రాజధాని భూములపై కన్నేసిన రాందేవ్
న్యూఢిల్లీ : పతంజలి న్యూడుల్స్, బిస్కట్స్ అంటూ మార్కెట్లో హల్ చల్ చేస్తున్న యోగా గురు బాబా రాందేవ్ దేశ రాజధాని నగరంలోని భూములపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో పతంజలి ఉత్పత్తుల మరో యూనిట్ ను నెలకొల్పేందుకు పావులు కదువుతున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తన ఉత్పత్తులతో ఎఫ్ఎమ్ సీజీ సంస్థలకు గట్టి పోటీ ఇస్తున్న పతంజలి, తన తయారీ యూనిట్ లను పెంచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరభారతదేశంలో పెరుగుతున్న ఎఫ్ఎమ్ సీజీ డిమాండ్ కు అనుగుణంగా, ఢిల్లీకి దగ్గర్లో ఓ తయారీ యూనిట్ ను యోగా గురు బాబా రాందేవ్ స్థాపించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్ ప్రెస్ వేపై ప్రతిపాదించిన పతంజలి యూనివర్సిటీ క్యాంపస్ కు పక్కనే ఈ తయారీ యూనిట్ ను నిర్మించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై యమునా ఎక్స్ ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీ(వైఈఐడీఏ)తో పతంజలి కంపెనీ చర్చిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రూ.320 కోట్లతో 200 ఎకరాల ప్లాట్ ను కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. యూనివర్సిటీ కోసం 150ఎకరాలను రూ.240 కోట్లకు కొనుగోలు చేయనున్నారు.
ఫ్యాక్టరీ కోసం ఇండస్ట్రియల్ స్థలాన్ని, యూనివర్సిటీ కోసం ఇన్ స్టిట్యూషనల్ స్థలాన్ని కావాలని పతంజలి కంపెనీ తమతో చర్చించినట్టు వైఈఐడీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరుణ్ వీర్ సింగ్ తెలిపారు. అయితే ప్రస్తుతం పతంజలి కేవలం ఒక్క తయారీ యూనిట్ నే కలిగిఉంది. అది ఉత్తరఖాండ్ లోని హరిద్వార్ లో ఉంది. మొదట 10 ఎకరాలతో ప్రారంభించిన ఈ యూనిట్, ప్రస్తుతం 150 ఎకరాలకు విస్తరించారు. వచ్చే రెండేళ్లలో మరో నాలుగు తయారీ యూనిట్లను స్థాపించాలని పతంజలి భావిస్తోంది. 1997లో చిన్న ఫార్మసీగా పతంజలి హరిద్వార్ లో ప్రారంభమైంది.
పతంజలి న్యూడుల్స్, షాంపులు, సబ్బులు ఇల పలురకాల పతంజలి ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఆరునెలల కాలంలో ఈ ఉత్పత్తులు 64శాతం పెరిగి రూ.731 కోట్లగా నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది. క్రెడిగ్ రేటింగ్ లో సైతం పతంజలి దూసుకుపోతోంది. బ్రిక్ వర్క్ ఇచ్చిన రేటింగ్స్ లో పతంజలి ప్రొవిజనల్ టర్న్ వర్ ఆర్థికసంవత్సరం 2016లో మొదటి 10నెలల కాలంలో రూ.3,266.97 కోట్లగా నమోదైనట్టు పేర్కొంది. అయితే గతేడాది ఇదే సమయంలో ఈ టర్న్ వర్ రూ.1,587.51 కోట్లగా ఉంది.