మిల్లర్ల అక్రమాలకు చెక్ పెట్టే దిశగా త్వరలో అధికారిక ఉత్తర్వులు
డిఫాల్ట్, పెండింగ్ కేసులు ఉన్న మిల్లులకు ధాన్యం బంద్
సాక్షి, హైదరాబాద్, : మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా దారి మళ్లించడం, నాణ్యమైన బియ్యం విక్రయించి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి పౌరసరఫరాల శాఖను మోసం చేయడం వంటి చర్యలకు పాల్పడకుండా మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.
ఈ మేరకు రూపొందించిన మార్గదర్శకాలకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసింది. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. సోమవారం మంత్రి ఉత్తమ్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన సమావేశంలో ఈ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు తెలిసింది.
కెపాసిటీకి అనుగుణంగా కేటాయింపులు
రైస్‌మిల్లులు తమకు కేటాయించిన ధాన్యాన్ని ఏడాదిన్నర వరకు కూడా మిల్లింగ్ పూర్తి చేయకుండా తమ వద్దే నిల్వ ఉంచుకుంటున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. తద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడం, ఎఫ్‌సీఐ రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంలో ఆలస్యం చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో మిల్లులు సీఎంఆర్ కోసం ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో 16 గంటలు పనిచేయాలని మార్గదర్శకాల్లో పొందుపరిచారు. ముడి బియ్యం ఇచ్చే రా రైస్ మిల్లులకు వడ్లు కేటాయిస్తే 8 గంటల చొప్పున రెండు షిఫ్టుల్లో రోజుకు 16 గంటలు మిల్లింగ్ చేసి 75 రోజుల్లో కేటాయించిన ధాన్యంలో 67శాతం రా రైస్ ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లుల కెపాసిటీకి అనుగు ణంగా ధాన్యం కేటాయించనున్నారు.
25 శాతం బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి
మిల్లింగ్ కోసం ధాన్యం తీసుకునే మిల్లర్లు ధాన్యం విలువకు అనుగుణంగా బ్యాంక్ గ్యారంటీ తప్ప నిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అను గుణంగా నిబంధనలు సవరించారు. కేటాయించిన ధాన్యం మిల్లింగ్ కెపాసిటీని బట్టి మిల్లింగ్‌కు వచ్చే 15 రోజుల ముందే 25 శాతం బ్యాంక్ గ్యారంటీని సమర్పించాల్సి ఉంటుంది.
లీజు మిల్లుదారుడైతే కేటాయించిన ధాన్యంలో 50 శాతం బ్యాంక్ గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుంది. లీజు తీసుకున్న మిల్లులో గతంలో ఓనర్ సీఎంఆర్ డెలివరీ పెండింగ్ లేనట్టు డీఎంల నుంచి నోడ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతే మిల్లులకు కేటాయింపులు ఉంటాయి. రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలులో ఉన్న మిల్లర్లకు సైతం ధాన్యం కేటాయింపులు ఉండవని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
డిఫాల్టర్లపై ఉక్కుపాదం
గతంలో అక్రమాలకు పాల్పడినట్టు తేలిన మిల్లర్లకు, ఫేక్ ట్రక్ షీట్లు సృష్టించి కేసుల్లో ఇరుకున్న వారికి, 6 ఏ ఈసీ యాక్ట్, క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్న వారికి ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కేటాయించకూడదని, వీరికి ఈ సీజన్‌తోపాటు వచ్చే రెండు సీజన్‌ల వరకు వడ్లు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు.
డిఫాల్ట్ అయిన మిల్లర్లు బకాయి పడ్డ సీఎంఆర్‌ను అప్పగించి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకుంటేనే కొత్తగా ధాన్యం కేటాయించనున్నారు. మిల్లర్లు లీజు డీడ్ ఇవ్వడంతోపాటు కేటాయించిన ధాన్యానికి బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి కానుంది.
కలెక్టర్ల పర్యవేక్షణ...
జిల్లాల వారీగా రైస్‌మిల్లుల్లో సాగే సీఎంఆర్‌పై కలెక్టర్లకే బాధ్యతలు అప్పగించనున్నా రు. ధాన్యం కొనుగోళ్ల నుంచి మిల్లింగ్ వరకు వారే కీలకం. బాయిల్డ్ రైస్‌మిల్లర్లు ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు డిసెంబర్ 31లోగా ఎఫ్‌ఆర్‌కే బ్లెండింగ్, సోర్టెక్స్ మెషీన్లు ఇన్‌స్టాల్ చేసుకు నేలా ఆయా జిల్లాల కలెక్టర్ చర్యలు తీసు కొని, వారికే ధాన్యం కేటాయించాల్సి ఉంటుంది.
జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి అర్హత ఉన్న మేరకే ధాన్యం కేటాయించాలి. మిల్లు లను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేటాయించిన ధాన్యం దారిమళ్లినా, ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రైవేట్‌గా విక్రయించినా క్రిమినల్ చర్యలు తప్పనిసరి.
Comments
Please login to add a commentAdd a comment