జీఎస్టీపై షరతులకు నో | Jaitley rejects Congress conditions for GST Bill passage | Sakshi
Sakshi News home page

జీఎస్టీపై షరతులకు నో

Published Sat, Aug 15 2015 3:11 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

జీఎస్టీపై షరతులకు నో - Sakshi

జీఎస్టీపై షరతులకు నో

- అవి కాంగ్రెస్ బిల్లులోనే లేవన్న అరుణ్ జైట్లీ
- ఆమోదంపై ప్రభుత్వం ధీమా
న్యూఢిల్లీ:
దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను కోసం ఉద్దేశించిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లును పార్లమెంటులో ఆమోదించడానికి కాంగ్రెస్ పెట్టిన ముందస్తు షరతులను ప్రభుత్వం తోసిపుచ్చింది. 2011లో కాంగ్రెస్ హయాంలో ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అందులో అవి లేవని, వాటిని తర్వాత  చెప్పారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ‘ఏ పార్టీ అయినా ముందస్తు షరతులు పెట్టడం రాజకీయంగా వివేకం అనిపించుకోదు. ముఖ్యంగా కేంద్రం, రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక అంశాల్లో..’ అని శుక్రవారం ఢిల్లీలో విలేకర్లతో అన్నారు. జీఎస్టీకి మద్దతుపై కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం పేర్కొన్న షరతులపై ఆయన స్పందించారు.

గరిష్ట జీఎస్టీ 18 శాతానికి మించకూడదని, ఒక శాతం అదనపు పన్ను ఉండకూడదని, వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని.. వీటికి అంగీకరిస్తే బిల్లు ఆమోదానికి మద్దతుపై పరిశీలిస్తామని చిదంబరం గురువారం తెలిపారు. ఈ షరతులు ఆనాడు ఆర్థిక మంత్రిగా చిదంబరం తీసుకున్న వైఖరికి విరుద్ధమని జైట్లీ అన్నారు. పన్ను శాతాలు ఆర్థిక స్థితిగతుల ఆధారంగా నిర్ణయమవుతాయని, దాని కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుందని అన్నారు. వివాదాల పరిష్కార యంత్రాంగం వద్దని పార్లమెంటు స్థాయీసంఘం 2013లో సిఫార్సు చేసిందని, దాని నివేదికను చిదంబరం ఆమోదించారని గుర్తుచేశారు. వివాదాలను జీఎస్టీ కౌన్సిల్‌లో పరిష్కరించుకోవడానికీ ఒప్పుకున్నారన్నారు. రాష్ట్రాల మధ్య వస్తువుల రవాణాపై ఒక శాతం అదనపు పన్ను కేంద్రం, రాష్ట్రాల మధ్య సర్దుబాటుకు సంబంధించినదని అన్నారు.
 
కచ్చితంగా పాసవుతుంది..  జీఎస్టీ బిల్లుకు పార్లమెంటులో కచ్చితంగా ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. దీనికి అన్ని పార్టీలూ సహకరించాలని కోరింది. పార్లమెంటులో కాంగ్రెస్ అడ్డుకోవడం వల్లే ఆమోదం జాప్యమవుతోందని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జవదేకర్ తదితరులు విమర్శించారు. బిల్లును గట్టెక్కించడానికి అన్ని పార్టీలతో చర్చిస్తామని నిర్మల చెన్నైలో చెప్పారు. బిల్లుకు సంబంధించి రాజ్యసభలో తమకు మెజారిటీ ఉందని జవదేకర్ తెలిపారు. జీఎస్టీ అమలుకు సంబంధించి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తామని గోయల్ చెప్పారు. బిల్లు ఆమోదం కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశముందని ఆయనతో పాటు పలువురు మంత్రులు సంకేతమిచ్చారు. వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయే కానీ ప్రొరోగ్ కాలేదని వారు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement