Patanjali ayurved
-
పతంజలి ఆయుర్వేద్ ఆదాయం అదుర్స్!
న్యూఢిల్లీ: బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని పతంజలి ఆయుర్వేద్ గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2023–24) రూ.9,335 కోట్ల ఆదాయాన్ని సాధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 23 శాతం పెరిగింది. లిస్టెడ్ కంపెనీ పతంజలి ఫుడ్స్‌లో కొంత వాటాలు విక్రయించడం ఆదాయం పెరిగేందుకు సాయపడింది.అలాగే, గ్రూప్‌లోని ఇతర కంపెనీల రూపంలో మెరుగైన ఆదాయం సమకూరినట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు కంపెనీ సమర్పించిన వివరాల ఆధారంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇతర ఆదాయం రూ.2,875 కోట్లు 2023–24లో వచ్చినట్టు వెల్లడించింది. నికర ఆదాయాన్ని గమనిస్తే.. (కేవలం అమ్మకాల ద్వారా వచ్చిన) అంతక్రితం ఆర్థిక సంవ్సరం కంటే 14 శాతం తక్కువగా రూ.6,460 కోట్లకు పరిమితమైంది. నికర లాభం రూ.2,901 కోట్లుగా నమోదైంది. 2022–23 సంవత్సరంలో పతంజలి ఆయుర్వేద్ రూ.7,534 కోట్ల ఆదాయంపై రూ.578 కోట్ల లాభాన్ని ప్రకటించడం గమనార్హం.ఆదాయం తగ్గినప్పటికీ, నికర లాభం ఐదు రెట్లు పెరిగినట్టు తెలుస్తోంది. ప్రధానంగా పతంజలి ఫుడ్స్‌లో వాటాల విక్రయం, ఇతర ఆదాయం ఇందుకు దోహదపడింది. ప్రకటనలు, ప్రచారం కోసం 9 శాతం అధికంగా రూ.422 కోట్లు వ్యయం చేసింది. పతంజలి ఆయర్వేద్ తన నిర్వహణలోని హోమ్, పర్సనల్ కేర్ వ్యాపారాన్ని రూ.1,100 కోట్లకు పతంజలి ఫుడ్స్‌కు విక్రయించేందుకు ఈ ఏడాది జూలైలో నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పతంజలి ఆయుర్వేద్ ఫలితాల్లో కనిపించనుంది. దివాలా పరిష్కార చట్టం కింద రుచి సోయా సంస్థను పతంజలి గ్రూప్ కొనుగోలు చేయడం, ఆ తర్వాత పేరును పతంజలి ఫుడ్స్‌గా మార్చడం గమనార్హం. -
ఆపండి..లేదంటే: పతంజలికి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక
యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేదకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆధునిక వైద్య విధానాన్ని,అల్లోపతి ఔషధాలను టార్గెట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి తప్పుదారి పట్టించే ప్రకటనలను నిలిపివేయాలని ఆదేశించింది. లేదంటే భారీ జరిమానా తప్పదని సుప్రీం మంగళవారం ఆదేశించింది. అహసనుద్దీన్ అమనుల్లా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది. తప్పుదారి పట్టించే క్లెయిమ్‌లతో కూడిన అన్ని ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఇలాంటి ఉల్లంఘనను కోర్టు చాలా తీవ్రంగా పరిగణి స్తుందని పేర్కొన్న సుప్రీం ప్రతీ తప్పుడు క్లెయిమ్‌కు గరిష్టంగా రూ. 1 కోటి వరకు జరిమానా తప్పదని హెచ్చరించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పతంజలి పేర్కొన్న అంశాలు వెరిఫై కాలేదని, ఇవి డ్రగ్స్,రెమెడీస్ చట్టం 1954, వినియోగదారుల రక్షణ చట్టం వంటి పలు చట్టాలను ఉల్లంఘించేలా ఉన్నాయని ఐఏఎం పేర్కొంది. తదుపరి విచారణకు కేంద్ర నివేదికతో రావాలి ఇక మీదట పతంజలి ఆయుర్వేదం భవిష్యత్తులో అలాంటి ప్రకటనలను, పత్రికలలోప్రకటనలు చేయకుండా చూసుకోవాలని కోర్టు ఆదేశించింది అంతేకాదు 'అల్లోపతి వర్సెస్ ఆయుర్వేద' అనే చర్చగా మార్చకూడదని, తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనల సమస్యకు నిజమైన పరిష్కారాన్ని కనుగొనాలని బెంచ్ కేంద్రాన్ని కోరింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 కు వాయిదా వేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆచరణాత్మక పరిష్కారాన్ని చూడాలని కూడా భారత అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్‌ను ధర్మాసనం కోరింది. గతేడాది కూడా కోర్టు మందలించింది గతేడాది కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్‌పై నోటీసులు జారీ చేస్తూ.. అల్లోపతి వంటి ఆధునిక వైద్య విధానాలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చినందుకు బాబా రామ్‌దేవ్‌ను కోర్టు మందలించిన సంగతి తెలిసిందే. -
పతంజలి ఫుడ్స్‌లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: లిస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్‌లో ప్రమోటర్ సంస్థ పతంజలి ఆయుర్వేద్ 7 శాతం వాటాను విక్రయించనుంది. కంపెనీలో పబ్లిక్ వాటాను 25 శాతానికి పెంచే బాటలో స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)ను చేపట్టనున్నట్లు పతంజలి ఫుడ్స్ పేర్కొంది. తద్వారా పతంజలి ఆయుర్వేద్ 2.53 కోట్ల షేర్లను( 7 శాతం వాటా) విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు షేరుకి రూ. 1,000 ఫ్లోర్ ధరను నిర్ణయించింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు నేడు(13న) ప్రారంభంకానున్న ఓఎఫ్ఎస్ శుక్రవారం(14న) రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రానుంది. వాటా విక్రయం ద్వారా పతంజలి ఆయుర్వేద్ కనీసం రూ. 2,530 కోట్లు అందుకోనుంది. ప్రస్తుతం పతంజలి ఫుడ్స్‌లో పబ్లిక్కు 19.18 శాతం వాటా ఉంది. కాగా.. డిమాండు ఆధారంగా పతంజలి ఆయుర్వేద్ అదనంగా 2 శాతం వాటా(72.4 లక్షల షేర్లు)ను విక్రయించనుంది. వెరసి 9 శాతం వరకూ వాటాను తగ్గించుకునే యోచనలో ఉంది. ఓఎఫ్ఎస్ వార్తల నేపథ్యంలో పతంజలి ఫుడ్స్ షేరు బీఎస్ఈలో 1.3 శాతం లాభంతో రూ. 1,228 వద్ద ముగిసింది. -
ఈ-కామర్స్ మార్కెట్లోకి యోగా గురు
సాక్షి, న్యూఢిల్లీ : ఇప్పటికే పలు మార్కెట్లలో సంచలనాలు సృష్టిస్తున్న యోగా గురు రాందేవ్ బాబా, ఈ-కామర్స్ మార్కెట్‌పైనా కన్నేశారు. త్వరలోనే ఈ-కామర్స్ పరిశ్రమలోకి అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. రాందేవ్ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులను ఈ-కామర్స్ ఇండస్ట్రిలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఎనిమిది దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీలతో జతకట్టాలని కంపెనీ చూస్తోందని తెలిసింది. ''భారీ మొత్తంలో ఆన్లైన్ పుష్ కోసం పతంజలి ఆయుర్వేదం పనిచేయడం ప్రారంభించింది. త్వరలోనే ప్రపంచంలో అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరుగుతుంది. పలు పోర్టల్స్‌లో పతంజలి ఉత్పత్తుల ఆన్లైన్ షాపింగ్, కొత్త చాప్టర్ ప్రారంభమవుతుంది'' అని రాందేవ్ బాబా అధికార ప్రతినిధి ఎస్కే టిజరవాలా ట్విట్టర్ అకౌంట్లో చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలకు గట్టి పోటీగా డైపర్, శానిటరీ నాప్కిన్ పరిశ్రమలోకి ప్రవేశించనున్నట్టు కూడా డిసెంబర్ 26న కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పతంజలి అత్యంత వేగవంతంగా అభివృద్ది చెందుతున్న కంపెనీల్లో ఒకటి. గతేడాది ఫోర్బ్స్ మ్యాగజైన్ వార్షిక ఇండియా రిచ్ లిస్టులో 45వ స్థానంలో ఉన్న పతంజలి కంపెనీ, ఈ ఏడాది 19వ స్థానంలోకి ఎగిసింది. -
బాబా రాందేవ్ అడిగితే కాదంటారా?
న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబాకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ఆయన ప్రభుత్వానికి ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో బహిరంగ రహస్యమే. అందుకనే నరేంద్ర మోదీ బుధవారం హరిద్వార్‌లోని పతంజలి ఆశ్రమంలో ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్‌ను స్వయంగా ప్రారంభించారు. దేశం కోసం రాందేవ్ బాబా చేస్తున్న కషిని కూడా ఆయన ప్రశంసించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేసినందుకు రాందేవ్ బాబాకు మోదీ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ రుణం తీర్చుకుంటోంది. బాబా ప్రాణాలకు అంతగా ముప్పు లేకపోయినప్పటికీ 2014, నవంబర్ నెలలో ఆయనకు మోదీ ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది. హరిద్వార్‌లోని ఆయన ఫుడ్ పార్క్‌కు, యోగా ఆశ్రమానికి పారా మిలటరీ భద్రతను కల్పించింది. అక్కడ 35 మంది సీఐఎస్ఎఫ్ సాయుధ సిబ్బందిని ఏర్పాటు చేసింది. ప్రైవేటు రంగానికి అత్యంత అరుదైన పరిస్థితుల్లోనే ఈ సీఐఎస్ఎఫ్ భద్రతను కల్పిస్తారన్న విషయం తెల్సిందే. బాబాకు కల్పిస్తున్న ఈ భద్రతకుగాను కేంద్ర ప్రభుత్వానికి ఏటా 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఆ సంస్థతో టైఅప్ పెట్టుకుంటున్నట్లు 2016, ఆగస్టులో డెఫెన్స్ రిసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ప్రకటించింది. దేశంలోని పిల్లల్లో పౌష్టికాహారలోపాన్ని సరిదిద్దేందుకు అవసరమైన మందుల తయారీకి రాందేవ్ బాబాతో సంయుక్తంగా ఓ సంస్థను ఏర్పాటు చేస్తామని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జ్వాల్ ఓరమ్ ప్రకటించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌవాన్ సూచన మేరకు ఆ రాష్ట్రంలోని అన్ని చౌక దుకాణాల్లో పతంజలి ఉత్పత్తులను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యాక్టరీలు, హెర్బల్ పార్కులు, యూనివర్శిటీలు, స్కూళ్లు, గోశాలలు....ఇలా ఎన్నో ఏర్పాటు చేసేందుకు కేంద్రంలోనూ, పలు రాష్ట్రాల్లో అధికారంలోవున్న బీజేపీ ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. వస్తున్నాయి. పతంజలి యోగా పీఠాన్ని ఏర్పాటు చేసేందుకు అండమాన్‌లో ఏకంగా ఓ దీవినే ఉచితంగా ఇస్తానని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించారు. ఆవు ఉత్పత్తుల అమ్మడం ద్వారా ఇప్పటికీ అధిక లాభాలను ఆర్జిస్తున్న రాందేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ ఎప్పటి నుంచో దీనిపై దష్టిని కేంద్రీకరిస్తోంది. పతంజలి ఉత్పత్తుల్లో ఎక్కువ అమ్ముడుపోతున్న వాటిల్లో ప్రధానమైనది ఆవు నెయ్యి. ఇప్పుడు ఆవు మూత్రంతో తయారు చేసిన ఫినాయ్ల్ను కూడా అమ్ముతున్నారు. క్యాన్సర్ సహా అన్ని రోగాలను నయం చేసే ఔషధ గుణాలు ఆవు మూత్రంలో ఉన్నాయని ప్రచారం చేసిన రాందేవ్ బాబా నెలకు ఐదువేల లీటర్ల ఆవు మూత్రాన్ని సరఫరా చేయాలంటూ 2008లో ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. నెలకు మూడు వేల లీటర్ల చొప్పున ఇప్పటి వరకు రెండు లక్షల లీటర్లకుపైగా గో మూత్రాన్ని సేకరించారు. గోధాన్ ఆర్క్, సంజీవని వటి, పాంచ్గవ్యా సోప్, కాయ్కల్ప్ ఆయిల్, శుద్ధి ఫినాయిల్ ఉత్పత్తుల్లో గో మూత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఆవుల క్రాస్ బ్రీడింగ్‌ను అభివద్ధి చేసేందుకు ఓ రెసెర్చ్ సెంటర్‌ను ఉత్తరాఖండ్‌లోనే ఏర్పాటు చేయాలనుకున్న బాబా అక్కడి బీజేపీ ప్రభుత్వంతోని ఉప్పందం కూడా కుదుర్చుకున్నారు. మరెందుకో ఇప్పుడు హరిద్వార్‌లో ఏర్పాటు చేయబోతున్నారు. బీజేపీ పార్టీతో, ఆ పార్టీ ప్రభుత్వాలతో వున్న సంబంధాలను ఉపయోగించుకొని తన వ్యాపార సామ్రాజ్యాన్ని బాబా రాందేవ్ విస్తరించుకుంటూ పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. దేశంలో గోరక్షణ ఉద్యమం కూడా ఆయన రహస్య ఉపదేశంతోనే వచ్చిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మూడువేల కోట్ల రూపాయలు దాటిని ఆయన వ్యాపార సామాజ్య్రం పదేళ్లలో లక్ష కోట్ల రూపాయలకు విస్తరిస్తుందని ఓ ఇంటర్వ్యూలో బాబానే చెప్పుకున్నారు. నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని, ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంటూ ఇప్పటి వరకు పతంజలి సంస్థపై దాదాపు 90 కేసులు దాఖలయ్యాయి. ఓ కేసులో 11 లక్షల జరిమానా కూడా పడింది. బీజేపీ ప్రభుత్వాలు ఇంత బహిరంగంగా సహాయ సహకారాలు అందించడం ఒక్క బాబా విషయంలోనే జరిగిందేమో. -
రాజధాని భూములపై కన్నేసిన రాందేవ్
న్యూఢిల్లీ : పతంజలి న్యూడుల్స్, బిస్కట్స్ అంటూ మార్కెట్లో హల్ చల్ చేస్తున్న యోగా గురు బాబా రాందేవ్ దేశ రాజధాని నగరంలోని భూములపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో పతంజలి ఉత్పత్తుల మరో యూనిట్ ను నెలకొల్పేందుకు పావులు కదువుతున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తన ఉత్పత్తులతో ఎఫ్ఎమ్ సీజీ సంస్థలకు గట్టి పోటీ ఇస్తున్న పతంజలి, తన తయారీ యూనిట్ లను పెంచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరభారతదేశంలో పెరుగుతున్న ఎఫ్ఎమ్ సీజీ డిమాండ్ కు అనుగుణంగా, ఢిల్లీకి దగ్గర్లో ఓ తయారీ యూనిట్ ను యోగా గురు బాబా రాందేవ్ స్థాపించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్ ప్రెస్ వేపై ప్రతిపాదించిన పతంజలి యూనివర్సిటీ క్యాంపస్ కు పక్కనే ఈ తయారీ యూనిట్ ను నిర్మించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై యమునా ఎక్స్ ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీ(వైఈఐడీఏ)తో పతంజలి కంపెనీ చర్చిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రూ.320 కోట్లతో 200 ఎకరాల ప్లాట్ ను కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. యూనివర్సిటీ కోసం 150ఎకరాలను రూ.240 కోట్లకు కొనుగోలు చేయనున్నారు. ఫ్యాక్టరీ కోసం ఇండస్ట్రియల్ స్థలాన్ని, యూనివర్సిటీ కోసం ఇన్ స్టిట్యూషనల్ స్థలాన్ని కావాలని పతంజలి కంపెనీ తమతో చర్చించినట్టు వైఈఐడీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరుణ్ వీర్ సింగ్ తెలిపారు. అయితే ప్రస్తుతం పతంజలి కేవలం ఒక్క తయారీ యూనిట్ నే కలిగిఉంది. అది ఉత్తరఖాండ్ లోని హరిద్వార్ లో ఉంది. మొదట 10 ఎకరాలతో ప్రారంభించిన ఈ యూనిట్, ప్రస్తుతం 150 ఎకరాలకు విస్తరించారు. వచ్చే రెండేళ్లలో మరో నాలుగు తయారీ యూనిట్లను స్థాపించాలని పతంజలి భావిస్తోంది. 1997లో చిన్న ఫార్మసీగా పతంజలి హరిద్వార్ లో ప్రారంభమైంది. పతంజలి న్యూడుల్స్, షాంపులు, సబ్బులు ఇల పలురకాల పతంజలి ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఆరునెలల కాలంలో ఈ ఉత్పత్తులు 64శాతం పెరిగి రూ.731 కోట్లగా నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది. క్రెడిగ్ రేటింగ్ లో సైతం పతంజలి దూసుకుపోతోంది. బ్రిక్ వర్క్ ఇచ్చిన రేటింగ్స్ లో పతంజలి ప్రొవిజనల్ టర్న్ వర్ ఆర్థికసంవత్సరం 2016లో మొదటి 10నెలల కాలంలో రూ.3,266.97 కోట్లగా నమోదైనట్టు పేర్కొంది. అయితే గతేడాది ఇదే సమయంలో ఈ టర్న్ వర్ రూ.1,587.51 కోట్లగా ఉంది.