న్యూఢిల్లీ: రక్షణ రంగం, రిజర్వు బ్యాంకు, న్యాయ వ్యవస్థలపై కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం ప్రారంభించిందని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా మండిపడ్డారు. ఆ పార్టీ విధ్వంసక నేతల నుంచి దేశాన్ని, వ్యవస్థలను రక్షించుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు. ఆర్‌బీఐ, న్యాయ వ్యవస్థ, సీబీఐల విధుల్లో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలా జోక్యం చేసుకున్నదీ వివరిస్తూ ఫేస్‌బుక్‌లో ‘వ్యవస్థలపై దాడి– తాజా కుతంత్రం’పేరుతో పోస్ట్ చేశారు. గత రెండు నెలలుగా కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలను సాగిస్తోందనీ, అవేవీ ఎక్కువ కాలం నిలవలేవని అన్నారు. ‘కీలక అంశాల్లో కాంగ్రెస్ పొంతనలేని వైఖరి పాటిస్తోంది. ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తూనే దేశంలో వాక్ స్వాతంత్య్రానికి భంగం వాటిల్లుతోందంటూ అరుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని వారసత్వ హక్కుగా మార్చేందుకు యత్నిస్తోంది’అని విమర్శించారు.
‘ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులతో చేతులు కలిపింది. అర్బన్ నక్సల్స్‌ను కోర్టు శిక్షల నుంచి కాపాడేందుకు ఆపార్టీ ప్రయత్నిస్తోంది. ఇవన్నీ చేస్తూనే మరో వైపు దేశాన్ని, వ్యవస్థను కాపాడుతున్నట్లు చెప్పుకుంటోంది’అంటూ మండిపడ్డారు. దేశంలోకి అక్రమ వలసలను చట్టబద్ధం చేయడానికి మద్దతు పలుకుతోందన్నారు. ‘పార్లమెంట్ కార్యకలాపాలను కొనసాగకుండా రాహుల్ అడ్డుకుంటున్నారు. అందరికంటే ఎక్కువగా పండిట్ నెహ్రూ మునిమనవడు ఒక్కడే భారత్ పార్లమెంట్ ప్రతిష్టను దిగజార్చారనే విషయం చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. పరీక్షలో ఫెయిలయిన విద్యార్థి ఎప్పుడూ టాపర్‌ను విమర్శిస్తూనే ఉంటాడు’అని జైట్లీ ఎద్దేవా చేశారు. ‘2008–14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకులను లూటీ చేసింది. పారిశ్రామిక వేత్తల రుణాలను మోదీ ప్రభుత్వం రద్దుచేసిందంటూ ఆరోపణలు చేస్తోంది’అని జైట్లీ మండిపడ్డారు.
‘మోదీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన రుణంలో ఒక్క రూపాయిని కూడా రద్దు చేయలేదు. పైపెచ్చు ఎగవేతదారులను ఆయా సంస్థల యాజమాన్యాల నుంచి తప్పించాం. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని బట్టబయలు చేశాం’అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం విషయాల్లో ప్రభుత్వం ఎన్నడూ జోక్యం చేసుకోలేదని తెలిపిన జైట్లీ..‘ఈవీఎంల పనితీరుపై ప్రతిపక్షం వ్యక్తం చేస్తున్న అనుమానాలు వాస్తవానికి ఎన్నికల సంఘంపై దాడి వంటిదే అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment