న్యూఢిల్లీ: వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణనిచ్చే కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు చేయకూడదని కేంద్రం హెచ్చరించింది. కోచింగ్ కేంద్రాలు చేసే 100 శాతం జాబ్ గ్యారెంటీ, 100 శాతం సెలెక్షన్ వంటి తప్పుడు ప్రకటనలను నియంత్రించేందుకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ విషయంలో కేంద్ర వినియోగదారుల భద్రత సంస్థకు (CCPA) అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా ఇప్పటివరకు సీసీపీఏ 54 నోటీసులు జారీ చేయగా.. రూ. 54.60 లక్షల జరిమానాలు విధించింది.
‘విద్యార్థుల నుంచి కోచింగ్ సెంటర్లు ఉద్దేశపూర్వకంగా కొంత సమాచారాన్ని దాచడం తాము గమనించాం. అందుకే కోచింగ్ సెంటర్ల నిర్వహకుల కోసం కొత్తమార్గదర్శకాలను రూపొందించామని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే పేర్కొన్నారు. కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని అయితే ప్రకటనల నాణ్యత వినియోగదారుల హక్కులను దెబ్బతీయకూడదని ఆమె అన్నారు.
కొత్త మార్గదర్శకాల ప్రకారం..
కోచింగ్ సెంటర్లు అందించే కోర్సులు, వ్యవధికి సంబంధించి తప్పుడు ప్రకటనలు చేయకూడదు. ఉదా: ఫీజు విధానం, వాపస్ పాలసీ, ఎగ్జామ్ ర్యాంకింగ్, జాబ్ గ్యారంటీ, జీతం పెరుగుదల వంటివి
అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత వారి రాతపూర్వక అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్‌లు అభ్యర్థుల పేర్లు, ఫొటోలు ఉపయోగించకూడదు.
కోర్సుల గురించి ముఖ్యమైన సమాచారాన్ని బహిర్గతం చేయాలి.
చాలా మంది యూపీఎస్సీ విద్యార్థులు తమ స్వంతంగా చదవుకొని ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేస్తారు. కోచింగ్ సెంటర్‌ల నుంచి ఇంటర్వ్యూ మార్గదర్శకాలను మాత్రమే తీసుకుంటారు. ఈ విషయంలో విద్యార్ధులకు ముందే స్పష్టత ఇవ్వాలి
- ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులు తమ వద్ద ఏ కోర్సులో శిక్షణ తీసుకున్నారో తెలియజేయాలి.
- చట్టబద్ధంగా అనుమతి తీసుకున్న భవనాల్లో మాత్రమే కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి.
- కోచింగ్ సెంటర్లు తమ అభ్యర్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, భద్రత కల్పించాలి.
- నిబంధనలు ఉల్లంఘించిన వారికి వినియోగదారుల రక్షణ చట్టం కింద జరిమానాలు విధించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment