Telangana: మిల్లర్లపై ఉక్కుపాదం | Telangana Govt Focus On rice millers | Sakshi
Sakshi News home page

Telangana: మిల్లర్లపై ఉక్కుపాదం

Published Fri, Nov 22 2024 4:11 AM | Last Updated on Fri, Nov 22 2024 6:04 AM

Telangana Govt Focus On rice millers

ధాన్యం మిల్లింగ్‌ చేయబోమంటే కుదరదని స్పష్టం చేసిన సర్కారు

కేటాయించిన ధాన్యం దించుకోవాల్సిందే.. మిల్లింగ్‌ చేయాల్సిందే 

బ్యాంక్‌ గ్యారంటీలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్న మిల్లర్లకు సర్కార్‌ స్పష్టీకరణ.... మిల్లు సామర్థ్యంలో 50 శాతం మేర
సీఎంఆర్‌ తప్పనిసరి.. లేదంటే మిల్లును సీజ్‌ చేసే అధికారం 

2015 నాటి ప్రభుత్వ ఉత్తర్వులు, 2023లో వెలువడిన సవరణ జీవోలు తెరపైకి..  దిగివస్తున్న మిల్లర్లు.. బ్యాంకు గ్యారంటీలు ఇచ్చేందుకు 2,054 మంది సంసిద్ధత 

గతంలో రూ.602 కోట్ల విలువైన బియ్యాన్ని ఎగవేసిన 362 మంది మిల్లర్లు... రెవెన్యూ రికవరీ యాక్ట్‌ కింద ఆస్తుల జప్తుకు ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైస్‌ మిల్లర్లపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. పైసా పెట్టుబడి లేకుండా ఏటా కోట్ల రూపాయలు సంపాదిస్తూ కూడా, సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌) చేసేందుకు వెనుకాడుతున్నారంటూ.. మిల్లులపై కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం పెట్టే నిబంధనల మేరకు ప్రతి రైస్‌ మిల్లు పనిచేయాలని.. లేకుంటే మిల్లు సీజ్‌ చేయడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేసింది. 

ప్రతి మిల్లు సామర్థ్యంలో 50 శాతం మేరకు ధాన్యం అప్పగించి, తప్పనిసరిగా మిల్లింగ్‌ చేసేలా నిబంధన పెట్టింది. బ్యాంకు గ్యారంటీ ఇవ్వలేమంటూ తప్పించుకునే పరిస్థితి లేకుండా చర్యలు చేపట్టింది. కోట్ల రూపాయల విలువైన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ బకాయిపడ్డ డిఫాల్ట్‌ మిల్లర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ చట్టం కింద జప్తు చేయాలని నిర్ణయించింది. ఆయా మిల్లుల ఆస్తులను ఇతరుల పేర్లపైకి బదలాయించే అవకాశం లేకుండా ముందు జాగ్రత్తగా రిజి్రస్టేషన్‌ శాఖను అప్రమత్తం చేసింది. 

మిల్లర్ల ఇష్టారాజ్యానికి చెక్‌! 
రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడి, మిల్లింగ్‌ సదుపాయాల కొరతను ఆసరాగా చేసుకొని.. మిల్లర్లు కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మిల్లింగ్‌ కెపాసిటీతో సంబంధం లేకుండా సీఎంఆర్‌ కోసం ధాన్యం కేటాయింపులు, ఏళ్లకేళ్లు గడిచినా బియ్యాన్ని అప్పగించకపోవడం, మిల్లు ల్లో ధాన్యం లేకపోవడం.. వంటి అవకతవకలతో పౌర సరఫరాల సంస్థ తీవ్ర నష్టాలను చవిచూసింది. 

దీనితో 2014–15లో రూ.4,747 కోట్లుగా ఉన్న సంస్థ అప్పులు.. 2023–24 నాటికి రూ.58,623 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు, మిల్లర్ల మాయాజాలంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొన్ని మార్గదర్శకాలను రూపొందించి... ఖరీఫ్‌ సీజన్‌ నుంచే నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టింది.  

కచ్చితంగా మిల్లింగ్‌ చేసేలా.. 
మిల్లులు ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి ప్రభుత్వానికి అప్పగించకుండా మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకోవడం, ఏళ్లకేళ్లు బకాయిలు అలానే ఉండటం వంటి సమస్యలకు చెక్‌ పెట్టేలా.. ప్రభుత్వం ధాన్యానికి బ్యాంకు గ్యారంటీ నిబంధన తెచ్చింది. ఈ నిబంధన వల్ల కస్టమ్‌ మిల్లింగ్‌ (సీఎంఆర్‌) చేయలేమంటూ మొండికేస్తున్న మిల్లర్లను దారికి తెచ్చేలా చర్యలు చేపట్టింది. 

ధాన్యం సేకరణ, కస్టమ్‌ మిల్లింగ్‌కు సంబంధించి... 2015, 2016లలో విడుదలైన 18, 36 జీవోలు, వాటికి సవరణ చేస్తూ 2023 అక్టోబర్‌లో జారీ చేసిన జీవో నంబర్‌ 25ను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలోని ప్రతి రైస్‌ మిల్లు దాని కెపాసిటీలో కనీసం 50శాతం మేర ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని సీఎంఆర్‌ చేయాల్సి ఉంటుంది. లేదంటే మిల్లు లైసెన్స్‌ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దీనితో కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని దించుకోమని మిల్లర్లు మొండికేసే పరిస్థితి తప్పనుంది. 

2,054 మిల్లులు ‘గ్యారంటీ’కి రెడీ 
రాష్ట్రంలోని సుమారు 3,500 మిల్లులకుగాను.. 2,054 రైస్‌మిల్లులు బ్యాంక్‌ గ్యారంటీలు ఇచ్చి ధాన్యాన్ని తీసుకునేందుకు అంగీకరించాయి. ఇందులో 1,274 రా రైస్‌ (ముడి బియ్యం) మిల్లులు కాగా.. 780 బాయిల్డ్‌ రైస్‌ (ఉప్పుడు బియ్యం) మిల్లులు. ఇప్పటివరకు 1,669 మిల్లులు (992 రా రైస్, 677 బాయిల్డ్‌ మిల్స్‌) బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని అండర్‌ టేకింగ్‌ ఇచ్చాయి. అండర్‌ టేకింగ్‌ ఇచ్చిన మిల్లుల సామర్థ్యం 57.76 లక్షల మెట్రిక్‌ టన్నులు. 

డీఫాల్టర్ల విషయంలో ప్రత్యేక చర్యలు 
మూడు విడతల కన్నా ఎక్కువగా సీఎంఆర్‌ ఇవ్వకుండా ఎగవేసిన మిల్లర్లను డీఫాల్టర్లుగా గుర్తించి ధాన్యం కేటాయించకూడదని, లేదా షరతులతో కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 1,777 డీఫాల్టర్లను గుర్తించగా.. అందులో 362 మంది మిల్లర్లు కొన్నేళ్లుగా వరుసగా సీఎంఆర్‌ ఎగవేస్తూ వస్తున్నారు. వారికి ఈ ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కేటాయించడం లేదు. 

మిగతావారు మొత్తం బకాయి మొత్తం బియ్యాన్ని, అపరాధ రుసుముతో సహా అప్పగించి... దీనితోపాటు కొత్తగా ఇచ్చే ధాన్యానికి సంబంధించి 25 శాతం బ్యాంకు గ్యారంటీ ఇస్తే ధాన్యం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి ఎగవేతదారులుగా గుర్తించిన 362 మంది మిల్లర్లలో.. కేవలం 10 మంది మిల్లర్లే ఏకంగా రూ.605 కోట్ల విలువైన 1.67 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. 

వీరిలో ఆరుగురు సూర్యాపేట జిల్లావారుకాగా, ఇద్దరు కరీంనగర్‌ వారు నాగర్‌కర్నూల్, నిజామాబాద్‌ల నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ రికవరీ యాక్టు ద్వారా వారి ఆస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరిస్తున్నారు. వారు ఆస్తులు అమ్ముకోకుండా, వేరేవారి పేరిట బదిలీ చేయకుండా రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు పౌర సరఫరాల కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు.  

బ్యాంక్‌ గ్యారంటీ తీసుకునే ధాన్యం కేటాయింపులు
రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేసి... కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కోసం మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు మూడు నుంచి ఆరు నెలల్లోగా ఆ ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి... వచ్చిన బియ్యాన్ని సీఎంఆర్‌ కింద ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ఇలా ధాన్యం తీసుకున్న చాలా మిల్లులు ఏడాదిన్నర, రెండేళ్లయినా బియ్యం తిరిగివ్వని పరిస్థితి. 2022–23 రబీ సీజన్‌లో మిల్లులకు కేటాయించిన 65 లక్షల టన్నుల ధాన్యంలో... సుమారు 30 లక్షల టన్నులను మిల్లింగ్‌ చేసి, బియ్యాన్ని మార్కెట్లో అమ్మేసుకున్నారు. 

అందులో 25 లక్షల టన్నుల మేర రికవరీ చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం టెండర్లు పిలిచినా ఫలితం లేకుండా పోయింది. ఆ బకాయిల విలువ రూ.7 వేల కోట్లుగా లెక్కగట్టగా.. ఇప్పటివరకు రూ.3 వేల కోట్ల వరకు మాత్రమే రికవరీ అయ్యాయి. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం కేటాయించే ధాన్యానికి సంబంధించి మిల్లర్ల నుంచి కొంత మేర బ్యాంకు గ్యారంటీలు తీసుకుంటోంది. మిల్లులకు వాటికి సామర్థ్యానికి తగిన మేరకే ధాన్యాన్ని కేటాయిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement