కొత్తగా ట్రై చేయండి | Health Benefits of Milling Saving Cooking Oil | Sakshi
Sakshi News home page

కొత్తగా ట్రై చేయండి

Published Thu, Feb 22 2018 12:13 AM | Last Updated on Thu, Feb 22 2018 12:13 AM

Health Benefits of Milling Saving Cooking Oil - Sakshi

∙వంట నూనెల్లో హానికర రసాయనాలు ఉండే అవకాశం ఎక్కువ కాబట్టి మనమే తీసుకోగల కోల్డ్‌ ప్రెస్‌డ్‌ ఆయిల్స్‌తో వంట – ఒళ్లూ రెండూ ఆరోగ్యకరమని చెబుతున్నారు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేచురోపతి నిపుణులు 

∙మర గానుగ వంట నూనెలతో ఆరోగ్య ప్రయోజనాలు 
∙ఇప్పుడు అందుబాటులో ఇంట్లోనే నూనె తీసుకునే చిన్న యంత్రాలు 
∙ఎవరి వంట నూనె బాధ్యత వారే తీసుకోవడం వల్ల నమ్మకం 
∙‘సాక్షి’తో జాతీయ ప్రకృతి వైద్య సంస్థ(పుణే) సంచాలకులు డాక్టర్‌ సత్యలక్ష్మి

విత్తనాలు, పండ్ల నుంచి అతిగా వేడి పుట్టని రీతిలో గానుగల ద్వారా పోషకాలతో కూడిన ఆరోగ్యదాయకమైన వంట నూనెలను తయారు చేసుకొని వాడుకోవడం పూర్వకాలం నుంచి మనకు ఉన్న సంప్రదాయం. అయితే, ఆధునిక కాలంలో డబుల్‌ రిఫైన్డ్‌ వంట నూనెలు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన దరిమిలా గానుగ ఆడించడం ద్వారా తీసిన నూనెల వాడకం దాదాపుగా కనుమరుగైంది. డబుల్‌ రిఫైన్డ్‌ పేరిట చలామణిలో ఉన్న వంట నూనెల వల్ల కొలెస్ట్రాల్, బీపీ లేకపోయినా శరీరం లోపల జనరలైజ్‌డ్‌ ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల గుండె జబ్బులు వస్తున్నాయని తెలిసిందని పుణేలోని జాతీయ ప్రకృతి వైద్య సంస్థ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేచురోపతి) సంచాలకులు డాక్టర్‌ సత్యలక్ష్మి అంటున్నారు. భారీ గానుగలు అవసరం లేదని, ఇంట్లో పెట్టుకొని అవసరమైనప్పుడు నూనె తీసుకునే చిన్నపాటి విద్యుత్‌ గానుగ యంత్రాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయని ఆమె తెలిపారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేచురోపతి సంస్థ  ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జాతీయ సహజ ఆహారోత్సవం సందర్భంగా డా. సత్యలక్ష్మి ‘సాక్షి’తో ముచ్చటించారు... ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..

మనం నూనెలను వాడే ముందర ఒక విషయాన్ని తార్కికంగా ఆలోచిద్దాం. ఉదాహరణకు మీ ఇంట్లో సాధారణంగా వేరుశెనగ నూనెను ఉపయోగిస్తున్నారని అనుకుందాం. రెండున్నర కిలోల వేరుశనగ గింజలు ఉపయోగిస్తే తప్ప ఒక లీటరు నూనె రాదు. కిలో నూనె గింజల ఖరీదు నూరు రూపాయలు. కానీ, మార్కెట్‌లో లీటరు వేరుశనగ నూనెను రూ.120 అంతకన్నా తక్కువకు కూడా అమ్ముతున్నారు. డబుల్‌ రిఫైన్డ్‌ నూనె అంటున్నారు. కిలో నూనె రావాలంటే ఉపయోగించాల్సిన రెండున్నర కిలోల గింజల (ముడిసరుకు) ధరే దాదాపుగా రూ. 250 అవుతుంది. అలాంటప్పుడు కిలో వేరుశెనగ నూనె రూ. 120 అంటూ మార్కెట్‌లో దొరకేది అసలు వేరుశెనగ నూనేనా? ఇంకేదైనానా? ఇక ప్రాసెస్‌ చేశాక అన్ని  రకాల నూనెల రంగు, రుచి, వాసన ఒకే మాదిరిగా ఉంటున్నాయి. మరి అలాంటప్పుడు అది వేరుశెనగ నూనే కావచ్చు అంటూ సర్ది చెప్పుకోవడం తప్ప మరో మార్గం ఉండదు. ఇప్పుడు తార్కికంగా ఆలోచిద్దాం. ముడిసరుకు ధరే రూ. 250 ఉంటే కిలో నూనె ధర రూ. 120 కి దొరికే అవకాశం ఉండదు. కాబట్టి ఆ నూనెలో వేరుశెనగ పాళ్లు చాలా తక్కువ. మిగతాదంతా ఏదైనా రసాయనాలు కావచ్చు. మరి అలాంటప్పుడు మనమే ఓ నూనె తీసుకునే గానుగమెషిన్‌ కొనుక్కుంటే? మన కళ్ల ముందే మనమే నూనెను తీసుకుంటే? అప్పుడు మనం వాడే నూనె గురించి మనకు భరోసా ఉంటుంది. పైగా కోల్డ్‌ ప్రెస్డ్‌ నూనె తీసుకుంటే మరో ప్రయోజనమూ ఉంది. నూనెలు వేడి చేయడం మంచిది కాదన్న విషయం తెలిసిందే. అలాంటప్పుడు మనకు అమ్మే నూనెలను ఏమేరకు వేడి చేసి తీస్తున్నారో మనకు తెలియదు. కానీ మన కళ్ల ముందు ఆడించి, తీసుకునే నూనెను వేడి చేయకుండా తీసుకోవడం వల్ల మనకు భరోసాకు భరోసా, ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన యాంత్రిక గానుగలను వాడుకోవడం ప్రయోజనకరమే కదా. 

పై ఉదాహరణతో మార్కెట్లో అందుబాటులో ఉన్న డబుల్‌ రిఫైన్డ్‌ వంట నూనెల వల్ల అవాంఛనీయ రసాయనాలు, విషపదార్థాలు ఉన్నాయనే విషయం తేలిపోయింది. దాంతో మనం ఆ నూనెలను వాడినప్పుడు ఆయా విషపూరిత రసాయనాలు మన దేహాల్లోకి చేరుతున్నాయి. ఫలితంగా అధిక బరువు, అకాల మతిమరుపు (డిమెన్షియా), కాలేయ సమస్యలు, త్వరగా ముసలితనం రావడం, శరీరం లోపల వాపు (జనరలైజ్డ్‌ ఇన్‌ఫ్లమేషన్‌) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఈ కలుషిత డబుల్‌ రిఫైన్డ్‌ వంట నూనెల వల్ల వస్తున్నాయి. ప్రాసెస్‌ చేసిన ఈ వంట నూనెలు క్రమంగా మనుషుల ప్రాణాలను బలిగొంటున్నాయి. కాబట్టి వాటిని వంట గదులకు దూరంగా ఉంచడమే ఆరోగ్యదాయకం.   అతిగా వేడి తగలని స్థితిలో నూనె గింజలు, పండ్ల నుంచి గానుగ ద్వారా రసాయనాలు లేదా సాల్వెంట్లు వాడకుండా తీసిన వంట నూనెలు అనేక ఆరోగ్యదాయకమైన ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్‌ ఇ సహా ఇతర పోషకాలను సైతం అందిస్తాయి. ఇవి ఆరోగ్యదాయకమైనవి. అందువల్ల ఈ గ్రహింపుతోనే గత ఏడాదిగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేచురోపతి తరఫున గానుగ నూనెల వాడకాన్ని ప్రోత్సహించే ప్రయత్నం జరుగుతోంది.  
     
కొలెస్ట్రాల్, బీపీ... ఈ రెండు గుండె జబ్బులకు మూల కారణాలని గతంలో భావించేవాళ్లం. అయితే, కొలెస్ట్రాల్, బీపీ సమస్యలు లేని వారికీ గుండె జబ్బులు వస్తున్నాయి. గుండెపోటు మరణాలూ సంభవిస్తున్నాయి. సడన్‌ హెమరేజ్‌ వంటి సమస్యలు వస్తున్నాయి. డబుల్‌ రిఫైన్డ్‌ వంట నూనెల వల్ల వస్తున్న ‘జనరలైజ్డ్‌ ఇన్‌ఫ్లమేషనే (శరీరం లోపల వాపు) ఇందుకు మూల కారణమని ఇప్పుడు గుండె వైద్య నిపుణులు సైతం గుర్తించారు. శరీరం లోపల ఆ ఇన్‌ఫ్లమేషనే లేకపోతే ఈ కొలెస్ట్రాల్, బీపీ కూడా అంతగా ఇబ్బంది పెట్టవు. వెనకటి కాలంలో మాదిరిగా చెక్క గానుగలు ఇప్పుడూ పెట్టి నాణ్యమైన వంటనూనెలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థలు అనేకం ఉన్నాయి. అయితే, ఎవరికి వారు తమ వంట నూనెలను, తమ ఇంట్లోనే కావాలనుకున్నప్పుడు సిద్ధం చేసుకునేందుకు సులువైన చిన్న సైజు ఆయిల్‌ ఎక్స్‌ల్లర్స్‌ సూరత్, నాగపూర్‌ మోడల్స్‌ చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటి ధర దాదాపు  రూ. 22 వేలకు అటూ ఇటుగా ఉంటాయి. చిన్న సైజు ఆయిల్‌ ఎక్స్‌ల్లర్‌ ద్వారా నూనె గింజల్లో నుంచి 98% నూనెను వెలికితీయవచ్చు. చక్క/పిట్టు/పిప్పిలో అతి తక్కువగా 2% నూనె మాత్రమే ఉంటుంది. విద్యుత్‌ ఖర్చు కూడా పెద్దగా ఉండదు. ఇక ఈ తరహా నూనెల్లోనూ కుసుమ నూనె శ్రేష్టమైనది. తర్వాత నల్ల నువ్వుల నూనె, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె మంచివి. ముఖ్యంగా కుసుమ, నల్లనువ్వుల నూనెలో శరీరానికి హాని చేసే ట్రాన్స్‌ఫ్యాట్స్‌ తక్కువ. కాబట్టి మిగతా నూనెలతో పోలిస్తే కుసుమ, నల్లనువ్వుల నూనెలు మంచివి. నూనె తీసిన తర్వాత వచ్చే పిప్పిలో పోషక విలువలు ఉంటాయి. వీటిని నేరుగా తినొచ్చు. కూరల్లో వేసుకోవచ్చు. ఈ విధంగా చూస్తే వృథాగా పోయే వ్యర్థాలనూ ఆరోగ్యం కోసం మనం వాడుకోవచ్చు.

కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్‌ అంటే? 
నూనె గింజలను వత్తిడికి గురిచేసే క్రమంలో 49 డిగ్రీల సెల్సియస్‌ వేడి పుట్టినప్పుడు కణాలలో నుంచి నూనె బయటకు వస్తుంది. అంతకన్నా ఎక్కువ వేడి కలగని పద్ధతిలో నిదానంగా వెలికి తీసిన నూనెను కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్‌ అంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం మరొకటి ఉంది. మనకు థయామిన్‌ అనే విటమిన్‌ చాలా మేలు చేస్తుంది. దీని లోపం వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి. ఇటీవలి మన ఆహారపదార్థాల్లో ఆర్సినిక్‌ అనే విషం పాళ్లు ఎక్కువగా ఉంటున్నట్లు అనేక పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఆహారంలో ఆర్సినిక్‌ ఉన్నప్పుడు థయామిన్‌ సరిగా పనిచేయదు. ఇలాంటిప్పుడు మన శరీరంలో స్రవించిన ఇన్సులిన్‌ కూడా ఎంత ప్రభావవంతంగా ఉండాలో అంత ప్రభావవంతంగా పనిచేయదు. దాంతో ‘ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌’ వస్తుంది. టైప్‌–2 డయాబెటిస్‌లోనూ ముందుగా ఇలాంటి ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ కండిషన్‌ ఉంటుంది కాబట్టి... ఇలా ఆహారంలో ఆర్సినిక్‌ ఉండటం, అది థయామిన్‌ ఇచ్చే మంచి ప్రయోజనాలకు అడ్డుపడటం చక్కెర వ్యాధి ఉన్నప్పుడు ఉండే కండిషన్ల వంటి వాటినే కలగజేస్తుంది. అందుకే రసాయనాలతో ఉండే నూనెలను కొనడం కంటే... మనకు అవసరమైన నూనెను ఈ గానుగ యంత్రాల ద్వారా మనమే తయారు చేసుకోవడం మంచిది. 

వంట నూనెను పరిమితికి మించి అతిగా వేడి చేసినప్పుడు విషతుల్యంగా మారుతుంది. నూనె రకాన్ని బట్టి పరిమితి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. కుసుమ(శాఫ్లవర్‌) నూనెను 105 డిగ్రీల సెల్సియస్‌ కన్నా ఎక్కువగా వేడి చేయకూడదు. ఇది కూరలకు బాగుంటుంది. డీప్‌ ఫ్రై చేయడానికి ఈ నూనె పనికిరాదు. ఎందుకంటే.. డీప్‌ ఫ్రై చేసేటప్పుడు 150 డిగ్రీల సెల్సియస్‌ కన్నా ఎక్కువ వేడి చేయాల్సి వస్తుంది. అందుకు వేరుశనగ నూనె పనికొస్తుంది.   ఇక్కడ మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం తీసుకునే ఆహారం అంటే అదేదో కేవలం తిండికి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. అది సుస్థిరమైన ఆరోగ్యం కోసం, సమతుల ఆహారం కోసం, మంచి పర్యావరణం కోసం... ఇలా ఈ అంశాలన్నింటి సమతౌల్యానికి దోహదం చేసే అంశం. అందుకే మనం విష రసాయనాలను కాకుండా... నమ్మకమైన ఆహారాన్ని మాత్రమే కడుపులోకి పంపాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement