ఎక్కడ భద్రపరచాలి?
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో రేషన్ బియ్యం నిల్వ చేసేందుకు అవసరమైన గోదాములు లేక అధికారులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని 108 మంది మిల్లర్లు ఆడే బియ్యాన్ని ఎక్కడ భద్రపరచాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 167 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారు. ఇందుకోసం రైతులకు రూ.279 కోట్లు చెల్లించారు. మిల్లర్లకు తరలించిన ఈ ధాన్యాన్ని ఆడి 67 శాతం బియ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ 2.18లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఇవ్వాల్సిన బియ్యంలో 52 శాతం మాత్రమే మిల్లర్లు ఇచ్చారు. ఇచ్చిన బియ్యాన్ని భద్రపరిచేందుకు జిల్లాలో గొడౌన్లు ఖాళీ లేవు. జిల్లాలో పార్వతీపురం, బొబ్బిలి, గొట్లాం, సీతానగరం, కేఎల్‌పురం, అంటిపేట వంటి ప్రాంతాల్లో 73,983 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గొడౌన్లు ఉన్నాయి. ఇప్పటికే వీటిలో 66వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ చేశారు.
మిల్లింగ్ నిలిపివేత
జిల్లాలో ఉన్న లెవీ బియ్యాన్ని భద్రపరిచేందుకు అవసరమయిన గొడౌన్లు ఖాళీ లేక అధికారులు దాదాపు 40వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విశాఖ తరలించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం సివిల్‌సప్లైస్ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకూ అనుమతులు రాలేదు. బియ్యం నిల్వలు భద్రపరిచేందుకు స్థలం లేని కారణంగా మిల్లర్లు ధాన్యం మిల్లింగ్‌ను నిలిపివేశారు.
రవాణా చార్జీలు అదనంగా చెల్లించకే...
ప్రతి మిల్లర్‌కూ తాము చేపట్టే కస్టమ్ మిల్లింగ్ అనంతరం బియ్యం ఎక్కడికి తరలించాలనే దానిపై ప్రతిపాదన ఉంటుంది. ప్రణాళిక సమయంలోనే ఈ దూరాన్ని లెక్క గడతారు. ఇప్పుడు కొన్ని చోట్ల గోదాములు ఖాళీ ఉన్నా, అక్కడికి బియ్యం తరలించేందుకు మిల్లర్లకు అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంది. అయితే బియ్యం తరలించిన తరువాత అధికారులు చార్జీలు ఇస్తారోలేదో అన్న అనుమానంతోనే మిల్లర్లు వీటిని తరలించడం లేదు. దీంతో బియ్యం నిల్వలు ఎక్కడివక్కడే ఉండడంతో పాటు ధాన్యం కూడా అక్కడే ఉండిపోతోంది. మరో పక్క ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తూనే ఉంది. జిల్లాలో ఇప్పటికే 2.18 లక్షల మెట్రిక్ టన్నులకు పైబడి ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ ఇంకా మరో 20వేల మెట్రిక్ టన్నులకు పైబడే ధాన్యం వచ్చే అవకాశముందని అధికారులు లెక్కగడుతున్నారు.
1100 మెట్రిక్ టన్నులను తరలిస్తున్నాం.
బియ్యం నిల్వలు ఎక్కువగా ఉన్న మిల్లుల నుంచి 1100 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఖాళీగా ఉన్న ప్రాంతాలకు తరలిస్తున్నాం. దీనిపై గురువారం ఉదయమే ఆదేశాలిచ్చాం. పౌరసరఫరాల శాఖ డీఎంతో చర్చించి ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో బియ్యాన్ని తరలించాలని, మిల్లులను తిరిగి యథావిధిగా మిల్లింగ్ చేయాలనీ ఆదేశాలు జారీ చేశాం. దీనిపై మిల్లర్ల సంఘం అధ్యక్షునితో కూడా మాట్లాడి తగు చర్యలు తీసుకుంటున్నాం.
- బి రామారావు, జాయింట్ కలెక్టర్, విజయనగరం.