సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడికి అనుగుణంగా మిల్లింగ్ పరిశ్రమలో విస్తృత అవకాశాలున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఇందులోభాగంగానే ప్రభుత్వమే సొంతంగా రైస్ మిల్లులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. మంత్రి బుధవారం పౌరసరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్, ఎస్‌పీపీజెడ్ అధికారులు, జపాన్ సటాకె కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏటా మూడు కోట్ల టన్నులకు పైగా ఉత్పత్తవుతున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికి రాష్ట్రంలో చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
అందుకే రూ.రెండువేల కోట్లతో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మిల్లులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మిల్లింగ్ పరిశ్రమలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ధాన్యం మిల్లింగ్‌తోపాటు ఉప ఉత్పత్తులైన రైస్ బ్రాన్ ఆయిల్, నూక తదితరాలు ప్రాసెసింగ్ చేసేందుకు ప్రత్యేక జోన్‌లను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం సటాకే, సైలో తదితర ప్రపంచస్థాయి కంపెనీల ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సటాకె కార్పొరేషన్, ఇతర కంపెనీల ప్రతినిధులు తమ కంపెనీల సాంకేతికతను మంత్రికి వివరించారు, గంటకు 20 నుంచి 1,200 టన్నుల మిల్లింగ్ కెపాసిటీ తమ సొంతమని వారు చెప్పారు. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను ముఖ్యమంత్రికి సమర్పి స్తామని గంగుల తెలిపారు. ప్రభుత్వం మిల్లులను ఏర్పాటు చేయడంతోపాటు స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ప్రత్యేకంగా రూ.100కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినవారికి ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు.
కాగా, పౌరసరఫరాల శాఖలో ప్రజలకు సేవల్ని మరింత కచ్చితంగా, పారదర్శకంగా అందించేందుకు టెక్నాలజీ సంబంధిత అంశాలపై గంగుల ప్రత్యేకంగా సమీక్షించారు, రైతుల వద్ద ధాన్యం కొనుగోలు మొదలు బియ్యం పంపిణీ వరకు వివిధ దశల్లో వృధా లేకుండా సాంకేతికతను అప్‌గ్రెడేషన్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, నెట్‌వర్కింగ్, శాటిలైట్ టెక్నాలజీలో పనిచేస్తున్న మలోల ఇన్నోవేషన్స్, సీఎస్‌ఎం, ఐబీఐ, ప్లానెట్ ఎం తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment