న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో 66 కోట్లకు పైగా జీఎస్‌టీ రిటర్నులు దాఖలయ్యాయని.. పన్ను రేట్లు తగ్గడంతో నిబంధనలను పాటించే వారు పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బహుళ పన్నుల విధానం స్థానంలో జీఎస్‌టీని కేంద్రం 2017 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పెట్రోలియం, లిక్కర్ తదితర కొన్ని మినహా అధిక శాతం వస్తు, సేవలను జీఎస్‌టీలో భాగం చేశారు.
1.3 కోట్ల పన్ను చెల్లింపుదారులు
‘‘వినియోగదారు, పన్ను చెల్లింపుదారులకూ జీఎస్‌టీ అనుకూలమైనదని నిరూపణ అయింది. జీఎస్‌టీకి పూర్వం అధిక పన్నుల రేట్లు నిబంధనల అమలు విషయంలో నిరుత్సాహకరంగా ఉండేవి. ప్రతీ రాష్ట్రం భిన్నమైన పన్ను రేటును వసూలు చేసేది. దీంతో అసమర్థత, వ్యయాలకు దారితీసింది. జీఎస్‌టీ æవిధానంలో తక్కువ రేట్ల కారణంగా పన్ను నిబంధనలను పాటించేవారి సంఖ్య క్రమంగా పెరిగింది’’ అని కేంద్ర ఆర్థిక శాఖ ట్విట్టర్‌పై పేర్కొంది. ఒక కంపెనీ వ్యాపారం చేయడం కోసం కరోనాకు ముందు నాటి విధానంలో కనీసం 495 భిన్నమైన పత్రాలను దాఖలు చేయాల్సి వచ్చేదంటూ.. జీఎస్‌టీలో ఇది 12కు తగ్గినట్టు వివరించింది. జీఎస్‌టీ కింద నాలుగు రకాల రేట్లు అమలవుతుండడం తెలిసిందే. నిత్యావసరాలపై 5 శాతం, విలాసవంతం, సమాజానికి చేటు చేసేవాటిపై 28 శాతం పన్ను అమలు చేస్తుండగా.. మిగిలిన వస్తు, సేవలపై 12, 18 శాతం పన్ను అమలవుతోంది.
వీరికి పన్ను భారం తక్కువ
వార్షికంగా రూ.40 లక్షల వరకు టర్నోవర్ ఉన్న (విక్రయాల ఆదాయం) వ్యాపారాలు, పరిశ్రమలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఉంది. అలాగే వార్షికంగా రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉన్నవి కాంపోజిషన్ పథకాన్ని ఎంపిక చేసుకుని టర్నోవర్‌పై 1 శాతం జీఎస్‌టీ చెల్లిస్తే చాలు. సేవల వ్యాపారం నిర్వహించే సంస్థలకు వార్షికంగా రూ.20 లక్షల వరకు టర్నోవర్ ఉంటే జీఎస్‌టీ వర్తించదు. రూ.50లక్షల వరకు టర్నోవర్ ఉన్న సేవల సంస్థలు కాంపోజిషన్ స్కీమ్ కింద 6 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది.
54,439 మందికి అభినందనలు
జీఎస్‌టీ 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ విధానం విజయవంతం కావడంలో భాగమైన పన్ను చెల్లింపుదారులను గౌరవించాలని నిర్ణయించాం. సకాలంలో రిటర్నులను దాఖలు చేయడమే కాకుండా, గణనీయమైన పన్ను చెల్లింపులు చేసిన వారిని గుర్తించేందుకు పరోక్ష పన్నులు, కస్టమ్స్ విభాగం (సీబీఐసీ) డేటా అన్‌లిటిక్స్ (సమాచార విశ్లేషణ)ను చేపట్టింది. ఇందులో భాగంగా 54,439 మంది పన్ను చెల్లింపుదారులను గుర్తించింది. ఇందులో 88 శాతానికి పైగా ఎంఎస్‌ఎంఈలే ఉన్నాయి. సూక్ష్మ పరిశ్రమలు 36 శాతం, చిన్న తరహా పరిశ్రమలు 41 శాతం, మధ్య తరహా పరిశ్రమలు 11 శాతం చొప్పున ఎంపికైన వాటిల్లో ఉన్నాయి. వీటిని అభినందిస్తూ సర్టిఫికేట్లను సీబీఐసీ ఇవ్వనుంది. – కేంద్ర ఆర్థిక శాఖ
మైలురాయి
భారత ఆర్థిక ముఖచిత్రంలో జీఎస్‌టీ ఒక మైలురాయి. జీఎస్‌టీ పన్నుల సంఖ్యను తగ్గించింది. నిబంధనల అమలు భారాన్ని, సామాన్యునిపై మొత్తం మీద పన్ను భారాన్ని తగ్గించింది. పారదర్శక, నిబంధనల అమలు, పన్ను వసూలు గణనీయంగా పెరిగింది.
– నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
జీఎస్‌టీతో తగ్గిన పన్నుల భారం
Published Thu, Jul 1 2021 4:18 AM | Last Updated on Thu, Jul 1 2021 8:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment