ముడిచమురు అంతర్జాతీయంగా భారీగా పడిపోయినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం రికార్డు స్థాయి వైపు పరుగులు పెడుతున్నాయి. జూన్ 6న మొదలైన రేట్ల పెంపు దాదాపుగా ప్రతీ రోజు కొనసాగుతూనే ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీ సంగతి తీసుకుంటే జూన్ 6న లీటరు పెట్రోల్ రేటు రూ.71.26గా ఉండగా, జూన్ 17 నాటికి రూ.77.28కి చేరింది. డీజిల్ రేటు లీటరుకు రూ.69.39గా ఉండగా, రూ. 75.79కి ఎగిసింది.
ఇదే తీరు కొనసాగితే కొద్ది రోజుల్లోనే కొన్ని రాష్ట్రాల్లో రేటు రూ. 100 కూడా దాటేస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ట్యాక్సులు, కమీషన్లు లేకుండా వాస్తవానికి డీలరు స్థాయిలో రూ.22.44 స్థాయిలో ఉన్న పెట్రోలు ధర.. రిటైల్‌గా కొనుగోలుదారు స్థాయికి వచ్చేటప్పటికి ఏకంగా అనేక రెట్లు పెరిగిపోవడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు, వ్యాట్ మోత మోగిస్తుండటమే కారణం. ఇంధనాల రేటులో దాదాపు 60 శాతం పైగా భాగాన్ని ఇవే ఆక్రమిస్తున్నాయి.
ఎందుకంటే..
కరోనా వైరస్ కట్టడికి ఉద్దేశించిన లాక్‌డౌన్‌తో పన్ను ఆదాయాలకు గండి పడిన నేపథ్యంలో కొంత భాగాన్నైనా పూడ్చుకునేందుకు ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడుతున్నాయని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేటు 30 డాలర్ల దిగువకు పడిపోయినప్పుడు కేంద్రం మే 5న ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్‌పై రూ.10 మేర (లీటరుకు), డీజిల్‌పై రూ.13 మేర పెంచింది. ఇలా వచ్చే ఆదాయాన్ని ఇన్‌ఫ్రా, ఇతరత్రా అభివృద్ధి ప్రాజెక్టులకు మళ్లిస్తామని తెలిపింది.
ప్రస్తుతం క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇంధనాలపై సుంకాలు, పన్నులను తగ్గించే ఆస్కారం ఉండకపోవచ్చని తెలిపాయి. అటు చమురు కంపెనీలు తమ ఆదాయ నష్టాలను భర్తీ చేసుకునేందుకు రేట్లను క్రమంగా పెంచుకుంటూ పోతున్నాయి. ఈ పెంపు 30 పైసలు.. 40 పైసల స్థాయికి తగ్గినా.. మొత్తం మీద చూస్తే జూన్ ఆఖరు దాకా రేట్ల పెంపు కొనసాగడం మాత్రం తప్పకపోవచ్చన్న అభిప్రాయాలు నెలకొన్నాయి.
సుంకాల భారం..
దేశ రాజధాని ఢిల్లీ సంగతి తీసుకుంటే లీటరు పెట్రోలు వాస్తవ ధర రూ. 22.44. వ్యాట్, ఎక్సైజ్ సుంకం, డీలర్ల కమీషన్ ఇవన్నీ కలిపితే మంగళవారం నాటి రిటైల్ రేటు ఏకంగా రూ. 76.73 పలికింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్స్ఛైజ్ సుంకం పెట్రోల్‌పై లీటరుకు రూ. 32.98గా, డీజిల్‌పై లీటరుకు రూ. 31.83గా ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు విధించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రాష్ట్రాన్ని బట్టి మారుతుంటుంది. మధ్యప్రదేశ్, కేరళ, రాజస్తాన్, కర్ణాటక మొదలైనవి అత్యధికంగా 30% వ్యాట్ విధిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు, డీలర్ కమీషన్ విషయానికొస్తే.. పెట్రోల్ బంకు ఉన్న ప్రాంతాన్ని బట్టి ఇది రూ. 2–4 మధ్య ఉంటుంది. ఢిల్లీ సంగతి తీసుకుంటే పెట్రోల్‌పై డీలరు కమీషన్ లీటరుకు రూ. 3.57, డీజిల్‌పై రూ. 2.51గా ఉంది. పెట్రోలియం రంగంపై పన్నులతో కేంద్రానికి రూ. 3.48 లక్షల కోట్లు, రాష్ట్రాలకు రూ. 2.27 లక్షల కోట్లు వస్తాయని గణాంకాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment