Only 24% companies in India ready to defend cybersecurity threats: Cisco - Sakshi
Sakshi News home page

సైబర్‌ దాడులను తట్టుకునే సామర్థ్యం మనకుందా? సిస్కో సైబర్‌ సెక్యూరిటీ కీలక సర్వే

Published Wed, Mar 22 2023 9:22 AM | Last Updated on Wed, Mar 22 2023 11:26 AM

only 24 pc companies in India ready to defend cybersecurity threats Cisco - Sakshi

జైపూర్‌: ఒకవైపు సైబర్‌ దాడులు అంతకంతకూ పెరిగిపోతుంటే.. మరోవైపు ఆ దాడుల నుంచి రక్షించుకునే సామర్థ్యాలు దేశంలో చాలా కంపెనీలకు లేవన్న విషయాన్ని సైబర్‌ సెక్యూరిటీపై సిస్కో నిర్వహించిన సర్వేలో తెలిసింది. అధునాతన సైబర్‌ దాడులను తట్టుకునే సామర్థ్యాలు కేవలం 24 శాతం కంపెనీలకే ఉన్నట్టు సిస్కో ప్రకటించింది.

ఇదీ చదవండి: స్టార్‌బక్స్‌ సీఈవోగా నరసింహన్‌.. బాధ్యతలు చేపట్టిన ప్రవాస భారతీయుడు

వచ్చే మూడేళ్లలో భారత్‌లో ఐదు లక్షల మంది సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు శిక్షణ ఇవ్వాలన్నది తన లక్ష్యంగా పేర్కొంది. వచ్చే 12–24 నెలల్లో తమ వ్యాపారాలకు విఘాతం కలిగించే సైబర్‌ దాడులు జరగొచ్చని భావిస్తున్నట్టు సిస్కో సర్వేలో 90 శాతం మంది చెప్పారు. అంతర్జాతీయంగా సైబర్‌ సెక్యూరిటీ సన్నద్ధత సగటున కేవలం 15 శాతంగానే ఉందని, ఈ విధంగా చూస్తే భారత్‌ మెరుగ్గా ఉన్నట్టు సిస్కో తెలిపింది.

భారత్‌లోని 38 శాతం కంపెనీలు ఆరంభ, ఏర్పాటు స్థాయిలో ఉన్నవేనని పేర్కొంది. స్వతంత్ర థర్డ్‌ పార్టీతో సిస్కో ఈ సర్వే చేయించింది. 27 మార్కెట్ల నుంచి 6,700 మంది సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు సర్వేలో పాల్గొన్నారు. సైబర్‌ దాడులను ఎదుర్కొనేందుకు ఎలాంటి సొల్యూషన్లను కంపెనీలు ఏర్పాటు చేశాయి, అమలు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది.

ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్‌.. కీలక బాధ్యతలపై చర్చలు! 

చిన్న కంపెనీలకు ముప్పు అధికం.. 
ఇందులో ఆరంభ, స్టార్టప్, పురోగతి, పూర్తి స్థాయి కంపెనీలు అని సిస్కో సర్వే వర్గీకరించింది. ఆరంభ దశలోని కంపెనీలు సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్లను ఏర్పాటు చేసే దశలో ఉన్నాయి. వీటికి 10 కంటే తక్కువే స్కోర్‌ లభించింది. ఏర్పాటు దశలోని కంపెనీలు సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్లను అమలు చేసే దశలో ఉన్నాయి. వీటికి స్కోర్‌ 11–44 మధ్య ఉంది. సైబర్‌ భద్రతా సన్నద్ధత విషయంలో ఇవి సగటు కంటే తక్కువ పనితీరు చూపిన్నట్టు సర్వే నివేదిక తెలిపింది.

పురోగతి దశలోని కంపెనీలు సైబర్‌ భద్రతా సన్నద్ధత పరంగా సగటు కంటే ఎక్కువ పనితీరు చూపిస్తున్నాయి. ఇక పూర్తి స్థాయికి చేరిన కంపెనీలు సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్లలో చాలా ముందంజలో ఉండడమే కాకుండా, రిస్క్‌లను ఎదుర్కొనే సామర్థ్యాలతో ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో తాము సైబర్‌ దాడిని ఎదుర్కొన్నామని, వీటి కారణంగా తమకు రూ.4–5 కోట్ల స్థాయిలో నష్టం ఎదురైనట్టు 53 శాతం మంది సర్వేలో చెప్పారు.  

ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.. 
‘‘సైబర్‌ సెక్యూరిటీకి వ్యాపార సంస్థలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే అవి తమ డిజిటైజేషన్‌ ప్రయాణాన్ని కొనసాగించగలవు. హైబ్రిడ్‌ పని విధానం ప్రముఖంగా మారడం, సేవలు అప్లికేషన్‌ ఆధారితం కావడంతో.. సైబర్‌ భద్రతా సన్నద్ధత పరంగా ఉన్న అంతరాలను తగ్గించుకోవడం కంపెనీలకు కీలకం’’ అని సిస్కో ఇండియా సెక్యూరిటీ బిజినెస్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ సమీర్‌ మిశ్రా తెలిపారు. 

ఇదీ చదవండి: గేమింగ్‌ హబ్‌గా భారత్‌.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement