
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు జనవరిలో 10.4 శాతం పెరిగి రూ.1,72,129 కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. 2017 జూలైలో కొత్త పరోక్ష పన్నుల వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఇవి రెండవ అతిపెద్ద భారీ వసూళ్లు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.70 లక్షల కోట్లుపైబడిన వసూళ్లు ఇది మూడవసారి కావడం మరో విశేషం. జనవరి 31వ తేదీ 5 గంటల సమయం వరకూ చూస్తే, ఆర్థిక సంవత్సరం 2023 ఏప్రిల్ నుంచి జనవరి 2024 వరకూ జీఎస్‌టీ వసూళ్లు 11.6 శాతం పెరిగి 16.69 లక్షల కోట్లకు ఎగసింది. 2023 ఏప్రిల్‌లో ఇప్పటివరకూ అత్యధికంగా రూ.1.87 లక్షల కోట్ల జీఎస్‌టీ పన్ను వసూళ్లు చోటుచేసుకున్నాయి.