
న్యూఢిల్లీ: దేశీయంగా బ్యాంక్ ఖాతాల్లో మహిళల వాటా 39.2 శాతమని ఒక నివేదికలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలలో అయితే మరింత అధికంగా 42.2 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది. ‘ఉమన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024: సెలెక్టెడ్ ఇండికేటర్స్, డేటా’ పేరుతో గణాంకాలు, పథకాల అమలు శాఖ నివేదిక విడుదల చేసింది.
దీని ప్రకారం మహిళల ఖాతాల ద్వారా మొత్తం బ్యాంక్ డిపాజిట్లలో 39.7 శాతం లభిస్తున్నాయి. ఇక కొన్నేళ్లుగా స్టాక్ మార్కెట్లో ప్రజల పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీంతో డీమ్యాట్ ఖాతాల సంఖ్య బలపడుతూ వస్తోంది. 2021 మార్చి 31లో నమోదైన 33.26 మిలియన్ డీమ్యా ట్ ఖాతాలు 2024 నవంబర్ 30కల్లా 143.02 మిలియన్లకు చేరాయి. వెరసి నాలుగు రెట్లుపైగా ఎగశాయి. వీటిలో పురుషుల ఖాతాలు భారీగా 26.59 మిలియన్ల నుంచి 115.31 మిలియన్లకు జంప్‌చేశాయి. అయితే మహిళల ఖాతాలు సైతం 6.67 మిలియన్ల నుంచి 27.71 మిలియన్లకు ఎగశాయి.
1952లో 17.32 కోట్లుగా నమోదైన మహిళా ఓటర్ల సంఖ్య 2024 కల్లా 97.8 కోట్లకు జంప్‌చేసింది. కనీసం ఒక మహిళా డైరెక్టర్‌గల.. డీపీఐఐటీ గుర్తింపు పొందిన స్టార్టప్‌లలోనూ పురోగతి కనిపిస్తోంది. 2017లో ఈ తరహా స్టార్టప్‌లు 1,943 నమోదుకాగా.. 2024కల్లా 17,405కు ఎగశాయి. వెరసి మహిళా ఎంటర్‌ప్రెన్సూర్స్ సంఖ్య బలపడుతోంది.