misleading ads
-
కోచింగ్ సెంటర్లకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణనిచ్చే కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు చేయకూడదని కేంద్రం హెచ్చరించింది. కోచింగ్ కేంద్రాలు చేసే 100 శాతం జాబ్ గ్యారెంటీ, 100 శాతం సెలెక్షన్ వంటి తప్పుడు ప్రకటనలను నియంత్రించేందుకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో కేంద్ర వినియోగదారుల భద్రత సంస్థకు (CCPA) అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా ఇప్పటివరకు సీసీపీఏ 54 నోటీసులు జారీ చేయగా.. రూ. 54.60 లక్షల జరిమానాలు విధించింది.‘విద్యార్థుల నుంచి కోచింగ్ సెంటర్లు ఉద్దేశపూర్వకంగా కొంత సమాచారాన్ని దాచడం తాము గమనించాం. అందుకే కోచింగ్ సెంటర్ల నిర్వహకుల కోసం కొత్తమార్గదర్శకాలను రూపొందించామని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే పేర్కొన్నారు. కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని అయితే ప్రకటనల నాణ్యత వినియోగదారుల హక్కులను దెబ్బతీయకూడదని ఆమె అన్నారు.కొత్త మార్గదర్శకాల ప్రకారం..కోచింగ్ సెంటర్లు అందించే కోర్సులు, వ్యవధికి సంబంధించి తప్పుడు ప్రకటనలు చేయకూడదు. ఉదా: ఫీజు విధానం, వాపస్ పాలసీ, ఎగ్జామ్ ర్యాంకింగ్, జాబ్ గ్యారంటీ, జీతం పెరుగుదల వంటివిఅభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత వారి రాతపూర్వక అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్లు అభ్యర్థుల పేర్లు, ఫొటోలు ఉపయోగించకూడదు. కోర్సుల గురించి ముఖ్యమైన సమాచారాన్ని బహిర్గతం చేయాలి.చాలా మంది యూపీఎస్సీ విద్యార్థులు తమ స్వంతంగా చదవుకొని ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేస్తారు. కోచింగ్ సెంటర్ల నుంచి ఇంటర్వ్యూ మార్గదర్శకాలను మాత్రమే తీసుకుంటారు. ఈ విషయంలో విద్యార్ధులకు ముందే స్పష్టత ఇవ్వాలిఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులు తమ వద్ద ఏ కోర్సులో శిక్షణ తీసుకున్నారో తెలియజేయాలి.చట్టబద్ధంగా అనుమతి తీసుకున్న భవనాల్లో మాత్రమే కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి.కోచింగ్ సెంటర్లు తమ అభ్యర్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, భద్రత కల్పించాలి.నిబంధనలు ఉల్లంఘించిన వారికి వినియోగదారుల రక్షణ చట్టం కింద జరిమానాలు విధించనున్నారు. -
పతంజలి ధిక్కార కేసులో మళ్లీ అక్షింతలు
న్యూఢిల్లీ, సాక్షి: తప్పుదోవ పట్టించే ప్రకటనలు.. తదనంతర కోర్టు ధిక్కారణ పరిణామాల వ్యవహారంలో పతంజలి ఆయుర్వేద్ తీరును తప్పుబట్టడంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ఈ క్రమంలో మంగళవారం విచారణలోనూ ఆ కంపెనీ నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణలపై సుప్రీం కోర్టు మండిపడింది. పేపర్లో క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇచ్చినా కూడా.. కోర్టు వాళ్లను వదలకపోవడం విశేషం. ‘‘ఇవాళ్టి న్యూస్పేపర్లో ఇచ్చిన క్షమాపణల ప్రకటన.. గతంలో పతంజలి ఉత్పత్తుల కోసం ఇచ్చిన ఫుల్‌పేజీ ప్రకటనల మాదిరే ఉన్నాయా?.. ఆ క్షమాపణల తాలుకా అక్షరాల సైజు కూడా ప్రకటనలప్పుడు ఇచ్చిన సైజులోనే ఉన్నాయా?’’ అంటూ ద్విసభ్య ధర్మాసనం పతంజలి ఆయుర్వేద్ నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణలను ప్రశ్నించింది. అయితే.. క్షమాపణల కోసం పతంజలి లక్షలు వెచ్చిందని, సమారు రూ.10 లక్షల ఖర్చుతో 67 పత్రికల్లో ఈ ప్రకటన ఇచ్చిందని పతంజలి తరఫు న్యాయవాది రోహత్గీ కోర్టుకు తెలియజేశారు. అలాంటప్పుడు.. గతంలో ఇచ్చిన ప్రకటనల మాదిరే ఈ క్షమాపణల ప్రకటన ఉందా? అని జస్టిస్ హిమా కోహ్లీ, పతంజలి న్యాయవాదిని ప్రశ్నించారు. ప్రకటనల కోసం పతంజలి భారీగా ఖర్చు చేసిందని రోహత్గీ చెప్పగా.. దానివల్ల మాకొచ్చిన ఇబ్బందేం లేదంటూ బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. మరోవైపు పతంజలిపై కేసు వ్యవహారంలో ఇండియన్ మెడికల్ అసోషియేషన్‌కు రూ.100 కోట్ల జరిమానా విధించాలంటూ ఒక విజ్ఞప్తి వచ్చిందని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీనిపై అనుమానాలున్నాయని బెంచ్ పేర్కొంది. అయితే ఆ అభ్యర్థనతో తమ క్లయింట్లకు ఎలాంటి సంబంధం లేదని న్యాయవాది రోహత్గి కోర్టుకు వివరణ ఇచ్చారు. మరోవైపు పత్రికల్లో క్షమాపణలు మరింత పెద్ద సైజులో ప్రకటనలుగా ఇస్తామని రాం దేవ్ చెప్పడంతో ఈ కేసు విచారణను మరో వారం వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఇదిలా ఉంటే.. డయాబెటిస్, బీపీ లాంటి వ్యాధులను తమ కంపెనీ ఉత్పత్తులు నయం చేస్తాయని పతంజలి ఆయుర్వేద్ గతంలో ప్రకటనలు ఇచ్చుకుంది. అయితే ఆ తప్పుడు ప్రకటనల కేసులో ఇవాళ విచారణ ఉండగా, పతంజలి ఆయుర్వేద్ దేశవ్యాప్తంగా పలు ప్రముఖ జాతీయ దినపత్రికల్లో క్షమాపణలు చెబుతూ ప్రకటన ఇచ్చింది. కోర్టును తాము ఎప్పుడూ గౌరవిస్తామని, తప్పులు మరోసారి చేయబోమంటూ అందులో పేర్కొన్నారు. -
పతంజలి కేసు.. రాందేవ్‌పై మళ్లీ సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ, సాక్షి: కోర్టు ధిక్కరణ కేసులో పతంజలి ఆయుర్వేద నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణపై సుప్రీం కోర్టు మరోసారి మండిపడింది. తామేం అంధులం కాదని, ఈ కేసులో ఉదారంగా ఉండాలని అనుకోవడం లేదంటూ ధ్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో క్షమాపణలు తెలియజేస్తూ పతంజలి నిర్వాహకులిద్దరూ దాఖలు చేసిన అఫిడవిట్లను సైతం కోర్టు బుధవారం తిరస్కరించింది. అంతేకాదు.. తప్పుడు ప్రకటన విషయంలో నిర్లక్ష్యం వహించిన ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగంపైనా సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. ‘‘వాళ్లు ఏదో పేపర్ మీద మొక్కుబడిగా క్షమాపణలు రాసి మాకు ఇచ్చారు. ఆ క్షమాపణల్ని మేం తిరస్కరిస్తున్నాం. పైగా ఉద్దేశపూర్వక ఉల్లంఘనలుగానే పరిగణిస్తాం’’ అని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఏ అమానుల్లాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ‘ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. నిర్ణీత సమయంలోపు మాకు అఫిడవిట్లు పంపాలన్న ధ్యాసే వాళ్లకు లేనట్లు ఉంది. పైగా రాం దేవ్, బాలకృష్ణలు తమ క్షమాపణలను ముందుగా మీడియాకు తెలియజేశారు. వాళ్లు పబ్లిసిటీనే నమ్ముకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అది చిన్న తప్పా? ఆ సమయంలో పతంజలి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అఫిడవిట్లలో లోపం ఉందని ధర్మాసనానికి వివరించబోయారు. అయితే ‘లోపం’ అనే మాట చాలా చిన్నదంటూ ధర్మాసనం రోహత్గీకి బదులిచ్చింది. కోర్టు ఆదేశాలు ఇచ్చాక కూడా తప్పులు చేయడం ఏంటని మండిపడింది. ఈ కేసులో తాము ఉదారంగా ఉండాలని అనుకోవట్లేదని బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగం తీరును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ‘‘ ఈ వ్యవహారంలో ఉత్తరాఖండ్ అధికారులు ఏం చేయలేదు. లైసెన్సింగ్ ఇన్స్పెక్టర్లు ఎందుకు సక్రమంగా పని చేయలేదు?. ఆ ముగ్గురు అధికారుల్ని ఒకేసారి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది’’ అని బెంచ్ అభిప్రాయపడింది. ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోబోమని, బాధ్యుల్ని చీల్చిచెండాడి తీరతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో కోర్టుకు హాజరు కాకుండా రాందేవ్, బాలకృష్ణ విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేశారని, ఈ కేసులో ఏప్రిల్ 16వ తేదీన ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణ వాయిదా వేసింది. ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగంపై ఫైర్ పతంజలి ఆయుర్వేద ఔషధాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఉత్తరాఖండ్ డ్రగ్స్ లైసెన్సింగ్ అథారిటీపై సుప్రీం కోర్టు మండిపింది. ‘‘తప్పుడు ప్రకటన విషయంలో.. 2021లోనే కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీకి లేఖ రాసింది. దానికి బదులుగా లైసెన్సింగ్ అథారిటీకి సదరు కంపెనీ బదులిచ్చింది. అయినప్పటికీ అథారిటీ కేవలం హెచ్చరికలతోనే సరిపెట్టింది అని కోర్టు పేర్కొంది. ఇలా ఆరుసార్లు జరిగినా ఉత్తరాఖండ్ అధికార యంత్రాగం మౌనంగా ఉండిపోయిందని, పైగా కేంద్రం లేఖలు రాసినా ఎలాంటి నివేదిక రూపొందించలేదని కోర్టు గుర్తు చేసింది. కాబట్టే, ఆ అధికారుల్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఆ సమయంలో కోర్టుకు హాజరైన ఉత్తరాఖండ్ ఫుండ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ మిథిలేష్ కుమార్ రెండు చేతులు జోడించి ధర్మాసనం ఎదుట క్షమాపణలు చెప్పారు. తాను 2023లో బాధ్యతలు స్వీకరించానని, అంతకుముందే ఇది జరిగిందని, తనను వదిలేయాలంటూ ఆయన కోర్టుకు వివరించారు. అయితే కోర్టు మాత్రం కనికరించలేదు. ఆ మందులు తీసుకున్న అమాయకుల పరిస్థితి ఏంటంటూ కోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలపగా.. చర్యలు ఇప్పుడు తీసుకున్నారా? అంటూ జస్టిస్ హిమా కోహ్లీ పెదవి విరిచారు. దీంతో క్షమాపణలు తెలిపిన ఆయన.. కఠిన తీసుకుంటామంటూ కోర్టుకు స్పష్టం చేశారు. ఎట్టకేలకు అఫిడవిట్లు.. ఇదిలా ఉంటే.. పతంజలి నుంచి తప్పుడు ప్రకటన వ్యవహారంలో సుప్రీం కోర్టు గతంలోనే ఈ ఇద్దరు నిర్వాహకుల్ని హెచ్చరించింది. దీంతో.. చట్టం, వాణిజ్య ప్రకటనలు, మార్కెట్ నిబంధనలను ఇకపై ఉల్లంఘించబోమంటూ సర్వోన్నత న్యాయస్థానానికి గత ఏడాది నవంబరు 21న పతంజలి తరఫున వీరు ప్రమాణ పత్రం సమర్పించారు. అయినప్పటికీ ఆ హామీలను పాటించకపోవడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం గత వారం వారిద్దరిపై కోర్టు ధిక్కారం కింద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ బేషరతుగా క్షమాపణలు తెలిపారు. ప్రమాణ పత్రం ఉల్లంఘనలపై చిత్తశుద్ధితో విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోసారి ఈ పొరపాటును పునరావృతం కానివ్వబోమని వాగ్దానం చేశారు. దీనికిగాను వారిద్దరూ విడివిడిగా మంగళవారం సాయంత్రం అఫిడవిట్లు దాఖలు చేశారు. అదే సమయంలో.. ప్రజలను తప్పుదోవ పట్టించే పతంజలి ప్రకటనల కేసులో కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అల్లోపతి ఔషధాల ప్రభావశీలతను తక్కువ చేసినందుకుగానూ పతంజలి ఆయుర్వేద సంస్థ తీరును ఆ అఫిడవిట్లో కేంద్రం తప్పుబట్టింది. పైగా కరోనాను తగ్గిస్తుందంటూ కరోనిల్ పేరిట పతంజలి చేసిన ప్రచారంపై సంస్థను అప్పట్లోనే హెచ్చరించినట్లు వెల్లడించింది. అయితే ఈ నివేదికపైనా సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. IMA పిటిషన్.. తమ ఉత్పత్తుల వల్ల కొన్ని వ్యాధులు నయం అవుతాయంటూ పతంజలి కంపెనీ కొన్ని ప్రకటనలు ఇస్తూ వచ్చింది. ఈ ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కిందటి ఏడాది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కోర్టులో కేసు వేసింది. ఆ ప్రకటనలు డాక్టర్లను కించపరిచేలా ఉన్నాయంటూ పేర్కొంది. ఈ పిటీషన్ పైనే ధర్మాసనం విచారణ జరిపింది. గత విచారణల్లో.. ఆధునిక అలోపతి వైద్యాన్ని, ఆ విధానాన్ని అనుసరించే డాక్టర్లను కించపరిచేలా..నిరాధార ఆరోపణలు చేస్తున్న పతంజలి ఆయుర్వేద సంస్థ ఉత్పత్తులను, ఆ ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని సుప్రీం కోర్టు గత విచారణల్లో ఆదేశించింది. ఆ సమయంలో ఆ ఆయుర్వేద సంస్థ చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకునే మార్గాన్ని కనిపెట్టాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలోనే కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కళ్లు మూసుకుని ఉందంటూ కేంద్రంపై మండిపడింది సర్వోన్నత న్యాయస్థానం. -
అలాంటి వాటిని నమ్మొద్దు.. వెంటనే ఫిర్యాదు చేయండి - ఆర్బీఐ
రుణమాఫీకి సంబంధించిన వార్తలు, సోషల్ మీడియాలో వస్తున్న మోసపూరిత ప్రకటనలను నమ్మకూడదని, వీటి వల్ల వినియోగదారులు మోసపోయే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ రోజు ఒక (డిసెంబర్ 11) ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొన్ని సంస్థలు ఎటువంటి చట్టబద్ధమైన అధికారం లేకుండా 'రుణ మాఫీ సర్టిఫికెట్లు' జారీ చేయడానికి సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన సెంట్రల్ బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. లోన్ తీసుకుంటే అవన్నీ మాఫీ అవుతాయనే వార్త వాస్తవం కాదని, వాటిని ఎట్టిపరిస్థితుల్లో నమ్మవద్దని ఆర్బీఐ వినియోగదారులను హెచ్చరించింది. ప్రజలను మోసం చేయడానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు ఇలాంటి మోసపూరిత ప్రకటనలు చేస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇలాంటి మోసాలకు చెక్ పెట్టడానికి కొన్ని చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. లోన్ తీసుకుని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని వస్తున్న వార్తలు ఆర్ధిక సంస్థల స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని, ముఖ్యంగా డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తాయని ఆర్బీఐ పేర్కొంది. ఇలాంటి సందేశాలు మీకు వచ్చినట్లయితే తప్పకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ వెల్లడించింది. -
ఆపండి..లేదంటే: పతంజలికి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక
యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేదకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆధునిక వైద్య విధానాన్ని,అల్లోపతి ఔషధాలను టార్గెట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి తప్పుదారి పట్టించే ప్రకటనలను నిలిపివేయాలని ఆదేశించింది. లేదంటే భారీ జరిమానా తప్పదని సుప్రీం మంగళవారం ఆదేశించింది. అహసనుద్దీన్ అమనుల్లా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది. తప్పుదారి పట్టించే క్లెయిమ్‌లతో కూడిన అన్ని ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఇలాంటి ఉల్లంఘనను కోర్టు చాలా తీవ్రంగా పరిగణి స్తుందని పేర్కొన్న సుప్రీం ప్రతీ తప్పుడు క్లెయిమ్‌కు గరిష్టంగా రూ. 