న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు త్వరగా వాటి తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు రెవెన్యూ వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీలకు రాయితీతో కూడిన 15 శాతం పన్ను రేటును మరో ఏడాది పాటు (2024 మార్చి) వరకు పొడిగించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ఆదాయం పెరుగుతున్నట్టు చెప్పారు. అంటే కార్పొరేట్ రంగం పనితీరు కూడా మెరుగ్గా ఉందని, జీడీపీలో పన్నుల వాటా ప్రస్తుత సంవత్సరంలో అత్యధిక గరిష్టానికి చేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాయితీతో కూడిన పన్ను రేటును 2024 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు బడ్జెట్‌లో మంత్రి సీతారామన్ ప్రకటించడం తెలిసిందే. 2019 సెప్టెంబర్‌లో కార్పొరేట్ పన్ను తగ్గింపు సమయంలో మొదటిసారి ఈ అవకాశం కల్పించారు. 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటయ్యే తయారీ యూనిట్లు, 2023 మార్చి 31లోపు ఉత్పత్తి మొదలు పెడితే 15 శాతం పన్ను రేటును ఎంపిక చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ రాయితీ రేటును పొందే కంపెనీలు ఆదాయపన్ను చట్టం కింద మరే ఇతర మినహాయింపు, రాయితీ పొందేందుకు అవకాశం ఉండదు.
పన్నుల వాటా పెరుగుతోంది..
కార్పొరేట్ పన్ను తగ్గించడంతో జీడీపీలో పన్నుల నిష్పత్తి తగ్గుముఖం పట్టిందని, ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నట్టు తరుణ్ బజాజ్ తెలిపారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నులను కలిపి చూస్తే జీడీపీలో పన్నుల నిష్పత్తి ఈ ఏడాది అత్యంత గరిష్ట స్థాయికి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. గడిచిన మూడేళ్లలో మూలధన వ్యయాలు రెట్టింపైనట్టు చెప్పారు. ఇది జీడీపీ వృద్ధిని ముందుకు తీసుకెళుతుందన్నారు. ఒక్కసారి వృద్ధి చక్కగా పుంజుకుంటే ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. ప్రైవేటు పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చి ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళతాయన్న అంచనాలను వ్యక్తం చేశారు.
2021–22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను మించి ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదవడం తెలిసిందే. దీంతో 2021–22 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు రూ.11.08 లక్షల కోట్లను ప్రభుత్వం రూ.12.50 లక్షల కోట్లకు సవరించుకుంది. 2022–23 సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.14.20 లక్షల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని విధించుకుంది.
ఇబ్బందుల్లేకుండా రుణ సమీకరణ
ప్రభుత్వ రుణసమీకరణ కార్యక్రమం వచ్చే ఆర్థిక సంవత్సరంలో బాధ్యతాయుతుంగా ఉటుందని.., ప్రైవేటు పెట్టుబడులకు అవరోధంగా ఉండదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌సేత్ తెలిపారు. ద్రవ్యలోటుకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. జీడీపీలో ద్రవ్యలోటు 6.4 శాతంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసుకుంది. చెప్పినట్టుగా రూ.6.6 లక్షల కోట్ల రుణాలకు పరిమితం అవుతామని అయజ్ సేత్ అన్నారు. చిన్న పొదుపు పథకాల నుంచి ఎక్కువ నిధులు సమకూరితే మార్కెట్ నుంచి రుణ సమీకరణ తగ్గించుకుంటామని చెప్పారు.
రెట్రో కేసుల సెటిల్మెంట్ ఫిబ్రవరిలోనే పూర్తి..
రెట్రోస్పెక్టివ్ ట్యాక్సు కేసులన్నింటినీ దాదాపుగా ఫిబ్రవరిలోనే సెటిల్ చేసే అవకాశం ఉందని తరుణ్ బజాజ్ తెలిపారు. అనూహ్య మార్పులేమీ ఉండని, స్థిరమైన పన్ను విధానాలపై ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ఇది దోహదపడగలదని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ‘రెట్రో ట్యాక్సేషన్‌ను ఆగస్టులో రద్దు చేశాం. దాదాపుగా అన్ని కేసులను ఈ నెలలోనే పరిష్కరించే అవకాశం ఉంది. తద్వారా ఆ అధ్యాయం ఇక ముగిసిపోతుంది‘ అని బజాజ్ పేర్కొన్నారు.
చదవండి : పన్ను చెల్లింపుదారులకు ఝలక్ ! ఐటీ అప్‌డేట్.. క్షమాభిక్ష స్కీము కాదు..
Comments
Please login to add a commentAdd a comment