బీసీలకు రూ. లక్ష నిరంతర ప్రక్రియ | Cabinet sub committee meeting under Gangula Kamalakar | Sakshi
Sakshi News home page

బీసీలకు రూ. లక్ష నిరంతర ప్రక్రియ

Published Sun, Jun 18 2023 3:40 AM | Last Updated on Sun, Jun 18 2023 9:40 AM

Cabinet sub committee meeting under Gangula Kamalakar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన వర్గాలకు రూ. లక్ష సాయం అందించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలలో ఉన్న కుల, చేతి వృత్తులు చేసుకునే వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకానికి రూపకల్పన చేశారని అన్నారు. బీసీలకు లక్ష పథకంపై శనివారం సచివాలయంలో మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ జరిగింది.

మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు హాజరై ఇప్పటివరకు ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. పథకం తొలిదశ అమలును బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కేబినెట్‌ సబ్‌ కమిటీకి వివరించారు. అమలు తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు.. అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశం అనంతరం మంత్రి కమలాకర్‌ వివరాలను వెల్లడించారు.

బీసీల అభ్యున్నతి లక్ష్యంగా... 
వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం తపిస్తున్న సీఎం కేసీఆర్‌ చేతి వృత్తులకు చేయూతనిచ్చేందుకు రూ.లక్ష ఆర్థికసాయం పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. కుల, చేతి వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్న వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఈ సాయాన్ని ప్రకటించారన్నారు. శనివారం నాటికి ఈ సాయం కోసం 2,70,000 దరఖాస్తులు అన్‌లైన్‌ ద్వారా నమోదయ్యాయని వివరించారు.

ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి పారదర్శకంగా చేయనున్నట్లు తెలిపారు. ప్రాధాన్యతాక్రమంలో అర్హత కలిగిన లబ్దిదారుల్లోని అత్యంత పేదవారికి సాయం అందజేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతీనెల 5వ తేదీలోపు కలెక్టర్లు లబ్దిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలని, ఇన్‌చార్జి మంత్రులు ధ్రువీకరించిన జా బితాలోని లబ్దిదారులకు ప్రతీ నెల 15వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీ దుగా సాయం అందజేస్తామన్నారు.

దరఖాస్తుదారులు  https://tsobmm sbc. cgg.gov.in వెబ్‌ సైట్‌లో మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని, ఆ ఫారంను ఏ ఆఫీసులోగానీ, ఏ అధికారికి గానీ సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. ఎంపికైన లబ్దిదారులు నెలరోజుల్లోపు తమకు నచ్చిన, కావాల్సిన పనిముట్లను, సామగ్రిని కొనుక్కోవాలని సూచించారు. లబ్ధిదారుల నిరంతర అభివృద్ధి కోసం అధికారులు పర్యవేక్షిస్తారని, నెలలోపు లబ్దిదారులతో కూడిన యూనిట్ల ఫొటోల ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement