సోషల్‌ మీడియాపై పోలీస్‌ నిఘా! | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాపై పోలీస్‌ నిఘా!

Published Sun, Sep 17 2023 6:38 AM | Last Updated on Sun, Sep 17 2023 7:03 AM

- - Sakshi

హైదరాబాద్: గ్రేటర్‌లో పాలక, ప్రతిపక్ష పార్టీల సమావేశాలతో ఎన్నికల వాతావరణం నెలకొంది. దీనికి తోడు గణేశ్‌ నవరాత్రులు, నిమజ్జనం, మిలాద్‌ ఉన్‌ నబీ, దసరా, దీపావళి ఇలా వరుస పండుగలు వస్తున్నాయి. దీంతో గ్రేటర్‌ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే పోస్టులపై పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టింది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్ట్రాగామ్‌, స్నాప్‌చాట్‌, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లపై నిఘా పెట్టారు. సైబర్‌ పెట్రోలింగ్‌, హైదరాబాద్‌లో సోషల్‌ మీడియా యాక్షన్‌, స్క్వాడ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (స్మాష్‌) పేరిట రంగంలోకి దిగారు.

సామాజిక మాధ్యమాలతో రెప్పపాటులోనే ప్రపంచం నలువైపులా భావోద్వేగాలను రెచ్చగొట్టే పరిస్థితి వచ్చింది. ఇది శాంతి భద్రతల సమస్యకు కారణమవుతోంది.

సామాజిక మాధ్యమాలలో ఎవరైనా అశ్లీల, అసభ్యకర, రెచ్చగొట్టే పోస్టులు, విద్వేష ప్రసంగాలు, వందతులు, మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలను పెడితే వాటిపై ఫిర్యాదులు వచ్చి..చర్యలు తీసుకునేలోపే అనర్థం జరుగుతోంది.

దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు సైబర్‌ పెట్రోలింగ్‌, స్మాష్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక టూల్‌ సహాయంతో పోలీసులు వీటిని గుర్తిస్తారు.

సాధారణ రోజుల్లో 4–5 వేల సామాజిక ఖాతాలను పరిశీలిస్తే.. ఇలాంటి కీలకమైన సమయాల్లో రోజుకు 10 వేలకు పైగా సోషల్‌ అకౌంట్లను విశ్లేషిస్తుంటారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాలను గుర్తించగానే పోలీసు విభాగాలన్నీ అప్రమత్తమవుతారు. ఆ పోస్టు చేసిన వ్యక్తి లేదా సంస్థలను నిమిషాల వ్యవధిలోనే గుర్తించి, వీరిపై ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు.

వదంతులు వ్యాప్తి చేసే వారి ఫోన్‌ ఐఎంఈఐ నంబర్లు, ఐపీ అడ్రస్‌ల ఆధారంగా క్రియేటర్లను పోలీసులు గుర్తిస్తారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement