న్యూఢిల్లీ: బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని పతంజలి ఆయుర్వేద్ గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2023–24) రూ.9,335 కోట్ల ఆదాయాన్ని సాధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 23 శాతం పెరిగింది. లిస్టెడ్ కంపెనీ పతంజలి ఫుడ్స్‌లో కొంత వాటాలు విక్రయించడం ఆదాయం పెరిగేందుకు సాయపడింది.
అలాగే, గ్రూప్‌లోని ఇతర కంపెనీల రూపంలో మెరుగైన ఆదాయం సమకూరినట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు కంపెనీ సమర్పించిన వివరాల ఆధారంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇతర ఆదాయం రూ.2,875 కోట్లు 2023–24లో వచ్చినట్టు వెల్లడించింది. నికర ఆదాయాన్ని గమనిస్తే.. (కేవలం అమ్మకాల ద్వారా వచ్చిన) అంతక్రితం ఆర్థిక సంవ్సరం కంటే 14 శాతం తక్కువగా రూ.6,460 కోట్లకు పరిమితమైంది. నికర లాభం రూ.2,901 కోట్లుగా నమోదైంది. 2022–23 సంవత్సరంలో పతంజలి ఆయుర్వేద్ రూ.7,534 కోట్ల ఆదాయంపై రూ.578 కోట్ల లాభాన్ని ప్రకటించడం గమనార్హం.
ఆదాయం తగ్గినప్పటికీ, నికర లాభం ఐదు రెట్లు పెరిగినట్టు తెలుస్తోంది. ప్రధానంగా పతంజలి ఫుడ్స్‌లో వాటాల విక్రయం, ఇతర ఆదాయం ఇందుకు దోహదపడింది. ప్రకటనలు, ప్రచారం కోసం 9 శాతం అధికంగా రూ.422 కోట్లు వ్యయం చేసింది. పతంజలి ఆయర్వేద్ తన నిర్వహణలోని హోమ్, పర్సనల్ కేర్ వ్యాపారాన్ని రూ.1,100 కోట్లకు పతంజలి ఫుడ్స్‌కు విక్రయించేందుకు ఈ ఏడాది జూలైలో నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పతంజలి ఆయుర్వేద్ ఫలితాల్లో కనిపించనుంది. దివాలా పరిష్కార చట్టం కింద రుచి సోయా సంస్థను పతంజలి గ్రూప్ కొనుగోలు చేయడం, ఆ తర్వాత పేరును పతంజలి ఫుడ్స్‌గా మార్చడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment