న్యూఢిల్లీ: భారత్ పన్ను వసూళ్లు 2023 మార్చితో ముగిసే 2022–23 ఆర్థిక సంవత్సరంలో అంచనాలను మించి నమోదుకానున్నట్లు రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. లక్ష్యంకన్నా రూ.4 లక్షల కోట్ల అధిక వసూళ్లు జరగవచ్చని ఆయన తెలిపారు. భారీగా జరుగుతున్న ఆదాయపు పన్ను, కస్టమ్స్ సుంకాలు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు దీనికి కారణమని ఆయన అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపిన అంశాలు...
► పన్ను రాబడిలో వృద్ధి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి కంటే ఎక్కువగా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవస్థ పురోగతి దీనికి కారణం.
► 2022–23లో రూ.27.50 లక్షల కోట్ల ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యంలో ప్రత్యక్ష పన్నుల వాటా రూ.14.20 లక్షల కోట్లయితే, పరోక్ష పన్ను వసూళ్ల వాటా రూ.13.30 లక్షల కోట్లు.
► అయితే లక్ష్యాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు రూ.17.50 లక్షల కోట్లు, పరోక్ష పన్ను (కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్‌టీ) వసూళ్లు రూ.14 లక్షల కోట్లకు చేరవచ్చు. అంటే వసూళ్లు రూ.31.50 లక్షల వరకూ వసూళ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ అంచనాలకన్నా ఇది రూ.4 లక్షల కోట్ల అధికం.
► ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022–23) సైతం పన్నుల లక్ష్యం మరింత పెద్దగా ఉండొచ్చు.
► పన్ను వసూళ్ల మదింపునకు మేము విస్తృత స్థాయిలో డేటాను ఉపయోగిస్తున్నాము. ఆదాయపు పన్ను, జీఎస్‌టీ విభాగాలు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) నుండి డేటాను ఎప్పుటికప్పుడు పొందుతున్నాము. సాంకేతికత అధికారికీకరణ అనుకూలతను మెరుగుపరచడంతో డేటాను సమగ్ర స్థాయిలో పొందగలుగుతున్నాము.
► 2020–21తో పోల్చితే 2021–22లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 50 శాతం పెరిగి, రూ.14.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
► ఈ ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు తగ్గించినప్పటికీ ప్రభుత్వం బడ్జెట్‌లో నిర్దేశించిన లక్ష్యానికి అతి చేరువలో ఉండడం హర్షణీయం. కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల ద్వారా వరుసగా రూ.2.13 లక్షల కోట్లు, రూ.3.35 లక్షల కోట్ల చొప్పున వసూళ్లు జరగాలన్నది బడ్జెట్ లక్ష్యం.
► ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్స్ 2021–22 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్) సంబంధించి ఇప్పటి వరకూ 6.85 కోట్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 31 వరకూ తుది గడువు ఉండడంతో రిటర్న్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2021–22కిగాను ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్‌లు) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉన్న కార్పొరేట్‌లు, ఇతరులకు తుది గడువు నవంబర్ 7. గడువు తప్పినట్లయితే, పన్ను చెల్లింపుదారులు జరిమానా చెల్లించడం ద్వారా ఆలస్యంగా కూడా రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. దీనికి చివరి తేదీ డిసెంబర్ 31.
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ 10 వరకూ రిఫండ్స్ విలువ (31 శాతం వృద్ధితో) రూ. 2లక్షల కోట్లు. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.10.54 లక్షల కోట్లుకాగా, రిఫండ్స్ పోను మిగిలిన మొత్తం రూ.8.54 లక్షల కోట్లు. వార్షిక బడ్జెట్ అంచనాల్లో ఈ విలువ 61.31 శాతానికి చేరింది.
► దేశంలో పలు రంగాలు మందగమనంలో ఉన్నప్పటికీ, ఎకానమీ పురోగతికి సంకేతమైన ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పురోగమిస్తుండడం హర్షణీయ పరిణామం. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు వరుసగా ఎనిమిది నెలలుగా రూ.1.40 లక్షల కోట్లు పైబడ్డాయి. ఇందులో రెండు నెలలు రూ.1.50 లక్షల కోట్లు దాటాయి.
కట్టడిలో ద్రవ్యలోటు
చక్కటి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందని భావిస్తున్నాం. 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం.
Comments
Please login to add a commentAdd a comment