1 కోటి వరకు జరిమానా తప్పదని హెచ్చరించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పతంజలి పేర్కొన్న అంశాలు వెరిఫై కాలేదని, ఇవి డ్రగ్స్,రెమెడీస్ చట్టం 1954, వినియోగదారుల రక్షణ చట్టం వంటి పలు చట్టాలను ఉల్లంఘించేలా ఉన్నాయని ఐఏఎం పేర్కొంది. తదుపరి విచారణకు కేంద్ర నివేదికతో రావాలి ఇక మీదట పతంజలి ఆయుర్వేదం భవిష్యత్తులో అలాంటి ప్రకటనలను, పత్రికలలోప్రకటనలు చేయకుండా చూసుకోవాలని కోర్టు ఆదేశించింది అంతేకాదు 'అల్లోపతి వర్సెస్ ఆయుర్వేద' అనే చర్చగా మార్చకూడదని, తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనల సమస్యకు నిజమైన పరిష్కారాన్ని కనుగొనాలని బెంచ్ కేంద్రాన్ని కోరింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 కు వాయిదా వేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆచరణాత్మక పరిష్కారాన్ని చూడాలని కూడా భారత అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్‌ను ధర్మాసనం కోరింది. గతేడాది కూడా కోర్టు మందలించింది గతేడాది కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్‌పై నోటీసులు జారీ చేస్తూ.. అల్లోపతి వంటి ఆధునిక వైద్య విధానాలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చినందుకు బాబా రామ్‌దేవ్‌ను కోర్టు మందలించిన సంగతి తెలిసిందే. -
తప్పుదోవ పట్టించే ప్రకటనలు వద్దు
న్యూఢిల్లీ: వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా తమ ప్రకటనలు ఉండకుండా చూసుకోవాలని తయారీ సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రకటనకర్తలు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలకు కేంద్రం సూచించింది. ఇటు వ్యాపార, అటు వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని పేర్కొంది. ముంబైలో నిర్వహించిన అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఈ మేరకు సూచనలు చేశారు. వినియోగదారులకు వెల్లడించాల్సిన కీలక వివరాలను (డిస్క్లోజర్లు) హ్యాష్‌ట్యాగ్‌లు లేదా లింకుల రూపంలో కాకుండా ప్రకటనల్లోనే ప్రముఖంగా కనిపించేలా జాగ్రత్తలు తీసు కోవాలని పేర్కొన్నారు. వీడియోల్లోనైతే డిస్క్లోజర్లను ఆడియో, వీడియో ఫార్మాట్లలో చూపాలని, లైవ్ స్ట్రీమ్‌లలోనైతే ప్రముఖంగా కనిపించేలా, నిరంతరాయంగా చూపాలని సింగ్ చెప్పారు. 50 కోట్ల మంది పైగా సోషల్ మీడియా యూజర్లు ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా ప్రకటనల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తమ విశ్వసనీయతపై ప్రభా వం చూపేలా ప్రకటనకర్తలతో తమకు ఏవైనా లావాదేవీలు ఉంటే ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు వాటిని వెల్లడించాలని సింగ్ తెలిపారు. -
170 కోట్ల యాడ్స్‌పై నిషేధం
న్యూఢిల్లీ : ఆన్లైన్ యూజర్లకు హానిచేస్తున్న తప్పుడు వ్యాపార ప్రకటనలపై గూగుల్ కొరడా ఝళిపించింది. 2016లో 170 కోట్లకు పైగా యాడ్లను బ్యాన్ చేసినట్టు గూగుల్ పేర్కొంది. అక్రమ ఉత్పత్తులతో పిచ్చిపిచ్చి ఆఫర్లు గుప్పిస్తూ యూజర్లను తప్పుదోవ పట్టిస్తున్న, ప్రమోట్ చేస్తున్న యాడ్లపై కొరడా ఝళిపించినట్టు శుక్రవారం గూగుల్ ప్రకటించింది. వార్షిక 'బెటర్ యాడ్స్ రిపోర్ట్' లో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రీ, ఓపెన్ వెబ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారాలకు మంచి సాధనం. కానీ తప్పుడు ప్రకటనలు ఆన్లైన్లో యూజర్లను విసుగిస్తున్నాయి. యూజర్లకు ఇవి హానికరంగా మారుతున్నాయని స్కాట్ స్పెన్సార్ సస్టైనబుల్ యాడ్స్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ తెలిపారు. తప్పుదోవ పట్టించే యాడ్స్, దోపిడి విధానపరమైన ఆఫర్ల నుంచి యూజర్లను రక్షించేందుకు తమ పాలసీలను విస్తరిస్తామని గూగుల్ పేర్కొంది. తప్పుడు ప్రకటనలు త్వరలోనే కనుమరుగవుతాయని చెప్పింది. హైల్త్ కేర్ ఉల్లంఘనల్లో 68 మిలియన్ చెత్త ప్రకటనలను, గాంబ్లింగ్ ఉల్లంఘనల్లో 17 మిలియన్ ప్రకటనలను గూగుల్ బ్యాన్ చేసిందని ఈ రిపోర్టు వివరించింది. బరువు తగ్గింపు స్కాంకు పాల్పడుతున్న ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్న 47వేల సైట్లపై గూగుల్ గతేడాది చర్యలు తీసుకుంది.