న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను వసూళ్ల రికార్డులు కొనసాగుతున్నాయి. మార్చిలో వసూళ్లు రూ.1.23 లక్షలుగా నమోదయినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారికాగా, 2020 ఇదే నెలతో పోల్చితే 27 శాతం అధికం. 2020 మార్చిలో జీఎస్‌టీ ద్వారా వచ్చిన ఆదాయం రూ.97,590 కోట్లు. ఎకానమీ వేగంగా పురోగమిస్తోందనడానికి జీఎస్‌టీ గణాంకాలు సంకేతమని ఆర్థికశాఖ తెలిపింది. నకిలీ బిల్లింగ్ నిరోధం, జీఎస్‌టీ, ఆదాయపు పన్ను, కస్టమ్స్ ఐటీ వ్యవస్థలుసహా సూక్ష్మ స్థాయిలో డేటా విశ్లేషణ, పటిష్టమైన పన్ను యంత్రాంగం కూడా జీఎస్‌టీ వసూళ్లు క్రమంగా పురోగమించడానికి కారణమని ఆర్థికశాఖ వివరించింది.
ముఖ్యాంశాలు చూస్తే...
► మార్చి నెలలో జీఎస్‌టీ స్థూల వసూళ్లు రూ.1,23,902 కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో సెంట్రల్ జీఎస్‌టీ రూ.22,973 కోట్లు. స్టేట్ జీఎస్‌టీ రూ.29,329 కోట్లు. ఏకీకృత జీఎస్‌టీ రూ. 62,842 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.31,097 కోట్ల వసూళ్లు కలిపి), సెస్ రూ.8,757 కోట్లు (వస్తు దిగుమతులపై రూ. 935 కోట్ల వసూళ్లు కలిపి).
► వార్షికంగా 2020 మార్చితో పోల్చితే తాజా సమీక్షా నెలలో వస్తు దిగుమతల నుంచి ఆదాయం 70 శాతం పెరిగింది. దేశీయ లావాదేవీల నుంచి రెవెన్యూ 17 శాతం పెరిగింది.
► కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు 2020 మార్చి చివరి వారం నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కేంద్రం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ తర్వాతి నెల ఏప్రిల్‌కు సంబంధించిన జీఎస్‌టీ వసూళ్లు రూ.32,172 కోట్లకు పడిపోయాయి. లాక్‌డౌన్ నియంత్రణలను క్రమంగా సడలిస్తూ రావడంతో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇదే జీఎస్‌టీ వసూళ్ల రూపంలో కనిపిస్తోంది.
► పెద్ద రాష్ట్రాలు జీఎస్‌టీ వసూళ్లలో 6–15 శాతం మధ్య వృద్ధిని చూపించాయి. వరుసగా జీఎస్‌టీ ఆదాయాలు వృద్ధిని చూపిస్తుండడం ఆర్థిక వ్యవస్థ సామర్థ్యంపై విశ్వాసాన్ని కలిగిస్తుంది. అలాగే, వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా తిరిగి మొదలయ్యాయని, వస్తు, సేవలకు డిమాండ్ అధికంగా ఉండడాన్ని తెలియజేస్తోంది. పారిశ్రామిక రంగం తిరిగి సాధారణ స్థితికి వస్తోందని కూడా జీఎస్‌టీ ఆదాయంలో వృద్ధి తెలియజేస్తోంది.
ద్రవ్యలోటు కట్టడికి దోహదం
2020–21లో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం(ద్రవ్యలోటు) రూ.18.5 లక్షల కోట్లు ఉంటుం దని (జీడీపీలో 9.5%) 2021 ఫిబ్రవరి 1 న ప్రవేశపెట్టిన బడ్జెట్ సవరించిన గణాంకాలు పేర్కొన్నాయి. మార్చిలో రికార్డు స్థాయి జీఎస్‌టీ వసూళ్ల నేపథ్యంలో.. ద్రవ్యలోటు నిర్దేశిత స్థాయిలోనే ఉండొచ్చు. ప్రభుత్వ ఆదాయాలకు సంబంధించి తగిన నగదు సమతౌల్యతతో 2021–22 ప్రారంభం అవుతున్నట్లు తాజా పరిస్థితి సూచిస్తోంది.
– అదితి నాయర్, ఇక్రా ప్రిన్సిపల్ ఎకనమిస్ట్
జీఎస్‌టీ... రికార్డు వసూళ్లు
Published Fri, Apr 2 2021 4:55 AM | Last Updated on Fri, Apr 2 2021 8:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment