milling
-
Telangana: మిల్లర్లపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైస్ మిల్లర్లపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. పైసా పెట్టుబడి లేకుండా ఏటా కోట్ల రూపాయలు సంపాదిస్తూ కూడా, సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్) చేసేందుకు వెనుకాడుతున్నారంటూ.. మిల్లులపై కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం పెట్టే నిబంధనల మేరకు ప్రతి రైస్ మిల్లు పనిచేయాలని.. లేకుంటే మిల్లు సీజ్ చేయడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేసింది. ప్రతి మిల్లు సామర్థ్యంలో 50 శాతం మేరకు ధాన్యం అప్పగించి, తప్పనిసరిగా మిల్లింగ్ చేసేలా నిబంధన పెట్టింది. బ్యాంకు గ్యారంటీ ఇవ్వలేమంటూ తప్పించుకునే పరిస్థితి లేకుండా చర్యలు చేపట్టింది. కోట్ల రూపాయల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిపడ్డ డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ చట్టం కింద జప్తు చేయాలని నిర్ణయించింది. ఆయా మిల్లుల ఆస్తులను ఇతరుల పేర్లపైకి బదలాయించే అవకాశం లేకుండా ముందు జాగ్రత్తగా రిజి్రస్టేషన్ శాఖను అప్రమత్తం చేసింది. మిల్లర్ల ఇష్టారాజ్యానికి చెక్! రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడి, మిల్లింగ్ సదుపాయాల కొరతను ఆసరాగా చేసుకొని.. మిల్లర్లు కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మిల్లింగ్ కెపాసిటీతో సంబంధం లేకుండా సీఎంఆర్ కోసం ధాన్యం కేటాయింపులు, ఏళ్లకేళ్లు గడిచినా బియ్యాన్ని అప్పగించకపోవడం, మిల్లు ల్లో ధాన్యం లేకపోవడం.. వంటి అవకతవకలతో పౌర సరఫరాల సంస్థ తీవ్ర నష్టాలను చవిచూసింది. దీనితో 2014–15లో రూ.4,747 కోట్లుగా ఉన్న సంస్థ అప్పులు.. 2023–24 నాటికి రూ.58,623 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు, మిల్లర్ల మాయాజాలంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొన్ని మార్గదర్శకాలను రూపొందించి... ఖరీఫ్ సీజన్ నుంచే నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టింది. కచ్చితంగా మిల్లింగ్ చేసేలా.. మిల్లులు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగించకుండా మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకోవడం, ఏళ్లకేళ్లు బకాయిలు అలానే ఉండటం వంటి సమస్యలకు చెక్ పెట్టేలా.. ప్రభుత్వం ధాన్యానికి బ్యాంకు గ్యారంటీ నిబంధన తెచ్చింది. ఈ నిబంధన వల్ల కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) చేయలేమంటూ మొండికేస్తున్న మిల్లర్లను దారికి తెచ్చేలా చర్యలు చేపట్టింది. ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్‌కు సంబంధించి... 2015, 2016లలో విడుదలైన 18, 36 జీవోలు, వాటికి సవరణ చేస్తూ 2023 అక్టోబర్‌లో జారీ చేసిన జీవో నంబర్ 25ను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలోని ప్రతి రైస్ మిల్లు దాని కెపాసిటీలో కనీసం 50శాతం మేర ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని సీఎంఆర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మిల్లు లైసెన్స్ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దీనితో కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని దించుకోమని మిల్లర్లు మొండికేసే పరిస్థితి తప్పనుంది. 2,054 మిల్లులు ‘గ్యారంటీ’కి రెడీ రాష్ట్రంలోని సుమారు 3,500 మిల్లులకుగాను.. 2,054 రైస్‌మిల్లులు బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చి ధాన్యాన్ని తీసుకునేందుకు అంగీకరించాయి. ఇందులో 1,274 రా రైస్ (ముడి బియ్యం) మిల్లులు కాగా.. 780 బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) మిల్లులు. ఇప్పటివరకు 1,669 మిల్లులు (992 రా రైస్, 677 బాయిల్డ్ మిల్స్) బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని అండర్ టేకింగ్ ఇచ్చాయి. అండర్ టేకింగ్ ఇచ్చిన మిల్లుల సామర్థ్యం 57.76 లక్షల మెట్రిక్ టన్నులు. డీఫాల్టర్ల విషయంలో ప్రత్యేక చర్యలు మూడు విడతల కన్నా ఎక్కువగా సీఎంఆర్ ఇవ్వకుండా ఎగవేసిన మిల్లర్లను డీఫాల్టర్లుగా గుర్తించి ధాన్యం కేటాయించకూడదని, లేదా షరతులతో కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 1,777 డీఫాల్టర్లను గుర్తించగా.. అందులో 362 మంది మిల్లర్లు కొన్నేళ్లుగా వరుసగా సీఎంఆర్ ఎగవేస్తూ వస్తున్నారు. వారికి ఈ ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయించడం లేదు. మిగతావారు మొత్తం బకాయి మొత్తం బియ్యాన్ని, అపరాధ రుసుముతో సహా అప్పగించి... దీనితోపాటు కొత్తగా ఇచ్చే ధాన్యానికి సంబంధించి 25 శాతం బ్యాంకు గ్యారంటీ ఇస్తే ధాన్యం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి ఎగవేతదారులుగా గుర్తించిన 362 మంది మిల్లర్లలో.. కేవలం 10 మంది మిల్లర్లే ఏకంగా రూ.605 కోట్ల విలువైన 1.67 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. వీరిలో ఆరుగురు సూర్యాపేట జిల్లావారుకాగా, ఇద్దరు కరీంనగర్ వారు నాగర్‌కర్నూల్, నిజామాబాద్‌ల నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ రికవరీ యాక్టు ద్వారా వారి ఆస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరిస్తున్నారు. వారు ఆస్తులు అమ్ముకోకుండా, వేరేవారి పేరిట బదిలీ చేయకుండా రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. బ్యాంక్ గ్యారంటీ తీసుకునే ధాన్యం కేటాయింపులురైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేసి... కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు మూడు నుంచి ఆరు నెలల్లోగా ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి... వచ్చిన బియ్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ఇలా ధాన్యం తీసుకున్న చాలా మిల్లులు ఏడాదిన్నర, రెండేళ్లయినా బియ్యం తిరిగివ్వని పరిస్థితి. 2022–23 రబీ సీజన్లో మిల్లులకు కేటాయించిన 65 లక్షల టన్నుల ధాన్యంలో... సుమారు 30 లక్షల టన్నులను మిల్లింగ్ చేసి, బియ్యాన్ని మార్కెట్లో అమ్మేసుకున్నారు. అందులో 25 లక్షల టన్నుల మేర రికవరీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు పిలిచినా ఫలితం లేకుండా పోయింది. ఆ బకాయిల విలువ రూ.7 వేల కోట్లుగా లెక్కగట్టగా.. ఇప్పటివరకు రూ.3 వేల కోట్ల వరకు మాత్రమే రికవరీ అయ్యాయి. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం కేటాయించే ధాన్యానికి సంబంధించి మిల్లర్ల నుంచి కొంత మేర బ్యాంకు గ్యారంటీలు తీసుకుంటోంది. మిల్లులకు వాటికి సామర్థ్యానికి తగిన మేరకే ధాన్యాన్ని కేటాయిస్తోంది. -
ఖరీఫ్ నుంచే కొత్త నిబంధనలు
సాక్షి, హైదరాబాద్, : మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా దారి మళ్లించడం, నాణ్యమైన బియ్యం విక్రయించి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి పౌరసరఫరాల శాఖను మోసం చేయడం వంటి చర్యలకు పాల్పడకుండా మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.ఈ మేరకు రూపొందించిన మార్గదర్శకాలకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసింది. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. సోమవారం మంత్రి ఉత్తమ్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన సమావేశంలో ఈ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు తెలిసింది. కెపాసిటీకి అనుగుణంగా కేటాయింపులు రైస్‌మిల్లులు తమకు కేటాయించిన ధాన్యాన్ని ఏడాదిన్నర వరకు కూడా మిల్లింగ్ పూర్తి చేయకుండా తమ వద్దే నిల్వ ఉంచుకుంటున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. తద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడం, ఎఫ్‌సీఐ రీయింబర్స్మెంట్ ఇవ్వడంలో ఆలస్యం చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మిల్లులు సీఎంఆర్ కోసం ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో 16 గంటలు పనిచేయాలని మార్గదర్శకాల్లో పొందుపరిచారు. ముడి బియ్యం ఇచ్చే రా రైస్ మిల్లులకు వడ్లు కేటాయిస్తే 8 గంటల చొప్పున రెండు షిఫ్టుల్లో రోజుకు 16 గంటలు మిల్లింగ్ చేసి 75 రోజుల్లో కేటాయించిన ధాన్యంలో 67శాతం రా రైస్ ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లుల కెపాసిటీకి అనుగు ణంగా ధాన్యం కేటాయించనున్నారు. 25 శాతం బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరిమిల్లింగ్ కోసం ధాన్యం తీసుకునే మిల్లర్లు ధాన్యం విలువకు అనుగుణంగా బ్యాంక్ గ్యారంటీ తప్ప నిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అను గుణంగా నిబంధనలు సవరించారు. కేటాయించిన ధాన్యం మిల్లింగ్ కెపాసిటీని బట్టి మిల్లింగ్‌కు వచ్చే 15 రోజుల ముందే 25 శాతం బ్యాంక్ గ్యారంటీని సమర్పించాల్సి ఉంటుంది. లీజు మిల్లుదారుడైతే కేటాయించిన ధాన్యంలో 50 శాతం బ్యాంక్ గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుంది. లీజు తీసుకున్న మిల్లులో గతంలో ఓనర్ సీఎంఆర్ డెలివరీ పెండింగ్ లేనట్టు డీఎంల నుంచి నోడ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతే మిల్లులకు కేటాయింపులు ఉంటాయి. రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలులో ఉన్న మిల్లర్లకు సైతం ధాన్యం కేటాయింపులు ఉండవని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.డిఫాల్టర్లపై ఉక్కుపాదంగతంలో అక్రమాలకు పాల్పడినట్టు తేలిన మిల్లర్లకు, ఫేక్ ట్రక్ షీట్లు సృష్టించి కేసుల్లో ఇరుకున్న వారికి, 6 ఏ ఈసీ యాక్ట్, క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్న వారికి ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కేటాయించకూడదని, వీరికి ఈ సీజన్‌తోపాటు వచ్చే రెండు సీజన్ల వరకు వడ్లు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. డిఫాల్ట్ అయిన మిల్లర్లు బకాయి పడ్డ సీఎంఆర్‌ను అప్పగించి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకుంటేనే కొత్తగా ధాన్యం కేటాయించనున్నారు. మిల్లర్లు లీజు డీడ్ ఇవ్వడంతోపాటు కేటాయించిన ధాన్యానికి బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి కానుంది. కలెక్టర్ల పర్యవేక్షణ...జిల్లాల వారీగా రైస్‌మిల్లుల్లో సాగే సీఎంఆర్‌పై కలెక్టర్లకే బాధ్యతలు అప్పగించనున్నా రు. ధాన్యం కొనుగోళ్ల నుంచి మిల్లింగ్ వరకు వారే కీలకం. బాయిల్డ్ రైస్‌మిల్లర్లు ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు డిసెంబర్ 31లోగా ఎఫ్ఆర్కే బ్లెండింగ్, సోర్టెక్స్ మెషీన్లు ఇన్స్టాల్ చేసుకు నేలా ఆయా జిల్లాల కలెక్టర్ చర్యలు తీసు కొని, వారికే ధాన్యం కేటాయించాల్సి ఉంటుంది. జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి అర్హత ఉన్న మేరకే ధాన్యం కేటాయించాలి. మిల్లు లను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేటాయించిన ధాన్యం దారిమళ్లినా, ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రైవేట్‌గా విక్రయించినా క్రిమినల్ చర్యలు తప్పనిసరి. -
అదనపు ధాన్యమంతా ఎగుమతులకే
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన ధాన్యాన్ని, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని సేకరించకుండా ఎఫ్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటీ పది లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం, నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల్లో ఉందని, ఎఫ్‌సీఐ చర్యలతో ఆహారధాన్యాలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని అధికారులు సీఎం దృష్టికి తేవడంతో కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. రానున్న రోజుల్లో అదనంగా వరి దిగుబడి కానున్న పరిస్థితుల్లో రైతు పండించిన వరి పంటను పలు రకాల ఆహార ఉత్పత్తులుగా మలిచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తద్వారా రైతులకు మరింత లాభం చేకూరేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి, సీఎంఆర్ అప్పగింత, బియ్యం తిరస్కరణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కొత్త మిల్లుల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ శుక్రవారం పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. అదనంగా పండే పంట కోసమే కొత్త మిల్లులు... ‘‘రైతుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వరి ధాన్యం ఉత్పత్తులు ఎగుమతయ్యేలా చూడాలి. అప్పడు తెలంగాణ వరికి గిరాకీ పెరిగి రైతులు లాభాలు గడిస్తారు. అదనంగా పండే పంటను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నూతనంగా అధునాతన మిల్లులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి విధివిధానాలు ఖరారు చేసి కార్యాచరణ ప్రారంభించనున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సటాకె వంటి కంపెనీలతో చర్చించాం. వారితో రేపట్నుంచే ఉన్నతస్థాయి కమిటీ చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశించాం’’అని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి, మల్కపేట, బస్వాపూర్ తదితర ప్రాజెక్టులతోపాటు మరికొద్ది రోజుల్లో పూర్తికానున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల వరిధాన్యం దిగుబడి ప్రస్తుతమున్న ఏటా 3 కోట్ల టన్నుల నుంచి 4 కోట్ల టన్నులకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ దామోదర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు వీరే... రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రైస్ మిల్లుల సామర్థ్యం కోటి టన్నుల వరకు ఉండగా మరో 2 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేసే దిశగా కొత్త మిల్లులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధివిధానాల ఖరారు కోసం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సారథ్యంలో కమిటీని ప్రకటించారు. ఇందులో సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, టీఎస్ఐడీసీ ఎండీ నర్సింహారెడ్డి సభ్యులుగా ఉండనున్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మేద్దాం! రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో ఉన్న ధాన్యంలో 40 లక్షల మెట్రిక్ టన్నులను గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మిల్లర్లు సకాలంలో ధాన్యం మిల్లింగ్ చేయకపోవడంతో మిలు్లల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. నిర్దేశత సమయంలో సీఎంఆర్ ఇవ్వకపోవడంతో ఎఫ్‌సీఐ కొర్రీలు పెడుతోంది. దాదాపు 1.10 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం, 4 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల్లో నిల్వల నేపథ్యంలో ధాన్యం విక్రయానికి సీఎం ఆదేశించినట్లు తెలిసింది. -
పెట్టుబడిదారులకు మిల్లింగ్‌లో విస్తృత అవకాశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడికి అనుగుణంగా మిల్లింగ్ పరిశ్రమలో విస్తృత అవకాశాలున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఇందులోభాగంగానే ప్రభుత్వమే సొంతంగా రైస్ మిల్లులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. మంత్రి బుధవారం పౌరసరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్, ఎస్‌పీపీజెడ్ అధికారులు, జపాన్ సటాకె కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏటా మూడు కోట్ల టన్నులకు పైగా ఉత్పత్తవుతున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికి రాష్ట్రంలో చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అందుకే రూ.రెండువేల కోట్లతో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మిల్లులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మిల్లింగ్ పరిశ్రమలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ధాన్యం మిల్లింగ్‌తోపాటు ఉప ఉత్పత్తులైన రైస్ బ్రాన్ ఆయిల్, నూక తదితరాలు ప్రాసెసింగ్ చేసేందుకు ప్రత్యేక జోన్లను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం సటాకే, సైలో తదితర ప్రపంచస్థాయి కంపెనీల ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సటాకె కార్పొరేషన్, ఇతర కంపెనీల ప్రతినిధులు తమ కంపెనీల సాంకేతికతను మంత్రికి వివరించారు, గంటకు 20 నుంచి 1,200 టన్నుల మిల్లింగ్ కెపాసిటీ తమ సొంతమని వారు చెప్పారు. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను ముఖ్యమంత్రికి సమర్పి స్తామని గంగుల తెలిపారు. ప్రభుత్వం మిల్లులను ఏర్పాటు చేయడంతోపాటు స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ప్రత్యేకంగా రూ.100కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినవారికి ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. కాగా, పౌరసరఫరాల శాఖలో ప్రజలకు సేవల్ని మరింత కచ్చితంగా, పారదర్శకంగా అందించేందుకు టెక్నాలజీ సంబంధిత అంశాలపై గంగుల ప్రత్యేకంగా సమీక్షించారు, రైతుల వద్ద ధాన్యం కొనుగోలు మొదలు బియ్యం పంపిణీ వరకు వివిధ దశల్లో వృధా లేకుండా సాంకేతికతను అప్‌గ్రెడేషన్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, నెట్వర్కింగ్, శాటిలైట్ టెక్నాలజీలో పనిచేస్తున్న మలోల ఇన్నోవేషన్స్, సీఎస్ఎం, ఐబీఐ, ప్లానెట్ ఎం తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. -
27 మిల్లులు రూ.2వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిల్లింగ్ సమస్యను పరిష్కరించేందుకు సర్కారీ రైస్ మిల్లుల నిర్మాణం ఈ సంవత్సరంలోనే ప్రారంభం కానుంది. సోమవారం సీఎం కేసీఆర్ పౌరసరఫరాల శాఖకు సంబంధించి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చే ఏడాదికల్లా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారానే జిల్లాకో మిల్లును ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల్లో ప్రతి జిల్లాకూ ఒకటి చొప్పున 27 మిల్లును ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం సుమా రు రూ. 2వేల కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. గంటకు 60 నుంచి 120 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మరాడించే కెపాసిటీతో ఈ మిల్లులను ఏర్పాటు కానున్నాయి. ప్రైవేటు మిల్లులపై భారాన్ని తగ్గించడంతో పాటు మిల్లర్లపై బాధ్యతను పెంచేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పెరిగిన ధాన్యం దిగుబడికి అనుగుణంగా... రాష్ట్రంలో ధాన్యం దిగుబడి అనూహ్యంగా పెరిగింది. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి 3 కోట్ల టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో మిల్లింగ్ ప్రధాన సమస్యగా మారింది. రైతుల నుంచి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి, బియ్యం(సీఎంఆర్)గా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించాలి. ఎఫ్‌సీఐ సెంట్రల్ పూల్ కింద బియ్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తుంది. ఈ క్రమంలో ఎక్కడ ఆలస్యమైనా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావలసిన డబ్బులు ఆగిపోతాయి. గత మూడేళ్లుగా ప్రతి ఏటా సకాలంలో మిల్లింగ్ ప్రక్రియ పూర్తికాక కేంద్రం నుంచి సహకారం అందక రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. గత యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇప్పటికి కూడా మిల్లర్లు మర పట్టించి ఇవ్వలేని పరిస్థితి. రాష్ట్రంలో 1,773 మిల్లులు... రాష్ట్రంలో ప్రస్తుతం 1,773 మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్ జరుగుతోంది. ఇందులో రా మిల్లులు 859 కాగా, బాయిల్డ్ మిల్లులు 914. ఒక్కో మిల్లులో ప్రస్తుతం గంటకు 8 నుంచి 10 మెట్రిక్ టన్నుల ధాన్యం చొప్పున ప్రతి రోజు రెండు షిఫ్టుల్లో 100 నుంచి 150 మెట్రిక్ టన్నుల వరకు మిల్లింగ్ కెపాసిటీ మాత్రమే ఉంది. అంటే రాష్ట్రంలోని అన్ని మిల్లుల్లో పూర్తిస్థాయిలో మిల్లింగ్ జరిగితే రోజుకు లక్ష నుంచి 2 లక్షల టన్నులకు పైగా ధాన్యం మిల్లింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే మిల్లర్లు తమ ప్రైవేటు దందాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో సర్కారుకు ఇచ్చే సీఎంఆర్ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గంటకు 60 నుంచి 120 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరాడించే భారీ మిల్లులను పౌరసరఫరాల సంస్థ ద్వారా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం గమనార్హం. మిల్లులతో పాటు బియ్యం ఆధారిత పరిశ్రమలను కూడా అక్కడే ఉండేలా ప్రణాళికలు తయారు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సీఎం ఆదేశించారు. సీఎం సూచన మేరకు నిర్మాణాలు: మంత్రి గంగుల సీఎం సూచన మేరకు ప్రభుత్వమే పౌరసరఫరాల సంస్థ ద్వారా రైస్ మిల్లులను నిర్మించాలని నిర్ణయించింది. గంటకు 60 నుంచి 120 టన్నుల కెపాసిటీ గల మిల్లులను తీసుకొస్తాం. వచ్చే ఏడాది కల్లా నిర్మాణాలు పూర్తి చేయాలనేది ఆలోచన. మిల్లులతో పాటు బియ్యం ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను కూడా కార్పొరేషన్ ద్వారా నిర్వహించే ఆలోచనలో ఉన్నాం. -
లక్ష టన్నుల బియ్యం స్వాహా.. బయటపడ్డ భారీ అక్రమాలు!
ఆయన వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రానికి చెందిన ఓ రైస్ మిల్లర్.. మరికొందరు మిల్లర్లను జతచేసుకుని ఎఫ్‌సీఐతో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఒప్పందాలు చేసుకుంటున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా సీఎంఆర్ కింద రీసైక్లింగ్ చేస్తు న్నారు. ఆయనకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే బియ్యం డాన్‌గా పేరున్నట్టు ప్రచా రంలో ఉంది. ఆయనకు చెం దిన వాహనాలు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తర లిస్తూ.. గతేడాది జూన్ 26 నుంచి నెల రోజుల వ్యవధిలోనే మూడు సార్లు పట్టుబడ్డాయి. అధికారిక దాడుల్లో 1,013 క్వింటాళ్ల బియ్యం దొరికింది. 2018లో అప్పటి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పానగల్‌లోని సంబంధిత మిల్లులో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. లెక్కలకు మించిన ధాన్యం ఉన్నట్టు గుర్తించి సీఎంఆర్ ఒప్పందాలను రద్దు చేశారు. భవిష్యత్తులోనూ అనుమతులు ఇవ్వొద్దని ఆదేశించారు. కానీ సదరు ‘బియ్యం డాన్’.. తన కుమారుడి పేరుమీద జిల్లా కేంద్రంలో, కొత్తకోట మండలంలో కొన్ని రైస్ మిల్లులను లీజ్‌కు తీసుకుని సీఎంఆర్ ఒప్పం దాలు చేసుకున్నారు. ఎప్పట్లాగే తన సొంత గ్రామంలో నిర్మాణం లోని మిల్లు వద్ద, పానగల్లో సీజ్ చేసిన మిల్లు వద్ద రేషన్ బియ్యాన్ని పెద్ద మొత్తంలో రీసైకిల్ చేస్తూ పట్టుబడ్డారు. అయినా అధికారులు 6ఏ కేసులు మాత్రమే నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. ఇంత జరిగినా కొందరు అ«ధికారుల సహకారంతో బినామీ పేర్లతో సీఎంఆర్ ఒప్పందాలు చేసుకుని దందా కొనసాగిస్తున్నారు. హైదరాబాద్: రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ బియ్యం విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాలంటూ ప్రభుత్వం మిల్లర్లకు అప్పగిస్తే.. మిల్లర్లు బియ్యం తిరిగివ్వకుండా, బయట అమ్ముకుని వ్యాపారం చేసుకుంటున్నారు. 2019–20 ఏడాది యాసంగికి సంబంధించి రూ.400 కోట్ల విలువైన 1.25 లక్షల టన్నుల బియ్యాన్ని ఇప్పటికీ తిరిగి అప్పగించకుండా దందా చేస్తున్నారు. గట్టిగా ఒత్తిడి తెస్తే.. పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమ మార్గాల్లో సేకరించి, దాన్నే రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి అంటగడుతున్నారు. ఇంత జరుగుతున్నా.. మిల్లర్లను బ్లాక్‌లిస్టులో పెట్టడంగానీ, రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించి వసూలు చేయడంగానీ చేయడం లేదు. కొందరు అధికారులు, మిల్లర్ల అసోసియేషన్ నేతల అండతోనే ఈ వ్యవహారం సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. గడువు పొడిగించినా చలనమేదీ? సర్కారు రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపి, బియ్యంగా మార్పించి తిరిగి తీసుకుంటుంది. దీనిని కస్టమ్ మిల్లింగ్ అంటారు. మిల్లర్లు ఒక్కో క్వింటాల్ ధాన్యానికి.. ముడి బియ్యం అయితే 67 కిలోలు, బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లింగ్ చేసినం దుకు ప్రభుత్వం క్వింటాల్‌కు ఇంత అని చార్జీలు చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం పంపిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంతో రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కోసారి ధాన్యం తీసుకుని ఏడాది దాటుతున్నా బియ్యాన్ని తిరిగి పంపడం లేదు. ► 2019–20 యాసంగి సీజన్లో ప్రభుత్వం రైతుల నుంచి కొన్న 64.17 లక్షల టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం రైస్ మిల్లర్లకు పంపింది. ఈ మేరకు మిల్లర్లు 43.59 లక్షల టన్నుల బియ్యాన్ని అప్పగించాలి. కానీ 42.34 లక్షల టన్నులే తిరిగి చ్చారు. ఇంకా 1.25 లక్షల టన్నులు రాలేదు. ప్రధానంగా పెద్దపల్లిలో 28,168 టన్నులు, వరంగల్ ఆర్బన్ 19,122, వరంగల్ రూరల్ 12,165, సూర్యాపేట 16,679, మంచిర్యాల 3,386, నిర్మల్ 3,534, నిజామాబాద్ 2,549, మెదక్ 6,853, కరీంనగర్ 4,479, జగిత్యాల 8,184, మహబూబాబాద్ 4,655, జనగాం 2,975, ములుగు 5,969, యాదాద్రి 7,884, వనపర్తి 4,510 గద్వాల జిల్లా నుంచి 2,492 టన్నులు సీఎంఆర్ బియ్యం రావాల్సి ఉంది. ►నిజానికి ఈ బియ్యాన్ని గత ఏడాది అక్టోబర్ నాటికే అప్పగించాల్సి ఉన్నా మిల్లర్ల నుంచి స్పందన లేదు. ఈ విషయంగా గత ఏడాది నవంబర్లోనే సమీక్షించిన సీఎస్ సోమేశ్ కుమార్.. డిసెంబర్ నాటికే సీఎంఆర్ ఇవ్వాలని ఆదేశించారు. అయినా ఫలితం రాలేదు. ఇలా నాలుగు మార్లు గడువు పొడిగించినా 1.25 లక్షల టన్నుల బియ్యం పెండింగ్‌లోనే ఉంది. ఆ బియ్యం విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోనే సీఎంఆర్ ఇవ్వని మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేటు బిజినెస్.. పీడీఎస్‌కు పాలిష్.. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 45 రోజుల్లోగా బియ్యాన్ని తిరిగి అప్పగించాలి. కానీ రాష్ట్రంలో ఎన్నడూ ఈ గడువులోగా బియ్యం ఇచ్చిన దాఖలాలు లేవు. కనీసం పెంచిన గడువు వరకూ కూడా అంద జేయడం లేదు. దీనికి కారణం సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యంతో మిల్లర్లు ప్రైవేటు వ్యాపారం చేయడమే. కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ధాన్యం సాగు ఎక్కువగా లేకపోవడం, రెండేళ్లుగా దిగుబడి తగ్గడంతో వారంతా తెలంగాణపైనే ఆధారపడ్డారు. మరోవైపు మలేసియా, ఇండోనేషియా, నైజీరియా, శ్రీలంక దేశాలకు మన రాష్ట్రం నుంచే బియ్యం ఎగుమతి అవుతోంది. ఇలా డిమాండ్ ఉండటంతో.. మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యాన్ని బయట మార్కెట్లలో అమ్మేసుకుంటున్నారు. ప్రధానంగా బీపీటీ, హెచ్ఎంటీ, జైశ్రీరామ్, తెలంగాణ సోనా రకాలను ఎక్కువగా సాగు చేసే చోట ఈ దందా నడుస్తోంది. బియ్యం అప్పగించాలని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన సందర్భాల్లో.. మిల్లర్లు పీడీఎస్ బియ్యాన్నే సేకరించి సీఎంఆర్ కింద అప్పగిస్తున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్, నిర్మల్, మహబూబాబాద్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో దళారుల ద్వారా రేషన్ బియ్యాన్ని రూ.8 నుంచి రూ.10 చొప్పున కొంటున్నారు. ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. గత ఏడాది విజిలె¯న్స్ దాడుల్లో చాలా చోట్ల ఈ అక్రమాలను గుర్తించారు. వనపర్తి జిల్లాలో రాజకీయ ఆశీస్సులున్న ఓ రైస్ మిల్లర్‌కు చెందిన మిల్లులో ఏటా రేషన్ బియ్యం పట్టుబడుతోంది. ఇటీవలే అదే రైస్‌మిల్లులో ఏకంగా 500 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. సదరు మిల్లర్ ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మరీ.. వనపర్తితోపాటు పక్క జిల్లాల నుంచీ రేషన్ బియ్యం సేకరిస్తున్నట్టు గుర్తించారు. అయినా సదరు రైస్‌మిల్లుకు మళ్లీ సీఎంఆర్ కింద ధాన్యం కేటాయించడం గమనార్హం. ఇలాంటి మిల్లులు రాష్ట్రంలో 70 నుంచి 80 వరకు ఉన్నట్టు అంచనా. బ్లాక్ లిస్టులో పెట్టినా.. నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని వరలక్ష్మి రైస్ మిల్లు గడువులోగా సీఎంఆర్ బియ్యం ఇవ్వలేదన్న కారణంగా పౌర సరఫరాల శాఖ దాన్ని బ్లాక్ లిస్టులో పెట్టింది. అయితే నల్లగొండకు చెందిన ఓ వ్యాపారి.. రాజకీయ పలుకుబడితో, పౌర సరఫరాల అధికారుల సాయంతో మిల్లు ఓనర్‌పై ఒత్తిడి తెచ్చి, దానిని కొనేశారు. సదరు మిల్లు ద్వారా అప్పగించాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని ఆయనే ప్రభుత్వానికి అప్పగించారు. ఏదైనా మిల్లును బ్లాక్ లిస్టులో పెడితే.. తర్వాతి సీజన్లోనే, యాజమాన్యం మారితేనే సీఎంఆర్ ఇవ్వాలి. కానీ అధికారుల తోడ్పాటుతో.. బ్లాక్ లిస్టులో పెట్టిన సీజన్లోనే వరలక్ష్మి మిల్లు ద్వారా సీఎంఆర్ బియ్యం అప్పగించినట్టు లెక్కల్లో చూపారు. అంటే సీఎంఆర్ విషయంలో మిల్లర్లు, అధికారులు ఎలా కలిసిపోయారో అర్థం చేసుకోవచ్చు. అసోసియేషన్ నాయకుడి అండతోనే.. జగిత్యాల జిల్లాలో గతనెలలో దాదాపు 10 మిల్లులు సీఎంఆర్ ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్టు ఎఫ్‌సీఐ తనిఖీల్లో తేలింది. అయినా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మిల్లర్ల అసోసియేషన్ నాయకుడొకరు అధికార యంత్రాంగాన్ని శాసిస్తున్నాడని, మిల్లులపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారని బహిరంగంగానే చర్చ జరుగుతున్నా అడిగే నాథుడు లేడు. సీఎంఆర్‌కు సంబంధించి ఇటీవల ఎఫ్‌సీఐ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్నారు. దీంతో మిల్లర్లు ఏకంగా ఎఫ్‌సీఐ అధికారులు వేధిస్తున్నారంటూ రివర్సులో ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. నాణ్యత లేని బియ్యాన్ని ఎఫ్‌సీఐకి తరలించినా ఎవరూ అడ్డుచెప్పకుండా, మిల్లర్ల వద్దకు అధికారులెవరూ రాకుండా ముందు జాగ్రత్తగా మిల్లర్లు ఇలా మైండ్‌గేమ్ ఆడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నో రికవరీ.. నో బ్లాక్‌లిస్ట్.. సీఎంఆర్ బియ్యం తిరిగివ్వడంలో జాప్యం చేస్తున్న మిల్లర్లపై చర్యలే లేకుండా పోయాయి. 2014 నుంచి 2016 వరకు 137 మంది మిల్లర్ల నుంచి 1.20 లక్షల టన్నుల బియ్యం రావాల్సి ఉన్నా.. ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఆ బియ్యం విలువ సుమారు రూ.165 కోట్లు. అయితే అప్పటి పౌర సరఫరాల శాఖ కమిషనర్లు సీవీ ఆనంద్, అకున్ సబర్వాల్ గట్టిగా ఒత్తిడి తెచ్చి.. 30 మంది మిల్లర్ల నుంచి రూ.80 కోట్ల విలువైన బియ్యాన్ని రికవరీ చేశారు. ఇంకా రూ.85 కోట్ల బియ్యాన్ని రికవరీ చేయాల్సి ఉన్నా పట్టించుకున్నవారు లేరు. కేవలం 80 రైస్ మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టి వదిలేశారు. 2016 తర్వాత సీఎంఆర్ బియ్యం తిరిగివ్వడంతో ఎంత జాప్యం చేస్తున్నా సదరు మిల్లర్ల నుంచి రెవెన్యూ రికవరీ గానీ, బ్లాక్‌లిస్టులో పెట్టడం గానీ జరగడం లేదు. మిల్లర్లు ఎప్పుడిస్తే అప్పుడే అన్నట్టు వ్యవహారం నడుస్తోంది. 2019–20కి సంబంధించి 1.25 లక్షల టన్నుల బియ్యం ఇవ్వని 70 వరకు మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టే అవకాశమున్నా.. పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టడం లేదు. ఎఫ్‌సీఐ వద్దు..రాష్ట్రమే ముద్దు మిల్లర్లు సీఎంఆర్ ధాన్యాన్ని మర పట్టించాక.. బియ్యాన్ని ఎఫ్‌సీఐకి డెలివరీ చేస్తారు. ఆ బియ్యానికి సంబంధించిన డబ్బును ఎఫ్‌సీఐ రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు జమచేస్తుంది. తర్వాత ఎఫ్‌సీఐ రాష్ట్రంలో రేషన్ పంపిణీకోసం అవసరమైన బియ్యాన్ని సబ్సిడీ ధరపై పౌర సరఫరాల సంస్థకు ఇస్తుంది. అంటే ప్రభుత్వం కొన్న ధాన్యానికి సంబంధించిన బియ్యం ఎఫ్‌సీఐకి వెళ్లి.. తిరిగి సబ్సిడీ ధరతో పౌరసరఫరాల సంస్థకు వస్తుంది. అయితే ఎఫ్‌సీఐ సీఎంఆర్ బియ్యం నాణ్యత విషయంలో నిబంధనలను ఇటీవల కఠినంగా అమలు చేస్తోంది. నూకలు, రంగు మారడం వంటివి నిర్ణీత మొత్తానికి ఏమాత్రం ఎక్కువ ఉన్నా.. ఆ బియ్యాన్ని తీసుకోవడం లేదు. నూకలు 25 శాతానికి మించొద్దన్న నిబంధనను ఎఫ్‌సీఐ పక్కాగా అమలు చేస్తుంది. అదే పౌరసరఫరాల సంస్థకు ఇచ్చే బియ్యంలో నూకలు 40– 50 శాతం ఉంటున్నా.. రాళ్లు, మట్టిగడ్డలు, రంగు మారడం వంటివి ఉన్నా అధికారులు పట్టించుకోరు. ఎఫ్‌సీఐకి నాణ్యమైన బియ్యం ఇవ్వడంకంటే.. పౌర సరఫరాల శాఖకు నాణ్యత లేనివి అంటగడితే మిల్లర్లకు రూ.కోట్లలో కలిసొస్తుంది. ►నిజానికి రాష్ట్రంలో రేషన్, మధ్యాహ్న భోజనం అవసరాలకు ఏటా 20 లక్షల టన్నుల బియ్యం అవసరం. కానీ మిల్లర్ల ఒత్తిళ్లకు తలొగ్గి పౌర సరఫరాల సంస్థ అంతకుమించి సేకరిస్తోంది. 2018–19లో ఇలా అదనంగా ఏడెనిమిది లక్షల టన్నులు తీసుకున్నది. అవసరం లేకున్నా తీసుకున్న ఆ బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేయడం, బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపుల్లో జాప్యంతో సర్కారుకు రూ.75 కోట్ల అదనపు భారం పడింది. ►ఇప్పుడు కూడా సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోదాములకు కాకుండా..నేరుగా పౌర సరఫరాల సంస్థ గోదాములకు పంపి, లెక్కల్లో సర్దుబాటు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు పౌర సరఫరాల సంస్థ నుంచే లేఖ రాయించేందుకు మిల్లర్లు ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. -
కొత్తగా ట్రై చేయండి
∙మర గానుగ వంట నూనెలతో ఆరోగ్య ప్రయోజనాలు ∙ఇప్పుడు అందుబాటులో ఇంట్లోనే నూనె తీసుకునే చిన్న యంత్రాలు ∙ఎవరి వంట నూనె బాధ్యత వారే తీసుకోవడం వల్ల నమ్మకం ∙‘సాక్షి’తో జాతీయ ప్రకృతి వైద్య సంస్థ(పుణే) సంచాలకులు డాక్టర్ సత్యలక్ష్మి విత్తనాలు, పండ్ల నుంచి అతిగా వేడి పుట్టని రీతిలో గానుగల ద్వారా పోషకాలతో కూడిన ఆరోగ్యదాయకమైన వంట నూనెలను తయారు చేసుకొని వాడుకోవడం పూర్వకాలం నుంచి మనకు ఉన్న సంప్రదాయం. అయితే, ఆధునిక కాలంలో డబుల్ రిఫైన్డ్ వంట నూనెలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన దరిమిలా గానుగ ఆడించడం ద్వారా తీసిన నూనెల వాడకం దాదాపుగా కనుమరుగైంది. డబుల్ రిఫైన్డ్ పేరిట చలామణిలో ఉన్న వంట నూనెల వల్ల కొలెస్ట్రాల్, బీపీ లేకపోయినా శరీరం లోపల జనరలైజ్డ్ ఇన్ఫ్లమేషన్ వల్ల గుండె జబ్బులు వస్తున్నాయని తెలిసిందని పుణేలోని జాతీయ ప్రకృతి వైద్య సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి) సంచాలకులు డాక్టర్ సత్యలక్ష్మి అంటున్నారు. భారీ గానుగలు అవసరం లేదని, ఇంట్లో పెట్టుకొని అవసరమైనప్పుడు నూనె తీసుకునే చిన్నపాటి విద్యుత్ గానుగ యంత్రాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయని ఆమె తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జాతీయ సహజ ఆహారోత్సవం సందర్భంగా డా. సత్యలక్ష్మి ‘సాక్షి’తో ముచ్చటించారు... ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. మనం నూనెలను వాడే ముందర ఒక విషయాన్ని తార్కికంగా ఆలోచిద్దాం. ఉదాహరణకు మీ ఇంట్లో సాధారణంగా వేరుశెనగ నూనెను ఉపయోగిస్తున్నారని అనుకుందాం. రెండున్నర కిలోల వేరుశనగ గింజలు ఉపయోగిస్తే తప్ప ఒక లీటరు నూనె రాదు. కిలో నూనె గింజల ఖరీదు నూరు రూపాయలు. కానీ, మార్కెట్లో లీటరు వేరుశనగ నూనెను రూ.120 అంతకన్నా తక్కువకు కూడా అమ్ముతున్నారు. డబుల్ రిఫైన్డ్ నూనె అంటున్నారు. కిలో నూనె రావాలంటే ఉపయోగించాల్సిన రెండున్నర కిలోల గింజల (ముడిసరుకు) ధరే దాదాపుగా రూ. 250 అవుతుంది. అలాంటప్పుడు కిలో వేరుశెనగ నూనె రూ. 120 అంటూ మార్కెట్లో దొరకేది అసలు వేరుశెనగ నూనేనా? ఇంకేదైనానా? ఇక ప్రాసెస్ చేశాక అన్ని రకాల నూనెల రంగు, రుచి, వాసన ఒకే మాదిరిగా ఉంటున్నాయి. మరి అలాంటప్పుడు అది వేరుశెనగ నూనే కావచ్చు అంటూ సర్ది చెప్పుకోవడం తప్ప మరో మార్గం ఉండదు. ఇప్పుడు తార్కికంగా ఆలోచిద్దాం. ముడిసరుకు ధరే రూ. 250 ఉంటే కిలో నూనె ధర రూ. 120 కి దొరికే అవకాశం ఉండదు. కాబట్టి ఆ నూనెలో వేరుశెనగ పాళ్లు చాలా తక్కువ. మిగతాదంతా ఏదైనా రసాయనాలు కావచ్చు. మరి అలాంటప్పుడు మనమే ఓ నూనె తీసుకునే గానుగమెషిన్ కొనుక్కుంటే? మన కళ్ల ముందే మనమే నూనెను తీసుకుంటే? అప్పుడు మనం వాడే నూనె గురించి మనకు భరోసా ఉంటుంది. పైగా కోల్డ్ ప్రెస్డ్ నూనె తీసుకుంటే మరో ప్రయోజనమూ ఉంది. నూనెలు వేడి చేయడం మంచిది కాదన్న విషయం తెలిసిందే. అలాంటప్పుడు మనకు అమ్మే నూనెలను ఏమేరకు వేడి చేసి తీస్తున్నారో మనకు తెలియదు. కానీ మన కళ్ల ముందు ఆడించి, తీసుకునే నూనెను వేడి చేయకుండా తీసుకోవడం వల్ల మనకు భరోసాకు భరోసా, ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన యాంత్రిక గానుగలను వాడుకోవడం ప్రయోజనకరమే కదా. పై ఉదాహరణతో మార్కెట్లో అందుబాటులో ఉన్న డబుల్ రిఫైన్డ్ వంట నూనెల వల్ల అవాంఛనీయ రసాయనాలు, విషపదార్థాలు ఉన్నాయనే విషయం తేలిపోయింది. దాంతో మనం ఆ నూనెలను వాడినప్పుడు ఆయా విషపూరిత రసాయనాలు మన దేహాల్లోకి చేరుతున్నాయి. ఫలితంగా అధిక బరువు, అకాల మతిమరుపు (డిమెన్షియా), కాలేయ సమస్యలు, త్వరగా ముసలితనం రావడం, శరీరం లోపల వాపు (జనరలైజ్డ్ ఇన్ఫ్లమేషన్) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఈ కలుషిత డబుల్ రిఫైన్డ్ వంట నూనెల వల్ల వస్తున్నాయి. ప్రాసెస్ చేసిన ఈ వంట నూనెలు క్రమంగా మనుషుల ప్రాణాలను బలిగొంటున్నాయి. కాబట్టి వాటిని వంట గదులకు దూరంగా ఉంచడమే ఆరోగ్యదాయకం. అతిగా వేడి తగలని స్థితిలో నూనె గింజలు, పండ్ల నుంచి గానుగ ద్వారా రసాయనాలు లేదా సాల్వెంట్లు వాడకుండా తీసిన వంట నూనెలు అనేక ఆరోగ్యదాయకమైన ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్ ఇ సహా ఇతర పోషకాలను సైతం అందిస్తాయి. ఇవి ఆరోగ్యదాయకమైనవి. అందువల్ల ఈ గ్రహింపుతోనే గత ఏడాదిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి తరఫున గానుగ నూనెల వాడకాన్ని ప్రోత్సహించే ప్రయత్నం జరుగుతోంది. కొలెస్ట్రాల్, బీపీ... ఈ రెండు గుండె జబ్బులకు మూల కారణాలని గతంలో భావించేవాళ్లం. అయితే, కొలెస్ట్రాల్, బీపీ సమస్యలు లేని వారికీ గుండె జబ్బులు వస్తున్నాయి. గుండెపోటు మరణాలూ సంభవిస్తున్నాయి. సడన్ హెమరేజ్ వంటి సమస్యలు వస్తున్నాయి. డబుల్ రిఫైన్డ్ వంట నూనెల వల్ల వస్తున్న ‘జనరలైజ్డ్ ఇన్‌ఫ్లమేషనే (శరీరం లోపల వాపు) ఇందుకు మూల కారణమని ఇప్పుడు గుండె వైద్య నిపుణులు సైతం గుర్తించారు. శరీరం లోపల ఆ ఇన్‌ఫ్లమేషనే లేకపోతే ఈ కొలెస్ట్రాల్, బీపీ కూడా అంతగా ఇబ్బంది పెట్టవు. వెనకటి కాలంలో మాదిరిగా చెక్క గానుగలు ఇప్పుడూ పెట్టి నాణ్యమైన వంటనూనెలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థలు అనేకం ఉన్నాయి. అయితే, ఎవరికి వారు తమ వంట నూనెలను, తమ ఇంట్లోనే కావాలనుకున్నప్పుడు సిద్ధం చేసుకునేందుకు సులువైన చిన్న సైజు ఆయిల్ ఎక్స్ల్లర్స్ సూరత్, నాగపూర్ మోడల్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటి ధర దాదాపు రూ. 22 వేలకు అటూ ఇటుగా ఉంటాయి. చిన్న సైజు ఆయిల్ ఎక్స్ల్లర్ ద్వారా నూనె గింజల్లో నుంచి 98% నూనెను వెలికితీయవచ్చు. చక్క/పిట్టు/పిప్పిలో అతి తక్కువగా 2% నూనె మాత్రమే ఉంటుంది. విద్యుత్ ఖర్చు కూడా పెద్దగా ఉండదు. ఇక ఈ తరహా నూనెల్లోనూ కుసుమ నూనె శ్రేష్టమైనది. తర్వాత నల్ల నువ్వుల నూనె, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె మంచివి. ముఖ్యంగా కుసుమ, నల్లనువ్వుల నూనెలో శరీరానికి హాని చేసే ట్రాన్స్‌ఫ్యాట్స్ తక్కువ. కాబట్టి మిగతా నూనెలతో పోలిస్తే కుసుమ, నల్లనువ్వుల నూనెలు మంచివి. నూనె తీసిన తర్వాత వచ్చే పిప్పిలో పోషక విలువలు ఉంటాయి. వీటిని నేరుగా తినొచ్చు. కూరల్లో వేసుకోవచ్చు. ఈ విధంగా చూస్తే వృథాగా పోయే వ్యర్థాలనూ ఆరోగ్యం కోసం మనం వాడుకోవచ్చు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే? నూనె గింజలను వత్తిడికి గురిచేసే క్రమంలో 49 డిగ్రీల సెల్సియస్ వేడి పుట్టినప్పుడు కణాలలో నుంచి నూనె బయటకు వస్తుంది. అంతకన్నా ఎక్కువ వేడి కలగని పద్ధతిలో నిదానంగా వెలికి తీసిన నూనెను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం మరొకటి ఉంది. మనకు థయామిన్ అనే విటమిన్ చాలా మేలు చేస్తుంది. దీని లోపం వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి. ఇటీవలి మన ఆహారపదార్థాల్లో ఆర్సినిక్ అనే విషం పాళ్లు ఎక్కువగా ఉంటున్నట్లు అనేక పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఆహారంలో ఆర్సినిక్ ఉన్నప్పుడు థయామిన్ సరిగా పనిచేయదు. ఇలాంటిప్పుడు మన శరీరంలో స్రవించిన ఇన్సులిన్ కూడా ఎంత ప్రభావవంతంగా ఉండాలో అంత ప్రభావవంతంగా పనిచేయదు. దాంతో ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ వస్తుంది. టైప్–2 డయాబెటిస్‌లోనూ ముందుగా ఇలాంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ ఉంటుంది కాబట్టి... ఇలా ఆహారంలో ఆర్సినిక్ ఉండటం, అది థయామిన్ ఇచ్చే మంచి ప్రయోజనాలకు అడ్డుపడటం చక్కెర వ్యాధి ఉన్నప్పుడు ఉండే కండిషన్ల వంటి వాటినే కలగజేస్తుంది. అందుకే రసాయనాలతో ఉండే నూనెలను కొనడం కంటే... మనకు అవసరమైన నూనెను ఈ గానుగ యంత్రాల ద్వారా మనమే తయారు చేసుకోవడం మంచిది. వంట నూనెను పరిమితికి మించి అతిగా వేడి చేసినప్పుడు విషతుల్యంగా మారుతుంది. నూనె రకాన్ని బట్టి పరిమితి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. కుసుమ(శాఫ్లవర్) నూనెను 105 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా వేడి చేయకూడదు. ఇది కూరలకు బాగుంటుంది. డీప్ ఫ్రై చేయడానికి ఈ నూనె పనికిరాదు. ఎందుకంటే.. డీప్ ఫ్రై చేసేటప్పుడు 150 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ వేడి చేయాల్సి వస్తుంది. అందుకు వేరుశనగ నూనె పనికొస్తుంది. ఇక్కడ మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం తీసుకునే ఆహారం అంటే అదేదో కేవలం తిండికి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. అది సుస్థిరమైన ఆరోగ్యం కోసం, సమతుల ఆహారం కోసం, మంచి పర్యావరణం కోసం... ఇలా ఈ అంశాలన్నింటి సమతౌల్యానికి దోహదం చేసే అంశం. అందుకే మనం విష రసాయనాలను కాకుండా... నమ్మకమైన ఆహారాన్ని మాత్రమే కడుపులోకి పంపాలి. -
కస్టమ్ మిల్లింగ్ లక్ష్యం 15 శాతం పెంపు
ఆకివీడు : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) లక్ష్యం మరో 15 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం స్థానిక రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ హాలులో జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సేకరణ లక్ష్యాన్ని 15 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు వారు తెలిపారు. ఖరీఫ్ దిగుబడి 13.50లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనాలు వేసి జిల్లా యంత్రాంగానికి నివేదించారు. అయితే జిల్లాలో 10.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి మాత్రమే వచ్చింది. ఈ ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లర్లు సేకరించి కస్టమ్ మిల్లింగ్ చేసి బియాన్ని ప్రభుత్వానికి సరఫరా చేయాలి. ఆ విధంగా జిల్లా ధాన్యం దిగుబడిలో 9.50 లక్షలు మెట్రిక్ టన్నులకు మాత్రమే ఖరీఫ్‌లో బియ్యం సేకరించేందుకు మిల్లర్లకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ ప్రకారంగా రైతుల వద్ద నుంచి 69 శాతం సీఎమ్మార్ సేకరించాలని నిర్ణయించారు. అయితే జిల్లాలో ధాన్యం నిల్వలు ఉన్నందున మరో 15 శాతం బియ్యం సేకరించాలని లక్ష్యాన్ని నిరే్ధశించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని రైస్ మిల్లుల వద్ద నుంచి అదనంగా 15 శాతం బియ్యం సీఎమ్మార్‌గా సేకరిస్తారని జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమావేశంలో చెప్పినట్టు స్థానిక మిల్లర్లు తెలిపారు. -
ఎక్కడ భద్రపరచాలి?
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో రేషన్ బియ్యం నిల్వ చేసేందుకు అవసరమైన గోదాములు లేక అధికారులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని 108 మంది మిల్లర్లు ఆడే బియ్యాన్ని ఎక్కడ భద్రపరచాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 167 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారు. ఇందుకోసం రైతులకు రూ.279 కోట్లు చెల్లించారు. మిల్లర్లకు తరలించిన ఈ ధాన్యాన్ని ఆడి 67 శాతం బియ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ 2.18లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఇవ్వాల్సిన బియ్యంలో 52 శాతం మాత్రమే మిల్లర్లు ఇచ్చారు. ఇచ్చిన బియ్యాన్ని భద్రపరిచేందుకు జిల్లాలో గొడౌన్లు ఖాళీ లేవు. జిల్లాలో పార్వతీపురం, బొబ్బిలి, గొట్లాం, సీతానగరం, కేఎల్‌పురం, అంటిపేట వంటి ప్రాంతాల్లో 73,983 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గొడౌన్లు ఉన్నాయి. ఇప్పటికే వీటిలో 66వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ చేశారు. మిల్లింగ్ నిలిపివేత జిల్లాలో ఉన్న లెవీ బియ్యాన్ని భద్రపరిచేందుకు అవసరమయిన గొడౌన్లు ఖాళీ లేక అధికారులు దాదాపు 40వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విశాఖ తరలించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం సివిల్‌సప్లైస్ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకూ అనుమతులు రాలేదు. బియ్యం నిల్వలు భద్రపరిచేందుకు స్థలం లేని కారణంగా మిల్లర్లు ధాన్యం మిల్లింగ్‌ను నిలిపివేశారు. రవాణా చార్జీలు అదనంగా చెల్లించకే... ప్రతి మిల్లర్‌కూ తాము చేపట్టే కస్టమ్ మిల్లింగ్ అనంతరం బియ్యం ఎక్కడికి తరలించాలనే దానిపై ప్రతిపాదన ఉంటుంది. ప్రణాళిక సమయంలోనే ఈ దూరాన్ని లెక్క గడతారు. ఇప్పుడు కొన్ని చోట్ల గోదాములు ఖాళీ ఉన్నా, అక్కడికి బియ్యం తరలించేందుకు మిల్లర్లకు అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంది. అయితే బియ్యం తరలించిన తరువాత అధికారులు చార్జీలు ఇస్తారోలేదో అన్న అనుమానంతోనే మిల్లర్లు వీటిని తరలించడం లేదు. దీంతో బియ్యం నిల్వలు ఎక్కడివక్కడే ఉండడంతో పాటు ధాన్యం కూడా అక్కడే ఉండిపోతోంది. మరో పక్క ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తూనే ఉంది. జిల్లాలో ఇప్పటికే 2.18 లక్షల మెట్రిక్ టన్నులకు పైబడి ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ ఇంకా మరో 20వేల మెట్రిక్ టన్నులకు పైబడే ధాన్యం వచ్చే అవకాశముందని అధికారులు లెక్కగడుతున్నారు. 1100 మెట్రిక్ టన్నులను తరలిస్తున్నాం. బియ్యం నిల్వలు ఎక్కువగా ఉన్న మిల్లుల నుంచి 1100 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఖాళీగా ఉన్న ప్రాంతాలకు తరలిస్తున్నాం. దీనిపై గురువారం ఉదయమే ఆదేశాలిచ్చాం. పౌరసరఫరాల శాఖ డీఎంతో చర్చించి ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో బియ్యాన్ని తరలించాలని, మిల్లులను తిరిగి యథావిధిగా మిల్లింగ్ చేయాలనీ ఆదేశాలు జారీ చేశాం. దీనిపై మిల్లర్ల సంఘం అధ్యక్షునితో కూడా మాట్లాడి తగు చర్యలు తీసుకుంటున్నాం. - బి రామారావు, జాయింట్ కలెక్టర్, విజయనగరం.