న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు మార్చి నెల్లో ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదుచేశాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం రూ.1.42 లక్షల కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 15 శాతం పురోగతి నమోదయ్యింది. ఎకానమీ రికవరీ, పటిష్ట అమ్మకాలను గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. దీనికితోడు పన్ను ఎగవేతల నిరోధానానికి కేంద్రం తీసుకున్న పలు చర్యలూ తగిన ఫలితాలు ఇస్తున్నాయి. కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
► 2022లో జనవరిలో నమోదయిన వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లు ఇప్పటి వరకూ రికార్డుగా ఉన్నాయి. తాజా గణాంకాలు ఈ అంకెలను అధిగమించాయి.
► మొత్తం రూ.1,42,095 కోట్లలో సెంట్రల్ జీఎస్‌టీ వాటా రూ.25,830 కోట్లు. స్టేట్ జీఎస్‌టీ రూ.32,378 కోట్లు ఇంటిగ్రేటెడ్ (రెండూ కలిసి) వాటా రూ.74,470 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలయిన రూ.39,131 కోట్లుసహా). సెస్ రూ.9,417 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలయిన రూ.981 కోట్లుసహా).
► 2022 మార్చిలో గత ఏడాది ఇదే నెలతో పోల్చితే వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 25 శాతం అధికం. దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) ఆదాయాలు 11 శాతం ఎక్కువగా నమోదయ్యాయి.
► 2022 ఫిబ్రవరిలో మొత్తం ఈ–వే బిల్లుల సంఖ్య 6.91 కోట్లు. ఇది వ్యాపార కార్యకలాపాల వేగవంతమైన రికవరీని సూచిస్తోంది.
► గత ఆర్థిక సంవత్సరం రూ. లక్ష కోట్లపైన జీఎస్‌టీ వసూళ్లు ఇది వరుసగా తొమ్మిదవ నెల. మే, జూన్ మినహా మిగిలిన పది నెలల్లో వసూళ్లు రూ.లక్ష కోట్లను అధిగమించాయి. ఇక వసూళ్లు రూ.1.30 లక్షల కోట్లను దాటడం ఆర్థిక సంవత్సరంలో ఆరవసారి.
జీఎస్‌టీ వసూళ్లు.. రికార్డ్
Published Sat, Apr 2 2022 5:56 AM | Last Updated on Sat, Apr 2 2022 5:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment