విక్టర్... ఓ ప్రొఫెషనల్ చీటర్!
హైదరాబాద్ : అతడి పేరు విక్టర్ ఇమ్మానుయేల్ చంద్రకాంత్... బేసిక్‌గా చెన్నైకు చెందిన వాడైనా కొన్నాళ్ళ పాటు నగరంలోనూ ఉన్నాడు... స్వచ్ఛంద సంస్థల ముసుగులో అనేక మందితో పరిచయాలు పెంచుకున్నాడు... ఆపై అసలు కథకు తెరలేపాడు... ఓపక్క ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉద్యోగం మరోపక్క ఫైనాన్స్‌లు అంటూ హైదరాబాద్, చెన్నైల్లో ఎడాపెడా మోసాలు చేశాడు... ఓ నగరవాసి ఫిర్యాదుతో సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదు కావడంతో కటకటాల్లోకి చేరాడు. ఈ ఘరానా మోసగాడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం పేర్కొన్నారు.
రెండు సంస్థలు ఏర్పాటు చేసి...
చెన్నైకి చెందిన విక్టర్ గతంలో కొన్నాళ్ళ పాటు బేగంపేటలో నివసించాడు. అప్పట్లో ప్రగతి యూత్ సొసైటీ, ఉమెన్స్ ఇష్యూస్ ప్రొటెక్షన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (వైప్) పేరుతో రెండు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి సిటీకి చెందిన అనేక మందితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆపై చెన్నైకు మకాం మార్చిన విక్టర్ అక్కడ తానే బడా ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్‌గా పరిచయం చేసుకున్నాడు. ఓ బాధితుడికి భారీ మొత్తం రుణం ఇప్పిస్తానంటూ ముంబై వరకు తీసుకువెళ్ళాడు.
అక్కడ తనకు పరిచయస్తుడైన ఓ వ్యక్తి కార్యాలయంలోకి తీసుకువెళ్ళి ‘అంతా ఓకే’ అంటూ ముందుగా కొంత మొత్తం చెల్లించాలని చెప్పాడు. ఈ రకంగా ఆ బాధితుడి నుంచి రూ.20 లక్షలు కాజేశాడు. ఈ రకంగా ఆ నగరంలో అనేక మంది మోసపోయినప్పటికీ ఇతడి ఆచూకీ దొరక్కపోవడంతో బాధితులు పోలీసుల వరకు వెళ్ళలేదు.
ఇన్సూరెన్స్‌ల పేరుతో టోకరా...
ఈ చీటర్ నగరానికి చెందిన మీర్జా ఖయ్యూం బేగ్‌ను సంప్రదించాడు. తనకు అనేక ఐటీ కంపెనీలకు చెందిన హెచ్‌ఆర్ మేనేజర్లతో పరిచయాలు ఉన్నాయంటూ నమ్మించాడు. వారి సంస్థల్లో పని చేస్తున్న 2300 మంది ఉద్యోగులకు ఇన్సూరెన్స్‌లు చేయాల్సి ఉందంటూ బుట్టలో వేసుకున్నాడు. ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా చేరితే వారందరూ నీ ద్వారానే ఇన్సూరెన్స్‌లు కడతారని చెప్పడంతో బేగ్ అంగీకరించాడు.
ఒక్కో ఉద్యోగి రూ.10 వేల చొప్పున 2300 మంది చెల్లించే ఇన్సూరెన్స్ మొత్తం రూ.2.3 కోట్లు అంటూ లెక్కలు చూపాడు. ఈ మొత్తంలో 30 శాతం కమీషన్‌గా వస్తుందని, అందులోంచి 10 శాతం హెచ్‌ఆర్ మేనేజర్‌కు ఇచ్చి మిగిలింది పంచుకుందామంటూ చెప్పాడు. దీనికి బాధితుడు అంగీకరించడంతో సెక్యూరిటీ డిపాజిట్‌గా 1 శాతం, చార్జీలకు రూ.10 వేలు ఇవ్వాలంటూ రూ.2.4 లక్షలు బ్యాంకు ఖాతాలో వేయించుకుని కాజేశాడు.
ఎప్పుడు కాల్ చేసినా ప్రముఖులంటూ...
విక్టర్ మాటల వల్లో పడిన బేగ్ నగదు చెల్లించిన తర్వాత కొంత కాలం ఎదురు చూశారు. ఆపై మోసగాడికి ఫోన్లు చేయడం ప్రారంభించాడు. ప్రతిసారీ తాను పుణేలోనే, ముంబైలోనో ఉన్నానని, ప్రముఖులు, సెలబ్రెటీలతో పాటు మంత్రులతో మంతనాలు జరుపుతున్నానంటూ చెప్పి బిజీ అనేవాడు. చివరకు తాను మోసపోయానని గుర్తించిన బేగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్... ఏసీపీ కేసీఎస్ రఘువీర్ పర్యవేక్షణలో దర్యాప్తు చేశారు.
సాంకేతిక ఆధారాలను బట్టి విక్టర్‌ను గుర్తించి అరెస్టు చేశారు. ఇతడి చేతిలో మోసపోయిన వారిలో నగరానికి చెందిన మరో ఇద్దరినీ గుర్తించారు. సిటీతో పాటు చెన్నైలోనూ ఇంకా అనేక మంది ఉండచ్చని అనుమానిస్తున్నారు. 2006లో వివాహం చేసుకున్న విక్టర్ రెండు నెలలకే భార్యను వదిలేశాడు. ఇతగాడు తానో మత గురువునంటూ పలువురు మహిళల్ని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.