టెక్స్‌టైల్స్‌పై పన్ను పోటు
చీరాల అర్బన్/ మార్కాపురం : కేంద్ర ప్రభుత్వం వస్త్ర వ్యాపారంపై జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) విధించడాన్ని వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల వ్యాపారాలు దెబ్బతిని దుకాణాలు మూతపడే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వస్త్రాలపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీఎస్టీని నిరసనగా ఆలిండియా టెక్స్‌టైల్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు వ్యాపారులు నాలుగురోజుల పాటు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా మార్కాపురం, చీరాల, ఒంగోలు, కందుకూరు, గిద్దలూరు, కనిగిరి, పర్చూరు, సింగరాయకొండ, అద్దంకి తదితర ముఖ్య పట్టణాల్లో వస్త్ర దుకాణాలు మూత పడనున్నాయి. క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్‌లో 21 సంఘాలు ఉండగా.. ఇందులో సుమారు రెండు వేల వస్త్ర దుకాణాల యజమానులు సభ్యులుగా ఉన్నారు. వీరంతా జీఎస్టీకి నిరసనగా సమ్మెలో పాల్గొంటున్నారు.
చిన్న బొంబాయిగా పేరొందిన చీరాల వస్త్ర వ్యాపారానికి పెట్టింది పేరు. సూరత్ నుంచి నేరుగా వస్త్రాలు ఇక్కడికి దిగుమతి అవుతుంటాయి. చీరాల కేంద్రంగా జరుగుతున్న వస్త్ర వ్యాపారంపై ఎంతోమంది చిన్న చిన్నవ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ కారణంగా చిన్న వ్యాపారులకు తీవ్ర నష్టం జరగనుంది. ప్రతి 15 రోజులకు జరిగిన వ్యాపారంపై లెక్కలు చూపించి వివరాలను అందించా లని కేంద్రం సూచించడం వీరికి మరింత భారంగా మారింది. గతంలో వ్యాట్‌ను తొలగించాలని కోరుతూ వ్యాపారులు చేసిన ఆందోళనతో ఆ విధానాన్ని నిలుపుదల చేశారు. ఇప్పుడు వ్యాట్ నుంచి జీఎస్టీకి మారాలంటే 17 రకాల డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతినెలా బిల్లులు జీఎస్టీ సాఫ్ట్‌వేర్‌లో ఆన్‌లైన్ చేయాలంటే ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించుకోవాల్సి ఉంటుందని, ఇదంతా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కు సాధ్యమవుతుందే గాని, చిన్న వ్యాపారులకు సాధ్యమయ్యే పని కాదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చీరాలలో రిలే నిరాహార దీక్షలు..
చీరాల టెక్స్‌టైల్స్ మర్చంట్స్ అసోసియేషన్ (టీటీఎంఏ) ఆధ్వర్యంలో మంగళవారం నుంచి నాలుగు రోజులు రోజులు పాటు స్థానిక ఆర్.ఆర్.రోడ్డులో రిలే నిరాహారదీక్ష చేపడుతున్నట్లు టీటీఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని లీలాధరరావు, ఎ.శ్రీనివాసరావులు తెలిపారు. స్థానిక మహాత్మాగాంధీ క్లాత్ (ఎంజీసీ)మార్కెట్‌లోని టీటీఎంఏ కార్యాలయంలో సమావేశమైన ప్రతినిధులు నాలుగు రోజుల కార్యాచరణ ప్రకటించారు. ప్రతిరోజు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి నిరాహారదీక్ష శిబిరంలో పాల్గొనడం, ఈనెల 30న బ్లాక్ డేగా ప్రకటించి నల్లజెండాలు, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఇటీవల జీఎస్టీ విధింపుపై వస్త్ర వ్యాపారులు ఒక్కరోజు బంద్ పాటించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
భారమంతా ప్రజలపైనే..
వస్త్రాలపై జీఎస్టీ విధించడం వలన భారం మొత్తం ప్రజలపైనే పడుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా చదువు, వస్త్రాలు, మందులు, వృత్తి సేవలపై పన్ను విధించారు. వెయ్యి రూపాయలు విలువ గల చీర కొంటే 5శాతం, వెయ్యి పైన కొంటే 12శాతం పన్ను చెల్లించాలి. ఆ భారమంతా ప్రజలపైనే పడుతుంది. ప్రతి బిల్లు ఆన్‌లైన్ చేయాలంటే చిన్న చిన్న వ్యాపారులకు ఇబ్బందికరం. చదువుకున్న వారు, చదువుకోని వారు ఉంటారు. జీఎస్టీ ఎత్తివేయాలని కోరుతూ బంద్ పాటిస్తున్నాం. ప్రజలందరూ సహకరించాలి.
– చిన్ని లీలాధరరావు, టీటీఎంఏ అధ్యక్షుడు, చీరాల
వస్త్రాలకు మినహాయింపు ఇవ్వాలి..
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో వస్త్రాలకు మినహాయింపు ఇవ్వాలి. వస్త్రాలను నిత్యావసర వస్తువులుగా గుర్తించాలి. వినియోగదారులపై పన్ను భారం వేయాలంటే మాకు బాధగా ఉంది. ఇటీవల కాలంలో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవటంతో వస్త్ర దుకాణాల్లో వ్యాపారాలు లేక, పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం పునరాలోచించి వస్త్రాలపై పన్ను ఎత్తివేయాలి. – పి.కేశవరావు, కమలా వెడ్డింగ్ మాల్ అధినేత, మార్కాపురం
వినియోగదారులకూ భారమే..
జీఎస్టీ అమలుతో వస్త్ర దుకాణాలపై 12శాతం వరకు పన్ను పడుతుంది. ఈ భారం వినియోగదారులు భరించాల్సి వస్తోంది. జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమలులోకి రావటంతో 12శాతం వరకు ధరలు పెరగనున్నాయి. వెయ్యి రూపాయల లోపు 5శాతం, ఆ మొత్తం దాటితే 12శాతం వరకు పన్ను విధిస్తారు. ఇవి కాక మేకింగ్, వర్కింగ్, డైయింగ్ చార్జిల పేరుతో వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయనున్నారు. ఇప్పటి వరకు రూ.5వేల లోపు కొనుగోళ్లకు అదనపు చార్జిలు లేవు. ఇప్పటి నుంచి ప్రతి రూ.5 వేలకు రూ.600 అదనపు భారం పడనుంది. ఇప్పటికే అధిక శాతం ప్రజలు రేడీమేడ్ వస్త్రాలపై ఆసక్తి చూపుతూ క్లాత్ కొనుగోలుకు ముందుకు రాక వ్యాపారాలు సాగడం లేదని, ఇక జీఎస్టీ రాకతో తమ పరిస్థితి మరింత కష్టంగా మారనుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.