పతంజలి ఉత్పత్తుల తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు
సుప్రీం కోర్టులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్‌పై విచారణ
మంగళవారం కోర్టుకు హాజరైన పతంజలి నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణ
భేషరతు క్షమాపణలను తోసిపుచ్చిన కోర్టు
చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ వ్యాఖ్య
ఏప్రిల్ 10కి విచారణ వాయిదా.. ఆరోజూ హాజరుకావాలంటూ ఆదేశాలు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల తప్పుడు ప్రకటన కేసులో ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌పై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహం వెల్లగక్కింది. ఈసారి కోర్టుకు హాజరైన ఆయనపై నేరుగానే మండిపడింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ సందర్భంలో బేషరతుగా ఆయన చెప్పిన క్షమాపణలను సైతం కోర్టు తోసిపుచ్చింది.
పతంజలి కేసులో తమ ఆదేశాల్ని పాటించడం లేదంటూ రాందేవ్ బాబాతో పాటు ఆయన అనుచరుడు బాలకృష్ణపై కోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో మంగళవారం ఈ ఇద్దరు కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘చర్యలకు సిద్ధంగా ఉండండి.. మరోసారి కోర్టుకు రండి’ అంటూ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లాలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ఈ వ్యవహారంలో కిందటి నెలలో పతంజలి తరఫున వాళ్లు చెప్పిన బేషరతు క్షమాణలను సైతం కోర్టు తోసిపుచ్చింది.
‘‘మీ వివరణతో మేం సంతృప్తి చెందలేదు. మీ క్షమాపణల్ని మేం అంగీకరించం’’ అని న్యాయమూర్తులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే వ్యక్తిగతంగా ఆ ఇద్దరు కోర్టుకు హాజరయ్యారని.. ఇక్కడి నుంచే క్షమాపణలు చెబుతున్నారని.. కోర్టు ఏం ఆదేశిస్తే దానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారని.. వాళ్ల తరఫు లాయర్ చేతులు జోడించి మరీ బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. అయినా కూడా చర్యలు తప్పవని కోర్టు స్పష్టం చేస్తూ విచారణ ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
‘‘కోర్టు ఆదేశించినా కూడా మీరు అదే ప్రకటనలు ఇచ్చారంటే ఎంత ధైర్యం?. అసలు ఆ ప్రకటనల్లో శాశ్వత ఉపశమనం అన్నారు. అంటే దానర్థం ఏంటి?.. పూర్తిగా వ్యాధిని నయం చేస్తారనా?..’’ అని కోర్టు పతంజలి నిర్వాహకులిద్దరినీ ప్రశ్నించింది. అఫిడవిట్‌లో వీరు ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. వారం రోజుల్లోగా మళ్లీ కొత్త అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచించింది.
మరోవైపు పతంజలి తప్పుడు ప్రకటనల వ్యవహారంలో కళ్లు మూసుకుని కూర్చుందంటూ గత విచారణలో(ఫిబ్రవరి 27న) కేంద్రంపైనా సుప్రీం కోర్టు మండిపడింది. బాబా
పతంజలి స్పందన లేకపోవడంతో..
రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థకు గతంలోనే పలుమార్లు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. హెర్బల్ ఉత్పత్తులపై మోసపూరిత ప్రకటనలు చేస్తే ఒక్కొక్క ఉత్పత్తిపై భారీ జరిమానా తప్పదని తెలిపింది. కంపెనీ చేస్తున్న నిరాధారమైన, మోసపూరితమైన ప్రకటనలను ఆపివేయాలని, లేకపోతే ఆ సంస్థ తయారు చేసే ఒక్కో ఉత్పత్తిపై కోటి రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని తీవ్రంగా హెచ్చరించింది. అంతేకాదు..ఆ యాడ్స్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది కూడా. ఈ క్రమంలో.. జారీ చేసినా నోటీసులకు పతంజలి స్పందించలేదు.
ఆపై విచారణలో.. ‘మీ ప్రతిస్పందన ఎందుకు దాఖలు చేయలేదు..?’ అని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణ సమయంలో వారిద్దరు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దానిలో భాగంగా ఇటీవల పతంజలి సంస్థ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయవ్యవస్థ పట్ల అత్యంత గౌరవం ఉందని వ్యాఖ్యానిస్తూ.. క్షమాపణలు తెలియజేసింది. తాజాగా వారు కోర్టు ముందుకు వచ్చారు.
IMA పిటిషన్..
తమ ఉత్పత్తుల వల్ల కొన్ని వ్యాధులు నయం అవుతాయంటూ పతంజలి కంపెనీ కొన్ని ప్రకటనలు ఇస్తూ వచ్చింది. ఈ ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కిందటి ఏడాది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కోర్టులో కేసు వేసింది. ఆ ప్రకటనలు డాక్టర్లను కించపరిచేలా ఉన్నాయంటూ పేర్కొంది. ఈ పిటీషన్ పైనే ధర్మాసనం విచారణ జరిపింది.
గత విచారణల్లో..
ఆధునిక అలోపతి వైద్యాన్ని, ఆ విధానాన్ని అనుసరించే డాక్టర్లను కించపరిచేలా..నిరాధార ఆరోపణలు చేస్తున్న పతంజలి ఆయుర్వేద సంస్థ ఉత్పత్తులను, ఆ ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని సుప్రీం కోర్టు గత విచారణల్లో ఆదేశించింది. పతంజలి సంస్థ కూడా డాక్టర్లను కించపరిచేలా వ్యవహరించటం సరికాదని పేర్కొంది. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఇలాంటి ప్రకటనలు చేయవద్దని పతంజలి సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు.. ఆ ఆయుర్వేద సంస్థ చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకునే మార్గాన్ని కనిపెట్టాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలోనే కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment