
ఢిల్లీ: లైసెన్స్ రద్దు అయిన 14 రకాల ఉత్పత్తుల అమ్మకాలను ఆపేశామని పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సుప్రీం కోర్టుకు వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్తరఖండ్ ప్రభుత్వం పతంజలి ఉత్పత్తుల లైసెన్స్‌లు రద్దు చేసిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 5,606 ఫ్రాంచైజీ స్టోర్లకు 14 ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పతంజలి మంగళవారం సుప్రీంకోర్టుకు అఫిడవిడ్ సమర్పించింది. ఈ ఉత్పత్తులను వెనక్కి పంపించాలని స్టోర్లకు సూచించినట్లు చెప్పింది. అదేవిధంగా లైసెన్స్ రద్దు అయిన ఈ 14 ఉత్పత్తులకు సంబంధించి ప్రకటనలు సైతం నిలిపివేయాలని పలు మీడియా సంస్థలకు తెలిపామని పతంజలి అఫిడవిట్‌లో పేర్కొంది.
ఇక.. తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సంస్థ సుప్రీంకోర్టు విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పతంజలి నకిలీ ప్రకటనల కేసు విషయంలో బాబా రాందేవ్, బాలకృష్ణ చెప్పిన క్షమాపణలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. తప్పుదోవ పట్టించేలా పతంజలి వాణిజ్య ప్రకటనలు ఇచ్చిందని నిర్ధరణ కావటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ సంస్థపై చర్యలు తీసుకుంది.
అందులో భాగంగా ఈ సంస్థకు సంబంధించిన 14 రకాల ఉత్పత్తుల తయారీ లైసెన్సును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం లైసెన్స్ రద్దుచేసిన 14 రకాల తమ ఉత్పత్తుల అమ్మకాల నిలిపి వేసినట్లు పతంజలి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment