Revenue Secretary
-
కొత్త పన్ను పొదుపునకు విఘాతమా? కేంద్ర రెవెన్యూ శాఖ ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: నూతన పన్ను విధానానికి మళ్లడం అన్నది దేశ పొదుపు రేటునకు ఎంత మాత్రం ప్రమాదకరం కాబోదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. పన్ను ఆదాకు సంబంధించిన పెట్టుబడి సాధనాల్లో గృహ పొదుపులు కేవలం రూ.4 లక్షల కోట్లుగానే ఉన్నాయని, మొత్తం పొదుపు నిధుల్లో (రూ.25 లక్షల కోట్లు) ఇవి 16 శాతమేనని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చడం తెలిసిందే. కొత్త పన్ను విధానంలో రూ.7.5 లక్షల వరకు (రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్ సహా) ఎలాంటి పన్ను లేదు. ఆ తర్వాత కూడా తక్కువ పన్ను రేటు ప్రతిపాదించారు. కాకపోతే ఎలాంటి పన్ను మిహాయింపులు, తగ్గింపులు ఉండవు. దీనిపై వ్యక్తమవుతున్న ఆందోళనను తొలగించే ప్రయత్నాన్ని మల్హోత్రా చేశారు. ‘‘దేశ జీడీపీలో గృహ పొదుపు నిధులు నేడు 27–30 శాతంగా ఉన్నాయి. బడ్జెట్లో భాగంగా వృద్ధులు, మహిళలకు ప్రకటించిన పథకాలు దేశ పొదుపు రేటును పెంచుతాయి’’అని చెప్పారు. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు, సెక్షన్ 80డీ కింద 60 ఏళ్లలోపు వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రూ.25,000, 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000, గృహ రుణంపై వడ్డీ చెల్లింపులు సహా ఎన్నో రకాల పన్ను ప్రయోజనాలు ఉండడం గమనార్హం. -
బడ్జెట్ అంచనాలను మించి పన్ను వసూళ్లు!
న్యూఢిల్లీ: భారత్ పన్ను వసూళ్లు 2023 మార్చితో ముగిసే 2022–23 ఆర్థిక సంవత్సరంలో అంచనాలను మించి నమోదుకానున్నట్లు రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. లక్ష్యంకన్నా రూ.4 లక్షల కోట్ల అధిక వసూళ్లు జరగవచ్చని ఆయన తెలిపారు. భారీగా జరుగుతున్న ఆదాయపు పన్ను, కస్టమ్స్ సుంకాలు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు దీనికి కారణమని ఆయన అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపిన అంశాలు... ► పన్ను రాబడిలో వృద్ధి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి కంటే ఎక్కువగా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవస్థ పురోగతి దీనికి కారణం. ► 2022–23లో రూ.27.50 లక్షల కోట్ల ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యంలో ప్రత్యక్ష పన్నుల వాటా రూ.14.20 లక్షల కోట్లయితే, పరోక్ష పన్ను వసూళ్ల వాటా రూ.13.30 లక్షల కోట్లు. ► అయితే లక్ష్యాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు రూ.17.50 లక్షల కోట్లు, పరోక్ష పన్ను (కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీ) వసూళ్లు రూ.14 లక్షల కోట్లకు చేరవచ్చు. అంటే వసూళ్లు రూ.31.50 లక్షల వరకూ వసూళ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ అంచనాలకన్నా ఇది రూ.4 లక్షల కోట్ల అధికం. ► ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022–23) సైతం పన్నుల లక్ష్యం మరింత పెద్దగా ఉండొచ్చు. ► పన్ను వసూళ్ల మదింపునకు మేము విస్తృత స్థాయిలో డేటాను ఉపయోగిస్తున్నాము. ఆదాయపు పన్ను, జీఎస్టీ విభాగాలు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) నుండి డేటాను ఎప్పుటికప్పుడు పొందుతున్నాము. సాంకేతికత అధికారికీకరణ అనుకూలతను మెరుగుపరచడంతో డేటాను సమగ్ర స్థాయిలో పొందగలుగుతున్నాము. ► 2020–21తో పోల్చితే 2021–22లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 50 శాతం పెరిగి, రూ.14.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ► ఈ ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు తగ్గించినప్పటికీ ప్రభుత్వం బడ్జెట్లో నిర్దేశించిన లక్ష్యానికి అతి చేరువలో ఉండడం హర్షణీయం. కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల ద్వారా వరుసగా రూ.2.13 లక్షల కోట్లు, రూ.3.35 లక్షల కోట్ల చొప్పున వసూళ్లు జరగాలన్నది బడ్జెట్ లక్ష్యం. ► ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్స్ 2021–22 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్) సంబంధించి ఇప్పటి వరకూ 6.85 కోట్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 31 వరకూ తుది గడువు ఉండడంతో రిటర్న్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2021–22కిగాను ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్‌లు) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉన్న కార్పొరేట్లు, ఇతరులకు తుది గడువు నవంబర్ 7. గడువు తప్పినట్లయితే, పన్ను చెల్లింపుదారులు జరిమానా చెల్లించడం ద్వారా ఆలస్యంగా కూడా రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. దీనికి చివరి తేదీ డిసెంబర్ 31. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ 10 వరకూ రిఫండ్స్ విలువ (31 శాతం వృద్ధితో) రూ. 2లక్షల కోట్లు. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.10.54 లక్షల కోట్లుకాగా, రిఫండ్స్ పోను మిగిలిన మొత్తం రూ.8.54 లక్షల కోట్లు. వార్షిక బడ్జెట్ అంచనాల్లో ఈ విలువ 61.31 శాతానికి చేరింది. ► దేశంలో పలు రంగాలు మందగమనంలో ఉన్నప్పటికీ, ఎకానమీ పురోగతికి సంకేతమైన ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పురోగమిస్తుండడం హర్షణీయ పరిణామం. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఎనిమిది నెలలుగా రూ.1.40 లక్షల కోట్లు పైబడ్డాయి. ఇందులో రెండు నెలలు రూ.1.50 లక్షల కోట్లు దాటాయి. కట్టడిలో ద్రవ్యలోటు చక్కటి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందని భావిస్తున్నాం. 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. -
జీఎస్టీ వసూళ్లలో తగ్గేదేలే!.. టార్గెట్ రూ.1.5 లక్షల కోట్లు
జీఎస్టీ వసూళ్లు అక్టోబర్ నుంచి రూ.1.5 లక్షల కోట్లకుపైనే ఉంటాయని అంచనా వేస్తున్నట్టు కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ పేర్కొన్నారు. గడిచిన ఆరు నెలలకు జీఎస్టీ ఆదాయం సగటున రూ.1.4 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. వరుసగా రూ.1.5 లక్షల కోట్లు దాటి నమోదు కావడం లేదు. ఆగస్ట్ నెలకు రూ.1.43 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వచ్చింది. వార్షికంగా క్రితం ఏడాది ఆగస్ట్‌తో పోల్చి చూసినప్పుడు 28 శాతం పెరిగింది. కానీ, జూలైలో వచ్చిన రూ.1.49 లక్షల కోట్ల కంటే తక్కువ కావడం గమనార్హం. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే రూ.1.5 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. ఆ నెలకు రూ.1.67 లక్షల కోట్ల ఆదాయం నమోదైంది. సీబీఐసీ కార్యక్రమంలో భాగంగా తరుణ్ బజాజ్ ఈ అంశంపై మాట్లాడుతూ.. రూ.1.5 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించేందుకు గత కొన్ని నెలలుగా తాము కష్టించి పనిచేస్తున్నట్టు చెప్పారు. కొన్ని సందర్భాల్లో రూ.2,000 కోట్లు, రూ.6,000 కోట్లు తక్కువ నమోదైనట్టు తెలిపారు. కానీ, అక్టోబర్ నెలకు జీఎస్టీ ఆదాయం రూ.1.5 లక్షల కోట్లను అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆ తర్వాత నుంచి స్థిరంగా రూ.1.5 లక్షల కోట్ల పైన నమోదవుతుందని అంచనా వేశారు. ఇదే కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి పంకజ్ చౌదరి సైతం పాల్గొన్నారు. చదవండి: దేశంలో ఐఫోన్ల తయారీ..టాటా గ్రూప్‌తో మరో దిగ్గజ సంస్థ పోటా పోటీ! -
మరో ఏడాది రాయితీ పన్ను రేటు
న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు త్వరగా వాటి తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు రెవెన్యూ వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీలకు రాయితీతో కూడిన 15 శాతం పన్ను రేటును మరో ఏడాది పాటు (2024 మార్చి) వరకు పొడిగించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ఆదాయం పెరుగుతున్నట్టు చెప్పారు. అంటే కార్పొరేట్ రంగం పనితీరు కూడా మెరుగ్గా ఉందని, జీడీపీలో పన్నుల వాటా ప్రస్తుత సంవత్సరంలో అత్యధిక గరిష్టానికి చేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాయితీతో కూడిన పన్ను రేటును 2024 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు బడ్జెట్లో మంత్రి సీతారామన్ ప్రకటించడం తెలిసిందే. 2019 సెప్టెంబర్‌లో కార్పొరేట్ పన్ను తగ్గింపు సమయంలో మొదటిసారి ఈ అవకాశం కల్పించారు. 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటయ్యే తయారీ యూనిట్లు, 2023 మార్చి 31లోపు ఉత్పత్తి మొదలు పెడితే 15 శాతం పన్ను రేటును ఎంపిక చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ రాయితీ రేటును పొందే కంపెనీలు ఆదాయపన్ను చట్టం కింద మరే ఇతర మినహాయింపు, రాయితీ పొందేందుకు అవకాశం ఉండదు. పన్నుల వాటా పెరుగుతోంది.. కార్పొరేట్ పన్ను తగ్గించడంతో జీడీపీలో పన్నుల నిష్పత్తి తగ్గుముఖం పట్టిందని, ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నట్టు తరుణ్ బజాజ్ తెలిపారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నులను కలిపి చూస్తే జీడీపీలో పన్నుల నిష్పత్తి ఈ ఏడాది అత్యంత గరిష్ట స్థాయికి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. గడిచిన మూడేళ్లలో మూలధన వ్యయాలు రెట్టింపైనట్టు చెప్పారు. ఇది జీడీపీ వృద్ధిని ముందుకు తీసుకెళుతుందన్నారు. ఒక్కసారి వృద్ధి చక్కగా పుంజుకుంటే ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. ప్రైవేటు పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చి ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళతాయన్న అంచనాలను వ్యక్తం చేశారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను మించి ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదవడం తెలిసిందే. దీంతో 2021–22 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు రూ.11.08 లక్షల కోట్లను ప్రభుత్వం రూ.12.50 లక్షల కోట్లకు సవరించుకుంది. 2022–23 సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.14.20 లక్షల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని విధించుకుంది. ఇబ్బందుల్లేకుండా రుణ సమీకరణ ప్రభుత్వ రుణసమీకరణ కార్యక్రమం వచ్చే ఆర్థిక సంవత్సరంలో బాధ్యతాయుతుంగా ఉటుందని.., ప్రైవేటు పెట్టుబడులకు అవరోధంగా ఉండదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌సేత్ తెలిపారు. ద్రవ్యలోటుకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. జీడీపీలో ద్రవ్యలోటు 6.4 శాతంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసుకుంది. చెప్పినట్టుగా రూ.6.6 లక్షల కోట్ల రుణాలకు పరిమితం అవుతామని అయజ్ సేత్ అన్నారు. చిన్న పొదుపు పథకాల నుంచి ఎక్కువ నిధులు సమకూరితే మార్కెట్ నుంచి రుణ సమీకరణ తగ్గించుకుంటామని చెప్పారు. రెట్రో కేసుల సెటిల్మెంట్ ఫిబ్రవరిలోనే పూర్తి.. రెట్రోస్పెక్టివ్ ట్యాక్సు కేసులన్నింటినీ దాదాపుగా ఫిబ్రవరిలోనే సెటిల్ చేసే అవకాశం ఉందని తరుణ్ బజాజ్ తెలిపారు. అనూహ్య మార్పులేమీ ఉండని, స్థిరమైన పన్ను విధానాలపై ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ఇది దోహదపడగలదని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ‘రెట్రో ట్యాక్సేషన్‌ను ఆగస్టులో రద్దు చేశాం. దాదాపుగా అన్ని కేసులను ఈ నెలలోనే పరిష్కరించే అవకాశం ఉంది. తద్వారా ఆ అధ్యాయం ఇక ముగిసిపోతుంది‘ అని బజాజ్ పేర్కొన్నారు. చదవండి : పన్ను చెల్లింపుదారులకు ఝలక్ ! ఐటీ అప్డేట్.. క్షమాభిక్ష స్కీము కాదు.. -
పన్నుల తగ్గింపు.. రూ.80 వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి కోత?
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో వేసిన అంచనాలకు మించి పన్ను వసూళ్లు రానున్నాయని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. అక్టోబర్ నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6 లక్షల కోట్ల మేర ఉండగా.. ప్రతీ నెలా జీఎస్టీ వసూళ్లు సగటున రూ.1.15లక్షలుగా ఉంటున్నట్టు చెప్పారు. బడ్జెట్ అంచనాలకు మించి పన్ను వసూళ్లు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు, వంట నూనెల దిగుమతులపై కస్టమ్స్ సుంకాల తగ్గింపు వల్ల ఖజానాకు రూ.75,000–80,000 కోట్ల ఆదాయం తగ్గిపోనున్నట్టు చెప్పారు. అయినా పన్ను వసూళ్లు పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువే వస్తాయన్నారు. రిఫండ్లు (పన్ను తిరిగి చెల్లింపులు) తీసేసి చూసినా.. అక్టోబర్ నాటికి ప్రత్యక్ష పన్నులు రూ.6 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. జీఎస్టీ ఆదాయం నవంబర్‌లో రూ.1.30 లక్షల కోట్లు దాటిపోవచ్చన్నారు. 2021–22 బడ్జెట్లో పన్నుల ఆదాయం రూ.22.2 లక్షల కోట్లుగా కేంద్రం అంచనాలు వేసింది. ఇందులో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.11 లక్షల కోట్లు, కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో రూ.5.47 లక్షల కోట్లుగా రావచ్చని పేర్కొనడం గమనార్హం. 2020–21లో పన్నుల ఆదాయం రూ.20.2 లక్షల కోట్లుగా ఉంది. రెట్రో కేసుల పరిష్కారానికి సిద్ధం ముందుకొచ్చిన 14 సంస్థలు రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ కేసుల పరిష్కార ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ట్యాక్స్ డిమాండ్లు అందుకున్న 14 కంపెనీలు వీటి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. 17 కంపెనీలకు ట్యాక్స్ డిమాండ్లు పంపగా.. మూడు.. నాలుగు మినహా మిగతావన్నీ కూడా సెటిల్మెంట్కు తమ సమ్మతి తెలియజేశాయని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ సెటిల్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు నెలాఖరు దాకా సమయం ఉందని బజాజ్ చెప్పారు. కెయిర్న్ ఎనర్జీ విషయానికొస్తే.. ప్రభుత్వంపై వేసిన కేసులను వెనక్కి తీసుకునే దాన్ని బట్టి సత్వరం చెల్లింపులు ఉంటాయని ఆయన వివరించారు. గతంలో ఎప్పుడో జరిగిన వ్యాపార ఒప్పందాలపై కూడా పన్నులు విధించేలా (రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్) 2012లో చేసిన చట్టం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీన్ని ఉపయోగించుకుని వొడాఫోన్ తదితర 17 సంస్థలకు రూ. 1.10 లక్ష కోట్ల పన్నులు కట్టాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. కెయిర్న్ విషయంలో ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది. అయితే, అంతర్జాతీయ స్థాయిలో ఇది వివాదాస్పదం కావడం, న్యాయస్థానాల్లో కెయిర్న్‌కు అనుకూలంగా తీర్పులు రావడం తదితర పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఇటీవల ఈ చట్టాన్ని పక్కన పెట్టింది. ప్రభుత్వంపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటే వసూలు చేసిన పన్నులు తిరిగి ఇచ్చేస్తామని పేర్కొంది. చదవండి: చమురు ధరలకు భారత్ చెక్! -
దేశంలో క్రిప్టో చట్టబద్ధత ఖాయం!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్‌దాస్ నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నప్పటికీ, క్రిప్టో కరెన్సీకి చట్ట బద్ధత కల్పించడానికే కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు మరోసారి స్పష్టం అయ్యింది. క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించినట్లు స్వయంగా రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టాల్లో మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారని భావిస్తున్న 2022–23 బడ్జెట్లోనే ఈ మేరకు ప్రతిపాదనలు ఉంటాయని ఆయన సూచించారు. క్రిప్టో కరెన్సీని కొందరు అసెట్‌గా భావిస్తున్నారని అన్నారు. తద్వారా వచ్చే ఆదాయంపై ఇప్పటికే కొంత మంది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లిస్తున్నారని తరుణ్ బజాజ్ తెలిపారు. ఇతర కొన్ని సేవల తరహాలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కూడా క్రిప్టోకి వర్తిస్తుందని చట్టం ‘చాలా స్పష్టంగా‘ చెబుతోందని వివరించారు. ‘‘క్రిప్టోపై పన్ను అంశాలపై మేము దృష్టి సారిస్తాము. ఇప్పటికే ప్రజలు దానిపై పన్నులు చెల్లిస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కొనుగోళ్ల పరిమాణం నిజంగానే చాలా పెరిగింది. ఈ అంశంపై పన్నులకు సంబంధించి కొన్ని చట్టపరమైన మార్పులు తీసుకురాగలమా లేదా అని చూద్దాం. అయితే ఇది బడ్జెట్ నాటికి సిద్ధం అవుతుంది. మనం ఇప్పటికే బడ్జెట్‌కు దగ్గరగా ఉన్నాము. బడ్జెట్లో ప్రతిపాదనలను ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలించాలి’’ అని బజాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. క్రిప్టో ట్రేడింగ్ విషయంలో టీసీఎస్ (మూలం వద్ద పన్ను వసూలు) విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఏమి జరుగుతుందో చూడాల్సి ఉందని ఆయన అన్నారు. వేగంగా పరిణామాలు... క్రిప్టో కరెన్సీపై దేశంలో నియంత్రణకానీ, నిషేధంకానీ లేవు. ఈ వర్చువల్ కరెన్సీల వల్ల ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర విఘాతమని ఆర్బీఐ గవర్నర్ నుంచి ప్రకటనల నేపథ్యంలో మీడియాలో దీనికి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రకటనలు వెలువడుతున్నాయి. సినీ స్టార్ నుంచి క్రీడాకారుల వరకూ క్రిప్టోకు సానుకూలంగా ప్రచారం చేస్తున్నారు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడిపై భారీ రాబడులు వస్తాయంటూ తప్పుదారి పట్టించే ప్రకటనలు వస్తున్నాయన్న ఆందోళనల మధ్య స్వయంగా ప్రధానమంత్రి మోదీ ఈ అంశంపై సమావేశం నిర్వహించడం గమనార్హం. మరోవైపు క్రిప్టోపై నిషేధం తగదని, దీనిపై నియంత్రణ మాత్రమే ఉండాలని బీజేపీ నాయకుడు జయంత్ సిన్హా నేతృత్వంలోని జరిగిన తాజా పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో కూడా అభిప్రాయాలు వ్యక్తమవడం గమనార్హం. ఆయా అంశాల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీని నిబంధనలతో అనుమతించాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుంచీ ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లోనే కేంద్రం బిల్లు పెట్టడానికి కసరత్తు జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. వర్చువల్ కరెన్సీలకు సంబంధించి సేవలను అందించకుండా బ్యాంకులుసహా తన నియంత్రిత సంస్థలను అన్నింటిపైనా నిషేధం విధిస్తూ, 2018 ఏప్రిల్ 6వ తేదీన ఆర్బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను 2021 మార్చి 4వ తేదీన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి ఇక్కడ గమనించాల్సిన మరో అంశం. -
విదేశాల్లో నేరుగా భారత కంపెనీల లిస్టింగ్
ముంబై: భారత కంపెనీలు నేరుగా విదేశీ స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అయ్యేందుకు అవసరమైన చట్ట సవరణలను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టొచ్చంటూ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. పలు స్టార్టప్‌లు (యూనికార్న్‌లు) నేరుగా విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు అవకాశాలు కల్పించాలని కోరుతూ ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాయడం గమనార్హం. ‘‘భారత సంస్థలు నేరుగా విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు అనుమతి ఉంది. కాకపోతే ఇందుకు సంబంధించి కొన్ని అంశాలను పరిష్కరించాల్సి ఉంది. ఈ దిశగా అనుమతించాలని కోరిన సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నాం’’ అని తరుణ్ బజాజ్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు ఏటా జనవరి చివర్లో ప్రారంభమై రెండు దశల్లో కొనసాగుతాయని తెలిసిందే. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో (ఐఎఫ్ఎస్సీ) సెక్యూరిటీలను లిస్ట్ చేసేందుకు ఎటువంటి అనుమతులు అవసరం లేదని తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. భారత కంపెనీలు విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తే అది పోటీతత్వాన్ని పెంచడమే కాకుండా.. నిధుల సమీకరణను సులభతరం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత కంపెనీలు నేరుగా విదేశీ స్టాక్ ఎక్సేంజ్‌ల్లో, అదే మాదిరి విదేశీ కంపెనీలు భారత స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్టింగ్‌కు అనుమతించాలని సెబీ 2018లోనే ప్రతిపాదించింది. ధరల స్పీడ్‌కు వంట నూనెలు, పప్పుదినుసులే కారణం ముంబై: వంట నూనెలు, పప్పు దినుసుల ధరల తీవ్రత వల్లే మొత్తం ద్రవ్యోల్బణం రేటు తీవ్రంగా ఉంటోదని తరుణ్ బజాబ్ పేర్కొన్నారు. మార్కెట్లో వాటి లభ్యత పెంపు, సరఫరాల వ్యవస్థ మెరుగుదల, సుంకాల తగ్గింపు వంటి చర్యల ద్వారా ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్రం ప్రయత్నిస్తుందని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.అలాగే పంట దిగుబడి ఒకసారి అందుబాటులోకి వచ్చాక సమస్య మరికొంత దిగివస్తుందన్న భరోసాను ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం నిర్దిష్ట శ్రేణిలో కొనసాగుతుందన్న అంచనాలను వెలువరించారు. చదవండి : మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు -
పుట్టిన రోజు వేడుకలు.. రెవెన్యూ సెక్రటరీ సరెండర్
సాక్షి, తెనాలి అర్బన్: వార్డు సచివాలయంలో రెవెన్యూ సెక్రటరీ విధులు పక్కన పెట్టి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. జేసీ స్పందించి విచారణకు ఆదేశించారు. నిజమేనని తేలడంతో ఆరుగురు వార్డు వలంటీర్లను విధుల నుంచి తొలగించడంతో పాటు రెవెన్యూ సెక్రటరీని కలెక్టర్‌కు సరెండర్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ ఎం.జశ్వంతరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. స్థానిక ఐదో వార్డు సచివాలంలో పి.స్రవంతి రెవెన్యూ సెక్రటరీగా పని చేస్తున్నారు. గత నెల 19న ఆమె పుట్టిన రోజు వేడుకల్ని వార్డు వలంటీర్లు నిర్వహించారు. దాన్ని ఓ వలంటీర్ సెల్లో రికార్డు చేసి రెండు రోజుల కిందట సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. చదవండి: (ఏలూరు బాధితులకు అండగా ప్రభుత్వం) ఇది వైరల్ కావడంతో జేసీ వెంటనే స్పందించి విచారణ జరపాలని తెనాలి మున్సిపల్ కమిషనర్ ఎం.జశ్వంతరావును ఆదేశించారు. ఆయన శనివారం సంబంధిత వార్డు రెవెన్యూ సెక్రటరీ స్రవంతి, వలంటీర్లు తాడిబోయిన రత్నకుమారి, సోముపల్లి అలేఖ్య, ఎం.ప్రభుకుమార్, షేక్ రేహమున్నీసా, ఎం.లావణ్య, టి.లీలా హరీష్‌ను పిలిపించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారి నుంచి లిఖితపూర్వంగా వివరణ తీసుకున్నారు. విధులకు అటంకం కలిగిస్తూ వేడుకలు జరుపుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్ ఆరుగురు వార్డు వలంటీర్లను విధుల్ని నుంచి ఆదివారం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవార్డు రెవెన్యూ సెక్రటరీని జిల్లా కలెక్టర్‌కు సరెండర్ చేశారు. చదవండి: (42,313 ఎకరాల్లో 5 పారిశ్రామిక పార్కులు) -
రెవెన్యూ కార్యదర్శి కృష్ణ సస్పెన్షన్
యాచారం: రెవెన్యూ కార్యదర్శి కృష్ణను సస్సెన్షన్ చేస్తూ కలెక్టర్ రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేసినట్లు తహసీల్దార్ పద్మనాభరావు తెలిపారు. యాచారం రెవెన్యూ పరిధిలోని ఓ వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర భూమిగా మార్చడానికి ఓ వ్యక్తి నుంచి యాచారం రెవెన్యూ కార్యదర్శి అయిన కృష్ణ ఫోనులో డబ్బులు అడిగిన విషయం తెలిసిందే. రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పక్షం రోజుల కింద ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. వెంటనే తహసీల్దార్ పద్మనాభరావు కృష్ణను కలెక్టర్ కార్యాలయానికి సరెండర్ కూడా చేశారు. విచారణ జరిపిన అనంతరం కృష్ణను సస్పెండ్ చేస్తూ ఈనెల 21న కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు. ఫోనులో రైతుతో ఎందుకు సంభాషణ చేసింది, ఆ రైతు ఎందుకు ఫిర్యాదు చేశారోననే విషయమై పది రోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కలెక్టర్ సూచించినట్లు తెలిసింది.