అన్నవి బీమా రంగానికి ఆందోళనకర అంశాలుగా ప్రస్తావించింది. ఈ మోసాలను అధిగమించేందుకు వ్యూహాత్మక జోక్యం, బీమా కార్యకలాపాల నిర్వహణపై ఉన్నతస్థాయి మేనేజ్మెంట్ దృష్టి సారించడం, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసమని సూచించింది. తిరిగి ఆవిష్కరించుకోవాలి.. ‘‘భారత బీమా రంగం డిజిటల్ విప్లవం ఆరంభ దశలో ఉంది. వేగవంతమైన వ్యాపార కార్యకలాపాలు, కస్టమర్లను సొంతం చేసుకోవడం, టెక్నాలజీతో కూడిన అనుభవాన్ని అందించేందుకు ఇతర రంగాల మాదిరే బీమా పరిశ్రమ సైతం తనను తాను తిరిగి ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’’అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లీడర్ సంజయ్ దత్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ కంపెనీ బోర్డ్, యజమాన్యానికి మోసాల నివారణ ప్రాధాన్య అంశంగా ఉన్నట్టు 40 శాతం జీవిత బీమా, ఆరోగ్య బీమా కంపెనీల ప్రతినిధులు ఈ సర్వేలో తెలిపారు. మిగిలిన బీమా కంపెనీల ప్రతినిధులు సైతం తమ ప్రాధాన్య అంశాల్లో మోసాల నివారణ కూడా ఒకటిగా పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పటిష్టమైన మోసాల నివారణ కార్యాచరణ అవసరమని ఈ సర్వే నివేదిక ప్రస్తావించింది. -
కోవిడ్ బీమా పేరిట టోకరా.. 8 మందితో ముఠా కట్టి..
కడప అర్బన్(వైఎస్సార్ జిల్లా): కోవిడ్ బారినపడి మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులను వైఎస్సార్ బీమా పేరుతో మోసగిస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టును వైఎస్సార్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ముఠాలో కీలక నిందితుడు నేపాల్‌కు చెందిన అశోక్ లోహర్‌తోపాటు మరో ముగ్గురిని ఢిల్లీలో పోలీస్ ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి. వారి నుంచి రూ.3.29 లక్షల నగదుతోపాటు కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు చెందిన 73 ఏటీఎం కార్డులు, 18 సెల్ఫోన్లు, 290 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) తుషార్‌డూడీ ఆదివారం మీడియాకు వెల్లడించారు. చదవండి: ప్రేమ పెళ్లి.. సైకో భర్త.. పెళ్లయిన ఆరు నెలలకే భార్య షాకింగ్ నిర్ణయం వివిధ ప్రాంతాలకు చెందిన 8 మంది కలిసి అంతర్జాతీయ ముఠాగా ఏర్పడి కోవిడ్ కారణంగా మరణించిన వారి వివరాలను సేకరించారు. మృతుల బంధువులకు కలెక్టరేట్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి.. ప్రభుత్వం నుంచి వైఎస్సార్ బీమా పథకం కింద పరిహారం ఇప్పిస్తామని నమ్మబలికారు. ఇందుకోసం న్యూఢిల్లీలోని పాలిమర్‌బాగ్ ప్రాంతంలో నివాసం వుంటున్న నేపాల్ దేశస్తుడు అశోక్ లోహర్ సాయంతో అద్దె గదిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఏపీకి చెందిన నిరుద్యోగ యువకులను ఢిల్లీకి పిలిపించి, బాధితులకు ఫోన్లు చేయించారు. రూ.50 లక్షలు మంజూరు చేయిస్తామని, ఇందుకోసం కొంత మొత్తం చెల్లించాలని నమ్మించారు. ఇలా బద్వేలుకు చెందిన పి.ఆదిలక్ష్మి నుంచి యూపీఐ చెల్లింపుల ద్వారా సుమారు రూ.9 లక్షలు కాజేశారు. మరో 13 మంది నుంచి యూపీఐ చెల్లింపుల ద్వారా రూ.8,28,086 వసూలు చేశారు. ఇందులో నష్టపోయిన కడప నగరానికి చెందిన ఒంటిబీరం రమణారెడ్డి, నిర్మల, ఎంవీ సునీత, ఖాజీపేటకు చెందిన ఎస్.నాగవేణి, విఘ్నేశ్వరి, పెండ్లిమర్రికి చెందిన విజయకుమారి, ప్రొద్దుటూరుకు చెందిన కృష్ణ చైతన్య, జింకా హరిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బృందాల ఏర్పాటుతో.. విచారణలో భాగంగా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 12న వైఎస్సార్ జిల్లాలోని కలసపాడు బలిజపల్లె నివాసి, ప్రస్తుతం ఖాజీపేట మండలం మిడుతూరుకు చెందిన మీనుగ వెంకటేష్‌ను అరెస్ట్ చేశారు. అతను విచారణలో తెలిపిన వివరాల ఆధారంగా.. ఖాజీపేట మండలం మిడుతూరుకు చెందిన మీనుగ నరేంద్ర, జంగాలపల్లి జనార్ధన్, ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామానికి చెందిన ఆవులమంద నారాయణ, నేపాల్‌కు చెందిన ప్రస్తుతం ఢిల్లీ సిటీలోని పితాంపుర నార్త్ వెస్ట్‌లో ఉన్న అశోక్ లోహర్ అనే వారిని అరెస్ట్ చేశారు. కాగా, రంజిత్, అతని సోదరుడు బద్రీసింగ్, అక్షయ్ ఈ ముఠా నాయకులని పట్టుబడిన నిందితులు తెలిపారు. వీరి ఖాతాల వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు, ఇన్‌కంటాక్స్, విదేశీ వ్యవహారాల శాఖకు తదుపరి చర్యల నిమిత్తం అందజేస్తామన్నారు. -
పనిచేస్తున్న సంస్థకే కన్నం.. భార్య, బావమరిది పేర్లతో పే రోల్స్.. రూ.2 కోట్లు స్వాహా
సాక్షి, హిమాయత్‌నగర్: పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. లేని ఉద్యోగులు ఉన్నట్లు చూపి సంస్థకు సంబంధించిన డబ్బును జీతాల రూపంలో కుటుంబ సభ్యుల అకౌంట్లో జమ చేసుకున్నాడు. ఏడాదిన్నర పాటు కోట్ల రూపాయిలు కొట్టేసి ఇటీవల ఉద్యోగం మానేయడంతో.. తోటి ఉద్యోగి ఈ విషయాన్ని యజమాన్యానికి తెలిపాడు. దీంతో విషయం బయటపడి సిటీ సైబర్‌క్రైం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..హబ్సిగూడలోని ఓ ‘యాప్ అప్లికేషన్’ కంపెనీలో నగరానికి చెందిన యువకుడు అకౌంట్స్‌లో పనిచేస్తున్నాడు. సంస్థలో ఉద్యోగం చేయకపోయినప్పటికీ చేస్తున్నట్లుగా తన భార్య, బావమరిది, మరో కుటుంబసభ్యుడు, తోటి ఉద్యోగుల పేర్లతో నకిలీ పే రోల్స్ తయారు చేశాడు. వాటిపై ఏడాదిన్నరగా వారు జీతం తీసుకుంటున్నట్లు రూ.లక్షా 60వేలు కాజేశాడు. మరలా జీఎస్టీ పేరుతో సంస్థ నుంచి రూ.46 లక్షలు స్వాహా చేశాడు. మొత్తంగా ఏడాదిన్నరలో రూ.2 కోట్ల 6 లక్షలు కొట్టేసి ఉద్యోగం మానేశాడు. ఆయన ఉద్యోగం మానేసిన తర్వాత ఈ విషయాన్ని ఓ ఉద్యోగి యజమాన్యానికి లీక్ చేశాడు. వారు అకౌంట్స్ సరి చూసుకొని, కంపెనీలో చేయకపోయినా చేస్తున్నట్లు పే రోల్స్ క్రియేట్ చేసి డబ్బు కొట్టేశాడని కంపెనీ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. చదవండి: గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్, వంట నూనెలు, చికెన్, పచ్చిమిర్చి.. తగ్గేదేలే! ఇన్సూరెన్స్ పేరుతో రూ. 3.5 కోట్లకు టోకరా హిమాయత్‌నగర్: ఇన్సూరెన్స్ పేరుతో మోసగించిన ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మోతీనగర్‌కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రామరాజును ఇన్సూరెన్స్ చేసుకోవాలంటూ ముగ్గురు స్నేహితులు వెంటపడ్డారు. పదే పదే కాల్స్ చేస్తుండటంతో రామరాజు విడతల వారీగా వీరికి రూ.3 కోట్ల 50 లక్షలు చెల్లించి ఇస్సూరెన్స్ తీసుకున్నాడు. డబ్బు కట్టిన తర్వాత వచ్చే పత్రాలను రామరాజు అమెరికాలో ఉన్న తన కుమారుడికి పంపాడు. ఆ కంపెనీకి చెందిన అధికార వెబ్సైట్లో తండ్రి రామరాజు వివరాలు ఏవీ లేవు. దీంతో అనుమానం వచ్చి తన తండ్రి రామరాజుకు చెప్పాడు. దీనిపై ఇన్సూరెన్స్ డబ్బు తీసుకున్న కరీంనగర్‌కు చెందిన మనోజ్, వనపర్తికి చెందిన మహేష్‌గౌడ్, ఏపీలోని కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన సుబ్రహ్మణ్యంను నిలదీశాడు. వారి నుంచి సమాధానం రాకపోవడంతో ఇటీవల సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి ఈ ముగ్గురినీ శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. -
ఇన్సూరెన్స్ ఫ్రాడ్: పాలసీ క్లైమ్లు మార్చుకోండి.. లేదంటే?
సాక్షి, సిటీబ్యరో: ఢిల్లీ కేంద్రంగా నగరానికి చెందిన ఇద్దరిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒకరిని ఇన్సూరెన్స్ ఫ్రాడ్‌లో, మరొకరిని జాబ్ ఫ్రాడ్‌లో పట్టుకున్నారు. ఇరువురినీ మంగళవారం సిటీకి తరలించిన అధికారులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన భానుప్రతాప్ సింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఇలా ఇతడి వద్దకు దేశ వ్యాప్తంగా ఉన్న పాలసీ హోల్డర్ల వివరాలు వచ్చి చేరేవి. వీటి ఆధారంగా 2019లో నగరానికి చెందిన ఓ మహిళకు ఫోన్ చేశారు. ఈమె 2012లో రెండు బ్యాంకుల నుంచి ఆరు పాలసీలు తీసుకుని ఏటా రెన్యువల్ చేస్తూ వచ్చారు. బాధితురాలితో మాట్లాడిన భాను ప్రతాప్ మీ పాలసీలకు సంబంధించిన క్లైమ్లు ఇప్పటికీ కంపెనీల పేరుతో ఉన్నాయని, తప్పనిసరిగా మీ పేరుతో మార్చుకోవాలంటూ చెప్పాడు. దానికోసం ముందుగా కొంత మొత్తం చెల్లించాలంటూ అసలు కథ మొదలెట్టాడు. దఫదఫాలుగా రూ.50 లక్షలు ఆమె నుంచి కాజేశాడు. ఎట్టకేలకు మోసపోయానని గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ గంగాధర్ నేతృత్వంలోని బృందం భాను ప్రతాప్ ఆచూకీని ఢిల్లీలో కనిపెట్టింది. అక్కడకు వెళ్లి అతడిని అరెస్టు చేసి పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చింది. నిందితుడి నుంచి 20 తులాల బంగారం, రూ.3.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలంటూ... ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో వివిధ రకాలైన ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చి మోసం చేసిన కేసులో ఢిల్లీకే చెందిన రప్ కిషోర్‌ను సి టీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఇతగాడు నగరానికి చెందిన ఇద్దరి నుంచి ర.1.39 లక్షలు కాజేసినట్లు గుర్తించారు. దేశ వ్యాప్తంగా మో సాల కు పాల్పడిన ఇతడిని సైతం ఢిల్లీలో అరెస్టు చేసిన ఇన్స్పెక్టర్ గంగాధర్ నేతృత్వంలోని బృందం పీటీ వారెంట్‌పై మంగళవారం సిటీకి తీసుకువచ్చి రి మాండ్‌కు పంపింది. ఇతడితో పాటు ఇన్సూరెన్స్ ఫ్రాడ్‌లో నిందితుడిగా ఉన్న భాను ప్రతాప్‌ను న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకు ని విచారించాలని సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. -
విక్టర్... ఓ ప్రొఫెషనల్ చీటర్!
హైదరాబాద్ : అతడి పేరు విక్టర్ ఇమ్మానుయేల్ చంద్రకాంత్... బేసిక్‌గా చెన్నైకు చెందిన వాడైనా కొన్నాళ్ళ పాటు నగరంలోనూ ఉన్నాడు... స్వచ్ఛంద సంస్థల ముసుగులో అనేక మందితో పరిచయాలు పెంచుకున్నాడు... ఆపై అసలు కథకు తెరలేపాడు... ఓపక్క ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉద్యోగం మరోపక్క ఫైనాన్స్‌లు అంటూ హైదరాబాద్, చెన్నైల్లో ఎడాపెడా మోసాలు చేశాడు... ఓ నగరవాసి ఫిర్యాదుతో సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదు కావడంతో కటకటాల్లోకి చేరాడు. ఈ ఘరానా మోసగాడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం పేర్కొన్నారు. రెండు సంస్థలు ఏర్పాటు చేసి... చెన్నైకి చెందిన విక్టర్ గతంలో కొన్నాళ్ళ పాటు బేగంపేటలో నివసించాడు. అప్పట్లో ప్రగతి యూత్ సొసైటీ, ఉమెన్స్ ఇష్యూస్ ప్రొటెక్షన్ ఎన్ఫోర్స్మెంట్ (వైప్) పేరుతో రెండు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి సిటీకి చెందిన అనేక మందితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆపై చెన్నైకు మకాం మార్చిన విక్టర్ అక్కడ తానే బడా ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్‌గా పరిచయం చేసుకున్నాడు. ఓ బాధితుడికి భారీ మొత్తం రుణం ఇప్పిస్తానంటూ ముంబై వరకు తీసుకువెళ్ళాడు. అక్కడ తనకు పరిచయస్తుడైన ఓ వ్యక్తి కార్యాలయంలోకి తీసుకువెళ్ళి ‘అంతా ఓకే’ అంటూ ముందుగా కొంత మొత్తం చెల్లించాలని చెప్పాడు. ఈ రకంగా ఆ బాధితుడి నుంచి రూ.20 లక్షలు కాజేశాడు. ఈ రకంగా ఆ నగరంలో అనేక మంది మోసపోయినప్పటికీ ఇతడి ఆచూకీ దొరక్కపోవడంతో బాధితులు పోలీసుల వరకు వెళ్ళలేదు. ఇన్సూరెన్స్‌ల పేరుతో టోకరా... ఈ చీటర్ నగరానికి చెందిన మీర్జా ఖయ్యూం బేగ్‌ను సంప్రదించాడు. తనకు అనేక ఐటీ కంపెనీలకు చెందిన హెచ్ఆర్ మేనేజర్లతో పరిచయాలు ఉన్నాయంటూ నమ్మించాడు. వారి సంస్థల్లో పని చేస్తున్న 2300 మంది ఉద్యోగులకు ఇన్సూరెన్స్‌లు చేయాల్సి ఉందంటూ బుట్టలో వేసుకున్నాడు. ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా చేరితే వారందరూ నీ ద్వారానే ఇన్సూరెన్స్‌లు కడతారని చెప్పడంతో బేగ్ అంగీకరించాడు. ఒక్కో ఉద్యోగి రూ.10 వేల చొప్పున 2300 మంది చెల్లించే ఇన్సూరెన్స్ మొత్తం రూ.2.3 కోట్లు అంటూ లెక్కలు చూపాడు. ఈ మొత్తంలో 30 శాతం కమీషన్‌గా వస్తుందని, అందులోంచి 10 శాతం హెచ్ఆర్ మేనేజర్‌కు ఇచ్చి మిగిలింది పంచుకుందామంటూ చెప్పాడు. దీనికి బాధితుడు అంగీకరించడంతో సెక్యూరిటీ డిపాజిట్‌గా 1 శాతం, చార్జీలకు రూ.10 వేలు ఇవ్వాలంటూ రూ.2.4 లక్షలు బ్యాంకు ఖాతాలో వేయించుకుని కాజేశాడు. ఎప్పుడు కాల్ చేసినా ప్రముఖులంటూ... విక్టర్ మాటల వల్లో పడిన బేగ్ నగదు చెల్లించిన తర్వాత కొంత కాలం ఎదురు చూశారు. ఆపై మోసగాడికి ఫోన్లు చేయడం ప్రారంభించాడు. ప్రతిసారీ తాను పుణేలోనే, ముంబైలోనో ఉన్నానని, ప్రముఖులు, సెలబ్రెటీలతో పాటు మంత్రులతో మంతనాలు జరుపుతున్నానంటూ చెప్పి బిజీ అనేవాడు. చివరకు తాను మోసపోయానని గుర్తించిన బేగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్... ఏసీపీ కేసీఎస్ రఘువీర్ పర్యవేక్షణలో దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి విక్టర్‌ను గుర్తించి అరెస్టు చేశారు. ఇతడి చేతిలో మోసపోయిన వారిలో నగరానికి చెందిన మరో ఇద్దరినీ గుర్తించారు. సిటీతో పాటు చెన్నైలోనూ ఇంకా అనేక మంది ఉండచ్చని అనుమానిస్తున్నారు. 2006లో వివాహం చేసుకున్న విక్టర్ రెండు నెలలకే భార్యను వదిలేశాడు. ఇతగాడు తానో మత గురువునంటూ పలువురు మహిళల్ని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.