న్యూఢిల్లీ, సాక్షి: తప్పుదోవ పట్టించే ప్రకటనలు.. తదనంతర కోర్టు ధిక్కారణ పరిణామాల వ్యవహారంలో పతంజలి ఆయుర్వేద్ తీరును తప్పుబట్టడంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ఈ క్రమంలో మంగళవారం విచారణలోనూ ఆ కంపెనీ నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణలపై సుప్రీం కోర్టు మండిపడింది. పేపర్‌లో క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇచ్చినా కూడా.. కోర్టు వాళ్లను వదలకపోవడం విశేషం.
‘‘ఇవాళ్టి న్యూస్‌పేపర్‌లో ఇచ్చిన క్షమాపణల ప్రకటన.. గతంలో పతంజలి ఉత్పత్తుల కోసం ఇచ్చిన ఫుల్‌పేజీ ప్రకటనల మాదిరే ఉన్నాయా?.. ఆ క్షమాపణల తాలుకా అక్షరాల సైజు కూడా ప్రకటనలప్పుడు ఇచ్చిన సైజులోనే ఉన్నాయా?’’ అంటూ ద్విసభ్య ధర్మాసనం పతంజలి ఆయుర్వేద్ నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణలను ప్రశ్నించింది. అయితే.. క్షమాపణల కోసం పతంజలి లక్షలు వెచ్చిందని, సమారు రూ.10 లక్షల ఖర్చుతో 67 పత్రికల్లో ఈ ప్రకటన ఇచ్చిందని పతంజలి తరఫు న్యాయవాది రోహత్గీ కోర్టుకు తెలియజేశారు.
అలాంటప్పుడు.. గతంలో ఇచ్చిన ప్రకటనల మాదిరే ఈ క్షమాపణల ప్రకటన ఉందా? అని జస్టిస్ హిమా కోహ్లీ, పతంజలి న్యాయవాదిని ప్రశ్నించారు. ప్రకటనల కోసం పతంజలి భారీగా ఖర్చు చేసిందని రోహత్గీ చెప్పగా.. దానివల్ల మాకొచ్చిన ఇబ్బందేం లేదంటూ బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
మరోవైపు పతంజలిపై కేసు వ్యవహారంలో ఇండియన్ మెడికల్ అసోషియేషన్‌కు రూ.100 కోట్ల జరిమానా విధించాలంటూ ఒక విజ్ఞప్తి వచ్చిందని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీనిపై అనుమానాలున్నాయని బెంచ్ పేర్కొంది. అయితే ఆ అభ్యర్థనతో తమ క్లయింట్లకు ఎలాంటి సంబంధం లేదని న్యాయవాది రోహత్గి కోర్టుకు వివరణ ఇచ్చారు. మరోవైపు పత్రికల్లో క్షమాపణలు మరింత పెద్ద సైజులో ప్రకటనలుగా ఇస్తామని రాం దేవ్ చెప్పడంతో ఈ కేసు విచారణను మరో వారం వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
ఇదిలా ఉంటే.. డయాబెటిస్, బీపీ లాంటి వ్యాధులను తమ కంపెనీ ఉత్పత్తులు నయం చేస్తాయని పతంజలి ఆయుర్వేద్ గతంలో ప్రకటనలు ఇచ్చుకుంది. అయితే ఆ తప్పుడు ప్రకటనల కేసులో ఇవాళ విచారణ ఉండగా, పతంజలి ఆయుర్వేద్ దేశవ్యాప్తంగా పలు ప్రముఖ జాతీయ దినపత్రికల్లో క్షమాపణలు చెబుతూ ప్రకటన ఇచ్చింది. కోర్టును తాము ఎప్పుడూ గౌరవిస్తామని, తప్పులు మరోసారి చేయబోమంటూ అందులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment