ఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో పతంజలి ఆయుర్వేద నిర్వాకులు బాబా రాందేవ్, బాలకృష్ణపై సుప్రీం కోర్టు మరోసారి మండిపడింది. బాబా రాందేవ్ అంత అమాయకుడు ఏం కాదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రాందేవ్ బాబాది బాధ్యత రాహిత్యమైన ప్రవర్తన అని సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పు పట్టింది. పతంజలి ఆయుర్వేద ఔషధాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసును మంగళవారం జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ ఏ అమానుల్లాతో కూడిన సుప్రీకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. బాబా రాందేవ్, బాలకృష్ణ ఇద్దరూ సుప్రీకోర్టు విచారణకు భౌతికంగా హాజరయ్యారు.
‘మేము చేసిన తప్పిదాలకు బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఆ సమయంలో మేము చేసింది సరైంది కాదు. మేము చేసిన తప్పును భవిష్యత్తులో కూడా మళ్లీ జగరకుండా గుర్తు పెట్టుకుంటాం’ అని బాబా రాందేవ్ కోర్టుకు విన్నవించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది. మీరు ఏమి చేసినా.. అది మీ బాధ్యత మాత్రమే. మా ఆదేశాలను అనుసరించి క్షమాపణలు చెప్పారు. నయం చేయలేని వ్యాధుల గురించి ప్రచారం చేయలేరని మీకు తెలియదా?’ అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
దానికి రాందేవ్ స్పందిస్తూ.. తాము అనే పరీక్షలు చేశామని కోర్టుకు తెలిపారు. ‘మీది చాలా బాధ్యత రాహిత్యమైన ప్రవర్తన. మీ క్షమాపణలు ఆమోదించాలా? వద్దా? అనే అంశంపై మేము ఆలోచిస్తాం. మీరు పదేపదే మా ఆదేశాలు ఉల్లంఘించారు’ అని జస్టిస్ హిమా కోహ్లి సీరియస్ అయ్యారు. ‘మీ క్షమాపక్షణలు హృదయం నుంచి రావటం లేదు’ అని మరో న్యామమూర్తి జస్టిస్ ఏ అమానుల్లా అన్నారు. ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం ఏప్రిల్ 23కు వాయిదా వేసింది.
చదవండి: మేమేం గుడ్డివాళ్లం కాదు.. బాబా రాందేవ్‌పై మళ్లీ సుప్రీంకోర్టు ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment