
యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేదకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆధునిక వైద్య విధానాన్ని,అల్లోపతి ఔషధాలను టార్గెట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి తప్పుదారి పట్టించే ప్రకటనలను నిలిపివేయాలని ఆదేశించింది. లేదంటే భారీ జరిమానా తప్పదని సుప్రీం మంగళవారం ఆదేశించింది. అహసనుద్దీన్ అమనుల్లా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది.
తప్పుదారి పట్టించే క్లెయిమ్‌లతో కూడిన అన్ని ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఇలాంటి ఉల్లంఘనను కోర్టు చాలా తీవ్రంగా పరిగణి స్తుందని పేర్కొన్న సుప్రీం ప్రతీ తప్పుడు క్లెయిమ్‌కు గరిష్టంగా రూ. 1 కోటి వరకు జరిమానా తప్పదని హెచ్చరించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పతంజలి పేర్కొన్న అంశాలు వెరిఫై కాలేదని, ఇవి డ్రగ్స్,రెమెడీస్ చట్టం 1954, వినియోగదారుల రక్షణ చట్టం వంటి పలు చట్టాలను ఉల్లంఘించేలా ఉన్నాయని ఐఏఎం పేర్కొంది.
తదుపరి విచారణకు కేంద్ర నివేదికతో రావాలి
ఇక మీదట పతంజలి ఆయుర్వేదం భవిష్యత్తులో అలాంటి ప్రకటనలను, పత్రికలలోప్రకటనలు చేయకుండా చూసుకోవాలని కోర్టు ఆదేశించింది అంతేకాదు 'అల్లోపతి వర్సెస్ ఆయుర్వేద' అనే చర్చగా మార్చకూడదని, తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనల సమస్యకు నిజమైన పరిష్కారాన్ని కనుగొనాలని బెంచ్ కేంద్రాన్ని కోరింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 కు వాయిదా వేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆచరణాత్మక పరిష్కారాన్ని చూడాలని కూడా భారత అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్‌ను ధర్మాసనం కోరింది.
గతేడాది కూడా కోర్టు మందలించింది
గతేడాది కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్‌పై నోటీసులు జారీ చేస్తూ.. అల్లోపతి వంటి ఆధునిక వైద్య విధానాలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చినందుకు బాబా రామ్‌దేవ్‌ను కోర్టు మందలించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment