న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో వేసిన అంచనాలకు మించి పన్ను వసూళ్లు రానున్నాయని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. అక్టోబర్ నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6 లక్షల కోట్ల మేర ఉండగా.. ప్రతీ నెలా జీఎస్‌టీ వసూళ్లు సగటున రూ.1.15లక్షలుగా ఉంటున్నట్టు చెప్పారు.
బడ్జెట్ అంచనాలకు మించి పన్ను వసూళ్లు
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు, వంట నూనెల దిగుమతులపై కస్టమ్స్ సుంకాల తగ్గింపు వల్ల ఖజానాకు రూ.75,000–80,000 కోట్ల ఆదాయం తగ్గిపోనున్నట్టు చెప్పారు. అయినా పన్ను వసూళ్లు పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువే వస్తాయన్నారు. రిఫండ్‌లు (పన్ను తిరిగి చెల్లింపులు) తీసేసి చూసినా.. అక్టోబర్ నాటికి ప్రత్యక్ష పన్నులు రూ.6 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. జీఎస్‌టీ ఆదాయం నవంబర్‌లో రూ.1.30 లక్షల కోట్లు దాటిపోవచ్చన్నారు. 2021–22 బడ్జెట్‌లో పన్నుల ఆదాయం రూ.22.2 లక్షల కోట్లుగా కేంద్రం అంచనాలు వేసింది. ఇందులో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.11 లక్షల కోట్లు, కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో రూ.5.47 లక్షల కోట్లుగా రావచ్చని పేర్కొనడం గమనార్హం. 2020–21లో పన్నుల ఆదాయం రూ.20.2 లక్షల కోట్లుగా ఉంది.
రెట్రో కేసుల పరిష్కారానికి సిద్ధం ముందుకొచ్చిన 14 సంస్థలు
రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ కేసుల పరిష్కార ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ట్యాక్స్ డిమాండ్‌లు అందుకున్న 14 కంపెనీలు వీటి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. 17 కంపెనీలకు ట్యాక్స్ డిమాండ్లు పంపగా.. మూడు.. నాలుగు మినహా మిగతావన్నీ కూడా సెటిల్మెంట్‌కు తమ సమ్మతి తెలియజేశాయని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ సెటిల్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు నెలాఖరు దాకా సమయం ఉందని బజాజ్ చెప్పారు. కెయిర్న్ ఎనర్జీ విషయానికొస్తే.. ప్రభుత్వంపై వేసిన కేసులను వెనక్కి తీసుకునే దాన్ని బట్టి సత్వరం చెల్లింపులు ఉంటాయని ఆయన వివరించారు. గతంలో ఎప్పుడో జరిగిన వ్యాపార ఒప్పందాలపై కూడా పన్నులు విధించేలా (రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్) 2012లో చేసిన చట్టం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీన్ని ఉపయోగించుకుని వొడాఫోన్ తదితర 17 సంస్థలకు రూ. 1.10 లక్ష కోట్ల పన్నులు కట్టాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. కెయిర్న్ విషయంలో ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది. అయితే, అంతర్జాతీయ స్థాయిలో ఇది వివాదాస్పదం కావడం, న్యాయస్థానాల్లో కెయిర్న్‌కు అనుకూలంగా తీర్పులు రావడం తదితర పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఇటీవల ఈ చట్టాన్ని పక్కన పెట్టింది. ప్రభుత్వంపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటే వసూలు చేసిన పన్నులు తిరిగి ఇచ్చేస్తామని పేర్కొంది.
చదవండి: చమురు ధరలకు భారత్ చెక్!
Comments
Please login to add a commentAdd a comment