క్వింటాల్ సన్న ధాన్యానికి 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు వస్తాయంటూ మిల్లర్ల మెలిక
ఖరీఫ్ సీఎంఆర్‌పై కొత్త ఎత్తుగడ
సాక్షి, హైదరాబాద్: సన్నబియ్యంలో నూకల పేరిట మిల్లర్లు భారీ స్కెచ్ వేశారు. 100 కిలోల సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు వస్తాయని కొత్తరాగం ఎత్తుకున్నారు. నిబంధనల ప్రకారం ఖరీఫ్‌లో 100 కిలోల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం లెక్కన ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది.
ఈసారి కొనుగోలు కేంద్రాలకు సన్న ధాన్యం (సన్నాలు) భారీ ఎత్తున వస్తాయని భావిస్తున్న మిల్లర్లు మిల్లింగ్‌లో చేతివాటం చూపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు రబీలో వచ్చే ధాన్యాన్ని రా రైస్‌గా మిల్లింగ్ చేస్తే నూకల శాతం పెరుగుతుందని చెబుతూ వచ్చిన మిల్లర్లు.. ఈసారి సన్న ధాన్యానికి కూడా ఇదే వంక పెడుతున్నారు. గతంలో ఎన్నడూ ఖరీఫ్ ధాన్యం ఔటర్న్‌పై ఒక్కమాట కూడా మాట్లాడని మిల్లర్లు ఎకాఎకిన 9 కిలోల బియ్యానికి టెండర్ పెడుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సన్నబియ్యం ధర కిలోకు రూ. 50 చొప్పున లెక్క వేసుకున్నా... 9 కిలోలకు రూ. 450 అవుతుంది. క్వింటాల్ సన్న ధాన్యానికి రైతుకు ప్రభుత్వం రూ. 500 బోనస్‌గా ఇవ్వాలని భావిస్తుంటే... మిల్లింగ్ పేరు మీద క్వింటాల్ ధాన్యానికి రూ. 450 విలువైన బియ్యాన్ని ఎగవేసే పన్నాగంలో మిల్లర్లు ఉన్నట్లు అర్థమవుతోంది. 9 కిలోల బియ్యానికి బదులు నూకలు ఇస్తామనడం పట్ల పౌరసరఫరాల శాఖ అధికారులే విస్తుపోతున్నారు.
బ్యాంక్ గ్యారంటీలపైనా తకరారు!
ఖరీఫ్ సీజన్‌లో మిల్లర్లకు ధాన్యం కేటాయింపులో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగానే బ్యాంకు గ్యారంటీలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలలో పొందుపరిచారు కూడా. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించాల్సి ఉండగా, ముసాయిదాతోనే నిలిపివేసి, మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. రైస్‌మిల్లు కెపాసిటీకి అనుగుణంగా కేటాయించిన ధాన్యం విలువలో 25 శాతం మేర బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి.
మిల్లును లీజుకు తీసుకుంటే.. కేటాయించిన ధాన్యం విలువలో 50 శాతం మేర లీజుదారుడు చెల్లించాలి. అయితే ఈ బ్యాంక్ గ్యారంటీ నిబంధనలను మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం అనేది తమకు తలకు మించిన భారమని, మిల్లింగ్ చార్జీలు కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని, ఏపీ వంటి రాష్ట్రాల్లో క్వింటాల్‌కు రూ.100 చెల్లిస్తుంటే మనరాష్ట్రంలో కేవలం రూ. 10 మాత్రమే ఇస్తున్నారని మిల్లర్లు చెబుతున్నారు.
అది కూడా చాలా కాలంగా ఇవ్వడం లేదని వారి ఆరోపణ. ఈ నేపథ్యంలో బ్యాంకు గ్యారంటీలను ఎత్తివేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక సీజన్‌లో సీఎంఆర్ ఇవ్వకుండా డిఫాల్ట్ అయిన మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకొని ధాన్యం కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంటే ఒక సీజన్‌లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లర్లు తాము ఇవ్వాల్సిన బియ్యాన్ని అప్పగించడంతోపాటు అదనంగా 25 శాతం జరిమానా మొత్తానికి బ్యాంక్ గ్యారంటీ ఇస్తే వారికి ధాన్యం కేటాయిస్తారు.
ఇలా ఒక సీజన్‌లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లులు రాష్ట్రంలో 791 ఉన్నట్టు పౌరసరఫరాల సంస్థ తేల్చింది. రెండు, అంతకంటే ఎక్కువ సీజన్లలో డిఫాల్ట్ అయిన మిల్లులకు ఈసారి ధాన్యం కేటాయించమని మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో తేల్చిచెప్పారు. 386 మిల్లులను డిఫాల్ట్ మిల్లులుగా తేల్చడం గమనార్హం. మొత్తానికి బ్యాంకు గ్యారంటీల అంశం కూడా అటకెక్కినట్టేనని పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment