న్యూఢిల్లీ: పన్నులపరంగా సంక్లిష్టమైన నిబంధనలను పాటించడంలో కంపెనీలు గణనీయంగా సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. బడా కంపెనీల్లోని ట్యాక్స్ టీమ్‌లు టెక్నాలజీని ఉపయోగిస్తున్నప్పటికీ ఏకంగా 70 శాతం సమయాన్ని ఇందుకోసమే కేటాయించాల్సి వస్తోంది. టీడీఎస్ నిబంధనలను పాటించడం సహా కంపెనీలు పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ నిర్వహించిన ఒక సర్వేలో ఇది వెల్లడైంది.
టీడీఎస్ డేటా రీకన్సిలియేషన్, తత్సంబంధ డేటాను ప్రాసెస్ / రీ–ప్రాసెస్ చేయడం వంటి అంశాల విషయంలో పెద్ద సంఖ్యలో సిబ్బంది టీడీఎస్ నిబంధనల పాటింపుపైనే పూర్తిగా దృష్టి పెట్టాల్సి వస్తోంది. టీడీఎస్ పరిధిలోకి మరిన్ని లావాదేవీలను చేర్చడంతో సమస్య మరింత జటిలమవుతోంది. ప్రస్తుతం కార్పొరేట్ ట్యాక్స్‌పేయర్లు సింహభాగం సమయాన్ని నిబంధనల పాటింపునకు కేటాయించడంతోనే సరిపోతోందని డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్ రోహింటన్ సిధ్వా చెప్పారు.
ఈ సంక్లిష్టతను తగ్గించాలంటే వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు సేకరించే డేటాను అన్ని విభాగాలు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటే శ్రేయస్కరమని సంస్థలు భావిస్తున్నాయి. ట్యాక్స్ రిపోర్టింగ్ నిబంధనలను సరళతరం చేయడం వల్ల మరింత వేగవంతంగాను, సమర్ధవంతంగాను ఖాతాల రీకన్సిలియేషన్‌లను చేయడానికి వీలవుతుందని కంపెనీలు కోరుతున్నట్లు డెలాయిట్ సర్వేలో వెల్లడైంది.
నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు..
♦వార్షిక రిటర్నులు, జీఎస్‌టీ రిటర్నులతో పాటు వివిధ రూల్స్ కింద సమర్పించే ఫైలింగ్స్‌ను ఉపయోగించుకోవడం ద్వారా.. పాటించాల్సిన నిబంధనల సంఖ్యను తగ్గిస్తే ట్యాక్స్ డిజిటలైజేషన్‌కు దోహదపడగలదని సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో మూడింట రెండొంతుల సంస్థలు అభిప్రాయపడ్డాయి. వీటి టర్నోవరు రూ. 6,400 కోట్ల పైచిలుకు ఉంది.
♦ పన్ను నిబంధనల కింద రిపోర్ట్ చేయాల్సిన అంశాల రూల్స్‌ను సరళతరం చేయాలని బడా కంపెనీలు కోరుతున్నాయి.
♦రూ. 500 కోట్ల కన్నా తక్కువ టర్నోవరు ఉన్న వాటిల్లో అరవై నాలుగు శాతం సంస్థలు.. టెక్నాలజీ సహాయంతో టీడీఎస్/టీసీఎస్ నిబంధనలను క్రమబద్ధీకరించాలని కోరుతున్నాయి.
♦ఐటీఆర్‌లలో ముందస్తుగానే వివరాలన్నీ పొందుపర్చి ఉండేలా ప్రవేశపెట్టిన ఈ–ఫైలింగ్ 2.0 ప్రయోజనకరంగా ఉంటోందని సంస్థలు తెలిపాయి. దీనివల్ల డేటాను సమగ్రపర్చేందుకు వెచ్చించాల్సిన సమయంతో పాటు లోపాలకూ ఆస్కారం తగ్గిందని కొత్త విధానాన్ని స్వాగతించాయి. అలాగే కొత్తగా తీర్చిదిద్దిన ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్ వినియోగానికి సులభతరంగా ఉందని పేర్కొన్నాయి.
♦స్క్రూటినీ కోసం కేసులను ఎంపిక చేసేందుకు కంప్యూటర్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టడం, రిటర్నుల ప్రాసెసింగ్ .. రిఫండ్‌లను వేగవంతం చేయడాన్ని రూ. 500–3,000 వరకు టర్నోవరు ఉన్న సంస్థలు స్వాగతించాయి.
♦రూ. 3,000–6,400 కోట్ల వరకు టర్నోవరు ఉన్న కంపెనీల్లో చాలా మటుకు సంస్థలు ఫేస్‌లెస్ అసెస్‌మెంట్లను స్వాగతించాయి.
♦కంపెనీ పరిమాణాన్ని బట్టి విజ్ఞప్తులు వివిధ రకాలుగా ఉంటున్నాయి. పెద్ద సంస్థలు ట్యాక్స్ రిపోర్టింగ్‌ను సరళతరం చేయాలని కోరుతుండగా, చిన్న సంస్థలు టీడీఎస్/టీసీఎస్ నిబంధనలను క్రమబద్ధీకరించాలని కోరుతున్నాయి.
♦60 శాతం కంపెనీలు ఇప్పటికే లావాదేవీల పన్నులు, వార్షిక ట్యాక్సేషన్ ప్రక్రియ ఆటోమేషన్‌ను పూర్తి చేశాయి. మరో 40 శాతం సంస్థలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
♦ 129 మంది ట్యాక్స్ నిపుణులు ఈ సర్వేలో పాల్గొన్నారు. డైరెక్టర్లు, ఫైనాన్స్ విభాగాల ప్రెసిడెంట్లు, జనరల్ మేనేజర్లు, వైస్–ప్రెసిడెంట్లు మొదలైన వారు వీరిలో ఉన్నారు.
♦ ఆర్థిక సర్వీసులు, ప్రభుత్వ సర్వీసులు, లైఫ్ సైన్స్.. హెల్త్‌కేర్, టెక్నాలజీ, మీడియా టెలీకమ్యూనికేషన్ తదితర రంగాల సంస్థలను సర్వే చేశారు.
Comments
Please login to add a commentAdd a comment