ఆయన వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రానికి చెందిన ఓ రైస్ మిల్లర్.. మరికొందరు మిల్లర్లను జతచేసుకుని ఎఫ్‌సీఐతో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఒప్పందాలు చేసుకుంటున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా సీఎంఆర్ కింద రీసైక్లింగ్ చేస్తు న్నారు. ఆయనకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే బియ్యం డాన్‌గా పేరున్నట్టు ప్రచా రంలో ఉంది. ఆయనకు చెం దిన వాహనాలు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తర లిస్తూ.. గతేడాది జూన్ 26 నుంచి నెల రోజుల వ్యవధిలోనే మూడు సార్లు పట్టుబడ్డాయి. అధికారిక దాడుల్లో 1,013 క్వింటాళ్ల బియ్యం దొరికింది. 2018లో అప్పటి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పానగల్‌లోని సంబంధిత మిల్లులో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. లెక్కలకు మించిన ధాన్యం ఉన్నట్టు గుర్తించి సీఎంఆర్ ఒప్పందాలను రద్దు చేశారు. భవిష్యత్తులోనూ అనుమతులు ఇవ్వొద్దని ఆదేశించారు. కానీ సదరు ‘బియ్యం డాన్’.. తన కుమారుడి పేరుమీద జిల్లా కేంద్రంలో, కొత్తకోట మండలంలో కొన్ని రైస్ మిల్లులను లీజ్‌కు తీసుకుని సీఎంఆర్ ఒప్పం దాలు చేసుకున్నారు. ఎప్పట్లాగే తన సొంత గ్రామంలో నిర్మాణం లోని మిల్లు వద్ద, పానగల్‌లో సీజ్ చేసిన మిల్లు వద్ద రేషన్ బియ్యాన్ని పెద్ద మొత్తంలో రీసైకిల్ చేస్తూ పట్టుబడ్డారు. అయినా అధికారులు 6ఏ కేసులు మాత్రమే నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. ఇంత జరిగినా కొందరు అ«ధికారుల సహకారంతో బినామీ పేర్లతో సీఎంఆర్ ఒప్పందాలు చేసుకుని దందా కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ బియ్యం విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాలంటూ ప్రభుత్వం మిల్లర్లకు అప్పగిస్తే.. మిల్లర్లు బియ్యం తిరిగివ్వకుండా, బయట అమ్ముకుని వ్యాపారం చేసుకుంటున్నారు. 2019–20 ఏడాది యాసంగికి సంబంధించి రూ.400 కోట్ల విలువైన 1.25 లక్షల టన్నుల బియ్యాన్ని ఇప్పటికీ తిరిగి అప్పగించకుండా దందా చేస్తున్నారు.
గట్టిగా ఒత్తిడి తెస్తే.. పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమ మార్గాల్లో సేకరించి, దాన్నే రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి అంటగడుతున్నారు. ఇంత జరుగుతున్నా.. మిల్లర్లను బ్లాక్‌లిస్టులో పెట్టడంగానీ, రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించి వసూలు చేయడంగానీ చేయడం లేదు. కొందరు అధికారులు, మిల్లర్ల అసోసియేషన్ నేతల అండతోనే ఈ వ్యవహారం సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.
గడువు పొడిగించినా చలనమేదీ?
సర్కారు రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపి, బియ్యంగా మార్పించి తిరిగి తీసుకుంటుంది. దీనిని కస్టమ్ మిల్లింగ్ అంటారు. మిల్లర్లు ఒక్కో క్వింటాల్ ధాన్యానికి.. ముడి బియ్యం అయితే 67 కిలోలు, బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లింగ్ చేసినం దుకు ప్రభుత్వం క్వింటాల్‌కు ఇంత అని చార్జీలు చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం పంపిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంతో రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కోసారి ధాన్యం తీసుకుని ఏడాది దాటుతున్నా బియ్యాన్ని తిరిగి పంపడం లేదు.
► 2019–20 యాసంగి సీజన్‌లో ప్రభుత్వం రైతుల నుంచి కొన్న 64.17 లక్షల టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం రైస్ మిల్లర్లకు పంపింది. ఈ మేరకు మిల్లర్లు 43.59 లక్షల టన్నుల బియ్యాన్ని అప్పగించాలి. కానీ 42.34 లక్షల టన్నులే తిరిగి చ్చారు. ఇంకా 1.25 లక్షల టన్నులు రాలేదు. ప్రధానంగా పెద్దపల్లిలో 28,168 టన్నులు, వరంగల్ ఆర్బన్ 19,122, వరంగల్ రూరల్ 12,165, సూర్యాపేట 16,679, మంచిర్యాల 3,386, నిర్మల్ 3,534, నిజామాబాద్ 2,549, మెదక్ 6,853, కరీంనగర్ 4,479, జగిత్యాల 8,184, మహబూబాబాద్ 4,655, జనగాం 2,975, ములుగు 5,969, యాదాద్రి 7,884, వనపర్తి 4,510 గద్వాల జిల్లా నుంచి 2,492 టన్నులు సీఎంఆర్ బియ్యం రావాల్సి ఉంది.
►నిజానికి ఈ బియ్యాన్ని గత ఏడాది అక్టోబర్ నాటికే అప్పగించాల్సి ఉన్నా మిల్లర్ల నుంచి స్పందన లేదు. ఈ విషయంగా గత ఏడాది నవంబర్‌లోనే సమీక్షించిన సీఎస్ సోమేశ్ కుమార్.. డిసెంబర్ నాటికే సీఎంఆర్ ఇవ్వాలని ఆదేశించారు. అయినా ఫలితం రాలేదు. ఇలా నాలుగు మార్లు గడువు పొడిగించినా 1.25 లక్షల టన్నుల బియ్యం పెండింగ్‌లోనే ఉంది. ఆ బియ్యం విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోనే సీఎంఆర్ ఇవ్వని మిల్లులు ఎక్కువగా ఉన్నాయి.
ప్రైవేటు బిజినెస్.. పీడీఎస్‌కు పాలిష్..
కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 45 రోజుల్లోగా బియ్యాన్ని తిరిగి అప్పగించాలి. కానీ రాష్ట్రంలో ఎన్నడూ ఈ గడువులోగా బియ్యం ఇచ్చిన దాఖలాలు లేవు. కనీసం పెంచిన గడువు వరకూ కూడా అంద జేయడం లేదు. దీనికి కారణం సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యంతో మిల్లర్లు ప్రైవేటు వ్యాపారం చేయడమే. కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ధాన్యం సాగు ఎక్కువగా లేకపోవడం, రెండేళ్లుగా దిగుబడి తగ్గడంతో వారంతా తెలంగాణపైనే ఆధారపడ్డారు. మరోవైపు మలేసియా, ఇండోనేషియా, నైజీరియా, శ్రీలంక దేశాలకు మన రాష్ట్రం నుంచే బియ్యం ఎగుమతి అవుతోంది. ఇలా డిమాండ్ ఉండటంతో.. మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యాన్ని బయట మార్కెట్లలో అమ్మేసుకుంటున్నారు. ప్రధానంగా బీపీటీ, హెచ్‌ఎంటీ, జైశ్రీరామ్, తెలంగాణ సోనా రకాలను ఎక్కువగా సాగు చేసే చోట ఈ దందా నడుస్తోంది.
బియ్యం అప్పగించాలని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన సందర్భాల్లో.. మిల్లర్లు పీడీఎస్ బియ్యాన్నే సేకరించి సీఎంఆర్ కింద అప్పగిస్తున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్, నిర్మల్, మహబూబాబాద్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో దళారుల ద్వారా రేషన్ బియ్యాన్ని రూ.8 నుంచి రూ.10 చొప్పున కొంటున్నారు. ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. గత ఏడాది విజిలె¯న్స్ దాడుల్లో చాలా చోట్ల ఈ అక్రమాలను గుర్తించారు. వనపర్తి జిల్లాలో రాజకీయ ఆశీస్సులున్న ఓ రైస్ మిల్లర్‌కు చెందిన మిల్లులో ఏటా రేషన్ బియ్యం పట్టుబడుతోంది. ఇటీవలే అదే రైస్‌మిల్లులో ఏకంగా 500 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. సదరు మిల్లర్ ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మరీ.. వనపర్తితోపాటు పక్క జిల్లాల నుంచీ రేషన్ బియ్యం సేకరిస్తున్నట్టు గుర్తించారు. అయినా సదరు రైస్‌మిల్లుకు మళ్లీ సీఎంఆర్ కింద ధాన్యం కేటాయించడం గమనార్హం. ఇలాంటి మిల్లులు రాష్ట్రంలో 70 నుంచి 80 వరకు ఉన్నట్టు అంచనా.
బ్లాక్ లిస్టులో పెట్టినా..
నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని వరలక్ష్మి రైస్ మిల్లు గడువులోగా సీఎంఆర్ బియ్యం ఇవ్వలేదన్న కారణంగా పౌర సరఫరాల శాఖ దాన్ని బ్లాక్ లిస్టులో పెట్టింది. అయితే నల్లగొండకు చెందిన ఓ వ్యాపారి.. రాజకీయ పలుకుబడితో, పౌర సరఫరాల అధికారుల సాయంతో మిల్లు ఓనర్‌పై ఒత్తిడి తెచ్చి, దానిని కొనేశారు. సదరు మిల్లు ద్వారా అప్పగించాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని ఆయనే ప్రభుత్వానికి అప్పగించారు. ఏదైనా మిల్లును బ్లాక్ లిస్టులో పెడితే.. తర్వాతి సీజన్‌లోనే, యాజమాన్యం మారితేనే సీఎంఆర్ ఇవ్వాలి. కానీ అధికారుల తోడ్పాటుతో.. బ్లాక్ లిస్టులో పెట్టిన సీజన్‌లోనే వరలక్ష్మి మిల్లు ద్వారా సీఎంఆర్ బియ్యం అప్పగించినట్టు లెక్కల్లో చూపారు. అంటే సీఎంఆర్ విషయంలో మిల్లర్లు, అధికారులు ఎలా కలిసిపోయారో అర్థం చేసుకోవచ్చు.
అసోసియేషన్ నాయకుడి అండతోనే..
జగిత్యాల జిల్లాలో గతనెలలో దాదాపు 10 మిల్లులు సీఎంఆర్ ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్టు ఎఫ్‌సీఐ తనిఖీల్లో తేలింది. అయినా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మిల్లర్ల అసోసియేషన్ నాయకుడొకరు అధికార యంత్రాంగాన్ని శాసిస్తున్నాడని, మిల్లులపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారని బహిరంగంగానే చర్చ జరుగుతున్నా అడిగే నాథుడు లేడు. సీఎంఆర్‌కు సంబంధించి ఇటీవల ఎఫ్‌సీఐ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్నారు. దీంతో మిల్లర్లు ఏకంగా ఎఫ్‌సీఐ అధికారులు వేధిస్తున్నారంటూ రివర్సులో ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. నాణ్యత లేని బియ్యాన్ని ఎఫ్‌సీఐకి తరలించినా ఎవరూ అడ్డుచెప్పకుండా, మిల్లర్ల వద్దకు అధికారులెవరూ రాకుండా ముందు జాగ్రత్తగా మిల్లర్లు ఇలా మైండ్‌గేమ్ ఆడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
నో రికవరీ.. నో బ్లాక్‌లిస్ట్..
సీఎంఆర్ బియ్యం తిరిగివ్వడంలో జాప్యం చేస్తున్న మిల్లర్లపై చర్యలే లేకుండా పోయాయి. 2014 నుంచి 2016 వరకు 137 మంది మిల్లర్ల నుంచి 1.20 లక్షల టన్నుల బియ్యం రావాల్సి ఉన్నా.. ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఆ బియ్యం విలువ సుమారు రూ.165 కోట్లు. అయితే అప్పటి పౌర సరఫరాల శాఖ కమిషనర్లు సీవీ ఆనంద్, అకున్ సబర్వాల్ గట్టిగా ఒత్తిడి తెచ్చి.. 30 మంది మిల్లర్ల నుంచి రూ.80 కోట్ల విలువైన బియ్యాన్ని రికవరీ చేశారు.
ఇంకా రూ.85 కోట్ల బియ్యాన్ని రికవరీ చేయాల్సి ఉన్నా పట్టించుకున్నవారు లేరు. కేవలం 80 రైస్ మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టి వదిలేశారు. 2016 తర్వాత సీఎంఆర్ బియ్యం తిరిగివ్వడంతో ఎంత జాప్యం చేస్తున్నా సదరు మిల్లర్ల నుంచి రెవెన్యూ రికవరీ గానీ, బ్లాక్‌లిస్టులో పెట్టడం గానీ జరగడం లేదు. మిల్లర్లు ఎప్పుడిస్తే అప్పుడే అన్నట్టు వ్యవహారం నడుస్తోంది. 2019–20కి సంబంధించి 1.25 లక్షల టన్నుల బియ్యం ఇవ్వని 70 వరకు మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టే అవకాశమున్నా.. పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టడం లేదు.
ఎఫ్‌సీఐ వద్దు..రాష్ట్రమే ముద్దు
మిల్లర్లు సీఎంఆర్ ధాన్యాన్ని మర పట్టించాక.. బియ్యాన్ని ఎఫ్‌సీఐకి డెలివరీ చేస్తారు. ఆ బియ్యానికి సంబంధించిన డబ్బును ఎఫ్‌సీఐ రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు జమచేస్తుంది. తర్వాత ఎఫ్‌సీఐ రాష్ట్రంలో రేషన్ పంపిణీకోసం అవసరమైన బియ్యాన్ని సబ్సిడీ ధరపై పౌర సరఫరాల సంస్థకు ఇస్తుంది. అంటే ప్రభుత్వం కొన్న ధాన్యానికి సంబంధించిన బియ్యం ఎఫ్‌సీఐకి వెళ్లి.. తిరిగి సబ్సిడీ ధరతో పౌరసరఫరాల సంస్థకు వస్తుంది. అయితే ఎఫ్‌సీఐ సీఎంఆర్ బియ్యం నాణ్యత విషయంలో నిబంధనలను ఇటీవల కఠినంగా అమలు చేస్తోంది.
నూకలు, రంగు మారడం వంటివి నిర్ణీత మొత్తానికి ఏమాత్రం ఎక్కువ ఉన్నా.. ఆ బియ్యాన్ని తీసుకోవడం లేదు. నూకలు 25 శాతానికి మించొద్దన్న నిబంధనను ఎఫ్‌సీఐ పక్కాగా అమలు చేస్తుంది. అదే పౌరసరఫరాల సంస్థకు ఇచ్చే బియ్యంలో నూకలు 40– 50 శాతం ఉంటున్నా.. రాళ్లు, మట్టిగడ్డలు, రంగు మారడం వంటివి ఉన్నా అధికారులు పట్టించుకోరు. ఎఫ్‌సీఐకి నాణ్యమైన బియ్యం ఇవ్వడంకంటే.. పౌర సరఫరాల శాఖకు నాణ్యత లేనివి అంటగడితే మిల్లర్లకు రూ.కోట్లలో కలిసొస్తుంది.
►నిజానికి రాష్ట్రంలో రేషన్, మధ్యాహ్న భోజనం అవసరాలకు ఏటా 20 లక్షల టన్నుల బియ్యం అవసరం. కానీ మిల్లర్ల ఒత్తిళ్లకు తలొగ్గి పౌర సరఫరాల సంస్థ అంతకుమించి సేకరిస్తోంది. 2018–19లో ఇలా అదనంగా ఏడెనిమిది లక్షల టన్నులు తీసుకున్నది. అవసరం లేకున్నా తీసుకున్న ఆ బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేయడం, బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపుల్లో జాప్యంతో సర్కారుకు రూ.75 కోట్ల అదనపు భారం పడింది.
►ఇప్పుడు కూడా సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోదాములకు కాకుండా..నేరుగా పౌర సరఫరాల సంస్థ గోదాములకు పంపి, లెక్కల్లో సర్దుబాటు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు పౌర సరఫరాల సంస్థ నుంచే లేఖ రాయించేందుకు మిల్లర్లు ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment