కోవిడ్‌ బీమా పేరిట టోకరా.. 8 మందితో ముఠా కట్టి..  | Fraud In The Name Of Covid Insurance In YSR District | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ బీమా పేరిట టోకరా.. 8 మందితో ముఠా కట్టి.. 

Published Mon, Oct 24 2022 10:47 AM | Last Updated on Mon, Oct 24 2022 10:47 AM

Fraud In The Name Of Covid Insurance In YSR District - Sakshi

సిమ్‌కార్డులు, బ్యాంక్‌ ఏటీఎం కార్డులను పరిశీలిస్తున్న తుషార్‌ డూడీ

కడప అర్బన్‌(వైఎస్సార్‌ జిల్లా): కోవిడ్‌ బారినపడి మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులను వైఎస్సార్‌ బీమా పేరుతో మోసగిస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టును వైఎస్సార్‌ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ముఠాలో కీలక నిందితుడు నేపాల్‌కు చెందిన అశోక్‌ లోహర్‌తోపాటు మరో ముగ్గురిని ఢిల్లీలో పోలీస్‌ ప్రత్యేక బృందాలు అరెస్ట్‌ చేశాయి. వారి నుంచి రూ.3.29 లక్షల నగదుతోపాటు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు చెందిన 73 ఏటీఎం కార్డులు, 18 సెల్‌ఫోన్లు, 290 సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కడపలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్‌) తుషార్‌డూడీ ఆదివారం మీడియాకు వెల్లడించారు.
చదవండి: ప్రేమ పెళ్లి.. సైకో భర్త.. పెళ్లయిన ఆరు నెలలకే భార్య షాకింగ్‌ నిర్ణయం

వివిధ ప్రాంతాలకు చెందిన 8 మంది కలిసి అంతర్జాతీయ ముఠాగా ఏర్పడి కోవిడ్‌ కారణంగా మరణించిన వారి వివరాలను సేకరించారు. మృతుల బంధువులకు కలెక్టరేట్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెప్పి.. ప్రభుత్వం నుంచి వైఎస్సార్‌ బీమా పథకం కింద పరిహారం ఇప్పిస్తామని నమ్మబలికారు. ఇందుకోసం న్యూఢిల్లీలోని పాలిమర్‌బాగ్‌ ప్రాంతంలో నివాసం వుంటున్న నేపాల్‌ దేశస్తుడు అశోక్‌ లోహర్‌ సాయంతో అద్దె గదిలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు.

ఏపీకి చెందిన నిరుద్యోగ యువకులను ఢిల్లీకి పిలిపించి, బాధితులకు ఫోన్‌లు చేయించారు. రూ.50 లక్షలు మంజూరు చేయిస్తామని, ఇందుకోసం కొంత మొత్తం చెల్లించాలని నమ్మించారు. ఇలా బద్వేలుకు చెందిన పి.ఆదిలక్ష్మి నుంచి యూపీఐ చెల్లింపుల ద్వారా సుమారు రూ.9 లక్షలు కాజేశారు. మరో 13 మంది నుంచి యూపీఐ చెల్లింపుల ద్వారా రూ.8,28,086 వసూలు చేశారు. ఇందులో నష్టపోయిన కడప నగరానికి చెందిన ఒంటిబీరం రమణారెడ్డి, నిర్మల, ఎంవీ సునీత, ఖాజీపేటకు చెందిన ఎస్‌.నాగవేణి, విఘ్నేశ్వరి, పెండ్లిమర్రికి చెందిన విజయకుమారి, ప్రొద్దుటూరుకు చెందిన కృష్ణ చైతన్య, జింకా హరిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ప్రత్యేక బృందాల ఏర్పాటుతో.. 
విచారణలో భాగంగా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 12న వైఎస్సార్‌ జిల్లాలోని కలసపాడు బలిజపల్లె నివాసి, ప్రస్తుతం ఖాజీపేట మండలం మిడుతూరుకు చెందిన మీనుగ వెంకటేష్‌ను అరెస్ట్‌ చేశారు. అతను విచారణలో తెలిపిన వివరాల ఆధారంగా.. ఖాజీపేట మండలం మిడుతూరుకు చెందిన మీనుగ నరేంద్ర, జంగాలపల్లి జనార్ధన్, ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామానికి చెందిన ఆవులమంద నారాయణ, నేపాల్‌కు చెందిన ప్రస్తుతం ఢిల్లీ సిటీలోని పితాంపుర నార్త్‌ వెస్ట్‌లో ఉన్న అశోక్‌ లోహర్‌ అనే వారిని అరెస్ట్‌ చేశారు. కాగా, రంజిత్, అతని సోదరుడు బద్రీసింగ్, అక్షయ్‌ ఈ ముఠా నాయకులని పట్టుబడిన నిందితులు తెలిపారు. వీరి ఖాతాల వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు, ఇన్‌కంటాక్స్, విదేశీ వ్యవహారాల శాఖకు తదుపరి చర్యల నిమిత్తం అందజేస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement