పతంజలి ఉత్పత్తుల తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు
సుప్రీం కోర్టులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్‌పై విచారణ
పతంజలి నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణ మళ్లీ ఫైర్ అయిన ధర్మాసనం
భేషరతు క్షమాపణల అఫిడవిట్లను తోసిపుచ్చిన కోర్టు
ఏప్రిల్ 16న ఆదేశాలు జారీ చేస్తామన్న ధర్మాసనం
ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగం పైన ఆగ్రహం వెల్లగక్కిన సర్వోన్నత న్యాయస్థానం
కరోనిల్ కేంద్రం నివేదికపైనా సుప్రీం అసంతృప్తి
ఢిల్లీ, సాక్షి: కోర్టు ధిక్కరణ కేసులో పతంజలి ఆయుర్వేద నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణపై సుప్రీం కోర్టు మరోసారి మండిపడింది. తామేం అంధులం కాదని, ఈ కేసులో ఉదారంగా ఉండాలని అనుకోవడం లేదంటూ ధ్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో క్షమాపణలు తెలియజేస్తూ పతంజలి నిర్వాహకులిద్దరూ దాఖలు చేసిన అఫిడవిట్లను సైతం కోర్టు బుధవారం తిరస్కరించింది. అంతేకాదు.. తప్పుడు ప్రకటన విషయంలో నిర్లక్ష్యం వహించిన ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగంపైనా సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది.
‘‘వాళ్లు ఏదో పేపర్ మీద మొక్కుబడిగా క్షమాపణలు రాసి మాకు ఇచ్చారు. ఆ క్షమాపణల్ని మేం తిరస్కరిస్తున్నాం. పైగా ఉద్దేశపూర్వక ఉల్లంఘనలుగానే పరిగణిస్తాం’’ అని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఏ అమానుల్లాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ‘ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. నిర్ణీత సమయంలోపు మాకు అఫిడవిట్లు పంపాలన్న ధ్యాసే వాళ్లకు లేనట్లు ఉంది. పైగా రాం దేవ్, బాలకృష్ణలు తమ క్షమాపణలను ముందుగా మీడియాకు తెలియజేశారు. వాళ్లు పబ్లిసిటీనే నమ్ముకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అది చిన్న తప్పా?
ఆ సమయంలో పతంజలి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అఫిడవిట్లలో లోపం ఉందని ధర్మాసనానికి వివరించబోయారు. అయితే ‘లోపం’ అనే మాట చాలా చిన్నదంటూ ధర్మాసనం రోహత్గీకి బదులిచ్చింది. కోర్టు ఆదేశాలు ఇచ్చాక కూడా తప్పులు చేయడం ఏంటని మండిపడింది. ఈ కేసులో తాము ఉదారంగా ఉండాలని అనుకోవట్లేదని బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
అదే సమయంలో ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగం తీరును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ‘‘ ఈ వ్యవహారంలో ఉత్తరాఖండ్ అధికారులు ఏం చేయలేదు. లైసెన్సింగ్ ఇన్‌స్పెక్టర్లు ఎందుకు సక్రమంగా పని చేయలేదు?. ఆ ముగ్గురు అధికారుల్ని ఒకేసారి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది’’ అని బెంచ్ అభిప్రాయపడింది. ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోబోమని, బాధ్యుల్ని చీల్చిచెండాడి తీరతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో కోర్టుకు హాజరు కాకుండా రాందేవ్, బాలకృష్ణ విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేశారని, ఈ కేసులో ఏప్రిల్ 16వ తేదీన ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణ వాయిదా వేసింది.
ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగంపై ఫైర్
పతంజలి ఆయుర్వేద ఔషధాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఉత్తరాఖండ్ డ్రగ్స్ లైసెన్సింగ్ అథారిటీపై సుప్రీం కోర్టు మండిపింది. ‘‘తప్పుడు ప్రకటన విషయంలో.. 2021లోనే కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీకి లేఖ రాసింది. దానికి బదులుగా లైసెన్సింగ్ అథారిటీకి సదరు కంపెనీ బదులిచ్చింది. అయినప్పటికీ అథారిటీ కేవలం హెచ్చరికలతోనే సరిపెట్టింది అని కోర్టు పేర్కొంది. ఇలా ఆరుసార్లు జరిగినా ఉత్తరాఖండ్ అధికార యంత్రాగం మౌనంగా ఉండిపోయిందని, పైగా కేంద్రం లేఖలు రాసినా ఎలాంటి నివేదిక రూపొందించలేదని కోర్టు గుర్తు చేసింది. కాబట్టే, ఆ అధికారుల్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
ఆ సమయంలో కోర్టుకు హాజరైన ఉత్తరాఖండ్ ఫుండ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ మిథిలేష్ కుమార్ రెండు చేతులు జోడించి ధర్మాసనం ఎదుట క్షమాపణలు చెప్పారు. తాను 2023లో బాధ్యతలు స్వీకరించానని, అంతకుముందే ఇది జరిగిందని, తనను వదిలేయాలంటూ ఆయన కోర్టుకు వివరించారు. అయితే కోర్టు మాత్రం కనికరించలేదు. ఆ మందులు తీసుకున్న అమాయకుల పరిస్థితి ఏంటంటూ కోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ సమయంలో చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలపగా.. చర్యలు ఇప్పుడు తీసుకున్నారా? అంటూ జస్టిస్ హిమా కోహ్లీ పెదవి విరిచారు. దీంతో క్షమాపణలు తెలిపిన ఆయన.. కఠిన తీసుకుంటామంటూ కోర్టుకు స్పష్టం చేశారు.
ఎట్టకేలకు అఫిడవిట్లు..
ఇదిలా ఉంటే.. పతంజలి నుంచి తప్పుడు ప్రకటన వ్యవహారంలో సుప్రీం కోర్టు గతంలోనే ఈ ఇద్దరు నిర్వాహకుల్ని హెచ్చరించింది. దీంతో.. చట్టం, వాణిజ్య ప్రకటనలు, మార్కెట్ నిబంధనలను ఇకపై ఉల్లంఘించబోమంటూ సర్వోన్నత న్యాయస్థానానికి గత ఏడాది నవంబరు 21న పతంజలి తరఫున వీరు ప్రమాణ పత్రం సమర్పించారు. అయినప్పటికీ ఆ హామీలను పాటించకపోవడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం గత వారం వారిద్దరిపై కోర్టు ధిక్కారం కింద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ బేషరతుగా క్షమాపణలు తెలిపారు. ప్రమాణ పత్రం ఉల్లంఘనలపై చిత్తశుద్ధితో విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోసారి ఈ పొరపాటును పునరావృతం కానివ్వబోమని వాగ్దానం చేశారు. దీనికిగాను వారిద్దరూ విడివిడిగా మంగళవారం సాయంత్రం అఫిడవిట్లు దాఖలు చేశారు. అదే సమయంలో.. ప్రజలను తప్పుదోవ పట్టించే పతంజలి ప్రకటనల కేసులో కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అల్లోపతి ఔషధాల ప్రభావశీలతను తక్కువ చేసినందుకుగానూ పతంజలి ఆయుర్వేద సంస్థ తీరును ఆ అఫిడవిట్‌లో కేంద్రం తప్పుబట్టింది. పైగా కరోనాను తగ్గిస్తుందంటూ కరోనిల్ పేరిట పతంజలి చేసిన ప్రచారంపై సంస్థను అప్పట్లోనే హెచ్చరించినట్లు వెల్లడించింది. అయితే ఈ నివేదికపైనా సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
IMA పిటిషన్..
తమ ఉత్పత్తుల వల్ల కొన్ని వ్యాధులు నయం అవుతాయంటూ పతంజలి కంపెనీ కొన్ని ప్రకటనలు ఇస్తూ వచ్చింది. ఈ ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కిందటి ఏడాది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కోర్టులో కేసు వేసింది. ఆ ప్రకటనలు డాక్టర్లను కించపరిచేలా ఉన్నాయంటూ పేర్కొంది. ఈ పిటీషన్ పైనే ధర్మాసనం విచారణ జరిపింది.
గత విచారణల్లో..
ఆధునిక అలోపతి వైద్యాన్ని, ఆ విధానాన్ని అనుసరించే డాక్టర్లను కించపరిచేలా..నిరాధార ఆరోపణలు చేస్తున్న పతంజలి ఆయుర్వేద సంస్థ ఉత్పత్తులను, ఆ ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని సుప్రీం కోర్టు గత విచారణల్లో ఆదేశించింది. ఆ సమయంలో ఆ ఆయుర్వేద సంస్థ చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకునే మార్గాన్ని కనిపెట్టాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలోనే కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కళ్లు మూసుకుని ఉందంటూ కేంద్రంపై మండిపడింది సర్వోన్నత న్యాయస్థానం.
Comments
Please login to add a commentAdd a comment