ప్చ్.. వ్యాపారంపై నమ్మకం పోతోంది
న్యూఢిల్లీ: భారత కార్పొరేట్లలో వ్యాపరంపై నమ్మకం అంతకంతకూ దిగజారుతోంది. కంపెనీల వ్యాపార విశ్వాసం 17 క్వార్టర్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని ఫిక్కీ తాజా సర్వే పేర్కొంది. ఈ ఏడాది జూలై, ఆగస్టుల్లో ఫిక్కి ఈ సర్వే నిర్వహించింది. డిమాండ్ బలహీనంగా ఉండడం, రుణ లభ్యత దుర్లభం కావడం, అధిక వడ్డీరేట్లు.... ఫలితంగా వృద్ధి ప్రభావితం కావడం వంటి అంశాల కారణంగా వ్యాపార విశ్వాసం క్షీణించిందంటున్న ఫిక్కీ బిజినెస్ కాన్ఫిడెన్స్ సర్వే పేర్కొన్న ఇతర ముఖ్యాంశాలు...,
వ్యాపార విశ్వాసం క్షీణించడం ఇది వరుసగా నాలుగో క్వార్టర్. ఓవరాల్ బిజినెస్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ 49 పాయింట్లకు పడిపోయింది. సమీప భవిష్యత్తులో కూడా మంచి పనితీరు కనబరుస్తామన్న ఆశాభావాన్ని చాలా కంపెనీలు వ్యక్తం చేయలేకపోయాయి.
వడ్డీరేట్లు అధికంగా ఉన్నాయన్న కంపెనీలు 72 %.
రుణాలు లభించడం దుర్లభంగా ఉందని 38 శాతం కంపెనీలు ఆవేదన వ్యక్తం చేశాయి.
జీఎస్‌టీ అమలు, మౌలిక ప్రాజెక్టులకు ఊపు, వడ్డీరేట్ల తగ్గింపు, నిబంధనల సరళీకరణ వంటి చర్యలు తీసుకోవాలి.
కొత్త ఉద్యోగాలిచ్చే స్థితిలో లేమని 67 శాతం కంపెనీలు పేర్కొన్నాయి.
అమ్మకాలు, ఎగుమతులు, లాభాలు పరిస్థితి ఏమంత ఆశావహంగా లేదు. మరో ఆర్నెల్ల వరకూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. రూపాయి పతనం కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరిగాయని, ఫలితంగా లాభదాయకత తగ్గుతోందని కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి.