జీఎస్‌టీ రేటు హేతుబద్దీకరణ | GST rate structure rationalisation on govt agenda | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ రేటు హేతుబద్దీకరణ

Published Fri, Jul 30 2021 5:59 AM | Last Updated on Fri, Jul 30 2021 5:59 AM

GST rate structure rationalisation on govt agenda - Sakshi

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రేట్ల హేతుబద్దీకరణ ప్రభుత్వ అజెండాలో ప్రధానమైనదని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. హేతుబద్దీకరణ త్వరలో వాస్తవరూపంలోకి వస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. జీఎస్‌టీ మూడు రేట్ల వ్యవస్థకు మార్చడం కీలకాంశమని ఆయన పేర్కొన్నారు. ఇండస్ట్రీ బాడీ– అసోచామ్‌ నిర్వహించిన మరో వెర్చువల్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2017 జూలై నుంచీ అమల్లోకి వచ్చిన జీఎస్‌టీ ప్రస్తుతం ఐదు రేట్ల వ్యవస్థతో (0.25 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం) అమలు జరుగుతున్న సంగతి తెలసిందే. దీనితోపాటు జీఎస్‌టీకి సంబంధించినంతవరకూ స్థిర ఇన్వర్టెడ్‌ సుంకం వ్యవస్థ కూడా అవసరమని సుబ్రమణియన్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

పెద్ద బ్యాంకుల ఏర్పాటు అవశ్యం...
ఎకానమీలో ఫైనాన్షియల్‌ రంగం ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావిస్తూ, భారత్‌లో ప్రపంచ స్థాయిలో పెద్ద బ్యాంకులు ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో భారత్‌ ఐదవ అతిపెద్ద ఎకానమీ అయినప్పటికీ, అంతర్జాతీయంగా టాప్‌ 50 బ్యాంకుల జాబితాలో లేదన్నారు. 55వ స్థానంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా టాప్‌–100 బ్యాంకుల జాబితాలో ఉందన్నారు. టాప్‌–100 జాబితాలో చైనా బ్యాంకులు 18 ఉండగా, అమెరికా బ్యాంకులు 12 ఉన్నాయని వివరించారు. సమావేశంలో పాల్గొన్న సెబీ హోల్‌ టైమ్‌ మెంబర్‌ జీ మహాలింగమ్‌ మాట్లాడుతూ, కార్పొరేట్‌ బ్యాంక్‌ మార్కెట్‌ విస్తరణకు ప్రభుత్వం, మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ పలు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

ద్రవ్యలోటు లక్ష్యం దాటదు
ఆదాయాల విషయంలో ఒత్తిడులు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ద్రవ్యలోటు లక్ష్యాల మేరకు నమోదవుతుందన్న విశ్వాసాన్ని మరో కార్యక్రమంలో సుబ్రమణియన్‌ వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదాయాలకు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసమే ద్రవ్యలోటు. 2021–22లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6.8 శాతంగా ఉండాలన్నది బడ్జెట్‌ లక్ష్యం. కాగా 2022–23లో జీడీపీ 6.5 శాతం నుంచి 7 శాతం శ్రేణిలో పురోగమిస్తుందన్న సుబ్రమణియన్‌ అభిప్రాయపడ్డారు. తరువాతి ఆర్థిక సంవత్సరాల్లో ఇది 8 శాతానికి చేరుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలు ఇందుకు దోహదపడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీఏఎస్‌ఈ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక వెర్చువల్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయం, కార్మిక రంగాల్లో సంస్కరణలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) నిర్వచనం మార్పు, బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలు దీర్ఘకాలంలో వృద్ధి పురోగతికి దోహదపడతాయని అన్నారు. అలాగే మౌలికంసహా వివిధ రంగాలపై ప్రభుత్వ వ్యయాలు వృద్ధికి దారితీస్తాయని పేర్కొన్నారు.

ద్రవ్యోల్బణం దిగివస్తుంది...
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పాలసీ విధానానికి కీలకమైన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం నిర్దేశిత శ్రేణికి దిగివస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. సరఫరాల వ్యవస్థ మెరుగుపడ్డం ఇందుకు కారణమవుందని ఫిక్కీ నిర్వహించిన ఒక వెర్చువల్‌ కార్యక్రమంలో విశ్లేషించారు. కేంద్రం నిర్దేశాల ప్రకారం ఆర్‌బీఐ రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 2 నుంచి 6 శాతం శ్రేణిలో కట్టడి చేయాల్సి ఉంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం మేలో 6.3 శాతంకాగా, జూన్‌లో స్వల్పంగా 6.26 శాతానికి తగ్గింది.

బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా ఆరు ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది. మార్చి 2020 తర్వాత 115 బేసిస్‌ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్‌బీఐ, కరోనా కష్ట కాలం దేశానికి ప్రారంభమైన తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తూ వస్తోంది. 2021–22లో రిటైల్‌ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా కొనసాగుతుందని ఆర్‌బీఐ అంచనావేసింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం మొదటి, రెండవ, మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వరుసగా 5.2 శాతం, 5.4 శాతం, 4.7 శాతం, 5.3 శాతంగా కొనసాగుతాయన్నది ఆర్‌బీఐ అంచనా. ఈ కారణంగా వృద్ధికి దోహదపడే సరళతర ఆర్థిక విధానాల కొనసాగింపునకు ఆర్‌బీఐ మొగ్గుచూపుతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement