
న్యూఢిల్లీ: రద్దయిన కాంట్రాక్టులు లేదా బీమా పాలసీలకు సంబంధించి నమోదుకాని (అన్‌రిజిస్టర్డ్) వ్యక్తులు కూడా ఇకపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వాపసులను క్లెయిమ్ చేసుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇందుకు తన పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)తో జీఎస్‌టీ పోర్టల్‌లో తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను పొందాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఒక ప్రకటనలో సూచించింది. బ్యాంక్ అకౌంట్ నెంబర్‌తోపాటు, రిఫండ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. కాంట్రాక్ట్ రద్దయిన సందర్భంలో తాము అప్పటికే భరించిన పన్ను మొత్తాన్ని వాపసు కోసం క్లెయిమ్ చేయడానికి ఒక సదుపాయాన్ని (ఫెసిలిటీ) కల్పించాలని రిజిస్టర్ కాని కొనుగోలుదారులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని వెలువరిస్తున్నట్లు తెలిపింది.
రెండేళ్ల కాల వ్యవధి...
తాజా నిర్ణయంతో ఫ్లాట్, భవనం నిర్మాణం లేదా దీర్ఘకాలిక బీమా పాలసీ రద్దుకు సంబంధించి అప్పటికే చెల్లించిన జీఎస్‌టీని ఇకపై అన్ రిజిస్టర్డ్ వ్యక్తులూ తిరిగి పొందే (రిఫండ్) వెసలుబాటు కలిగింది. నమోదవ్వని పన్ను చెల్లింపుదారు సంబంధిత తేదీ నుండి రెండు సంవత్సరాలలోపు వాపసుల కోసం ఫైల్ చేయవచ్చని సీబీఐసీ వివరించింది. వస్తువులు, సేవలను స్వీకరించిన తేదీ లేదా ఒప్పందం రద్దయిన తేదీ నుంచి ఇది ఈ రెండేళ్ల కాల వ్యవధి వర్తిస్తుందని వివరించింది. డిసెంబర్ 17న జరిగిన జీఎస్‌టీ అత్యున్నత స్థాయి 48వ సమావేశం నిర్ణయాలకు అనుగుణంగా తాజాగా సీబీఐసీ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ‘‘రిజిస్టర్ చేయని కొనుగోలుదారులు సరఫరా జరగని చోట జీఎస్‌టీ వాపసు పొందడానికి తాజా నిర్ణయం అనుమతిస్తుంది. వారిపై ఇప్పటి వరకూ ఉన్న అనవసరమైన వ్యయ భారాన్ని నివారించడంలో సహాయపడుతుంది’’ అని అని భారత్‌లో కేపీఎంసీ ప్రతినిధి (పరోక్ష పన్ను) అభిషేక్ జైన్
వ్యాఖ్యానించారు.