సాక్షి, న్యూఢిల్లీ : 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశీ కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు సగటున 7.8 శాతం వేతన పెంపును చేపడతాయని డెలాయిట్ ఇండియా సర్వే వెల్లడించింది. కంపెనీలపై మార్జిన్ ఒత్తిళ్లు, ఆర్థిక మందగమనం వంటి కారణాలతో అంతకుముందు ఏడాదితో పోలిస్తే వేతన వృద్ధి తగ్గుముఖం పట్టిందని డెలాయిట్ ఇండియా పేర్కొంది. 2019-20లో ఉద్యోగుల వేతనాలు సగటున 8.2 శాతం మేర పెరిగాయని, ఈసారి వేతన వృద్ధి 40 బేసిస్ పాయింట్లు తక్కువగా నమోదవుతుందని అంచనా వేస్తున్నామని సిబ్బంది వేతన ధోరణుల పేరిట రూపొందిన సర్వే నివేదిక పేర్కొంది.
సర్వేలో పాల్గొన్న 50 శాతం కంపెనీలు 2020-21లో వేతనాలు 8 శాతంలోపు పెరుగుతాయని పేర్కొనగా, 10 శాతం పైగా వేతన పెంపు ఉంటుందని కేవలం 8 శాతం కంపెనీలే ఆశాభావం వ్యెక్తం చేశాయని సర్వే స్పష్టం చేసింది. ఇక 30 శాతం కంపెనీలు వేతన పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఇక మౌలిక, నిర్మాణ రంగం, బ్యాంకింగేతర కంపెనీలు, టెలికాం రంగాల్లో వేతన పెంపు తక్కువగా ఉంటుందని నివేదిక పేర్కొంది. వైవిధ్యం, సామర్ధ్యం ఆధారంగా కంపెనీలు వ్యయ బడ్జెట్‌లను నిర్వహిస్తున్నాయని తెలిపింది. పలు రంగాలకు సంబంధించిన 300 కంపెనీల హెచ్‌ఆర్ ప్రతినిధులను పలుకరించి ఈ సర్వే నివేదికను రూపొందించినట్టు డెలాయిట్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment