న్యూఢిల్లీ: ప్రస్తుత పండుగల సీజన్‌లో వినియోగదారులు అధిక వ్యయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు డెలాయిట్ సర్వే వెల్లడించింది. లగ్జరీ, సెలబ్రేటరీ (వేడుకలకు సంబంధించి) వస్తువుల కొనుగోలు పెరగడాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొంది. సమీప భవిష్యత్తులో ఊహించని పెద్ద మొత్తంలో ఖర్చులు వచ్చినా తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని ‘డెలాయిట్ కన్జ్యూమర్ సిగ్నల్ రీసెర్చ్’ సర్వేలో సగం మంది చెప్పారు.
‘‘భారత్‌లో పండుగల సీజన్ సమీపిస్తోంది. దీంతో వినియోగదారుల్లో నమ్మకం పెరుగుతోంది. 56 శాతం మంది వేడుకలకు సంబంధించిన (పుట్టిన రోజు, వివాహం తదితర) వస్తువులు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు’’అని ఈ సర్వే నివేదిక వెల్లడించింది. సమీప కాలంలో వస్త్రాలు, వ్యక్తిగత సంరక్షణ, వినోదం, విహారంపై వ్యయాలు పెరగొచ్చని తెలిపింది.
భారత ఆర్థిక వ్యవస్థ మంచి వృద్ధిని సాధిస్తుండడంతో, వినియోగదారులు విలాస వస్తువులు, ఖరీదైన వస్తువుల కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తున్నట్టు డెలాయిట్ ఆసియా పసిఫిక్ పార్ట్‌నర్ రాజీవ్‌సింగ్ పేర్కొన్నారు. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రవాణా, ఆతిథ్యానికి కూడా ఇదే ధోరణి విస్తరిస్తున్నట్టు చెప్పారు. టైర్ 2, 3 పట్టణాల్లోనూ గణనీయమైన వృద్ధి కనిపిస్తున్నట్టు తెలిపారు.
విచక్షణారహిత వినియోగం పెరగనుందని, దీంతో రిటైల్, ఆటోమోటివ్, రవాణా, ఆతిథ్య రంగాలు ప్రయోజనం పొందుతాయని వివరించారు. భారత వినియోగదారులు కేవలం విలావవంతమైన కొనుగోళ్లకే పరిమితం కావడం లేదని, పర్యాటక ప్రదేశాలను చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు డెలాయిట్ నివేదిక తెలిపింది. ఇందుకు నిదర్శంగా దేశీయ, అంతర్జాతీయ విమాన బుకింగ్‌లను పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment