Patanjali Ayurved Limited
-
లైసెన్స్ రద్దైన 14 ఉత్పతుల అమ్మకాలు నిలిపేశాం: పతంజలి
ఢిల్లీ: లైసెన్స్ రద్దు అయిన 14 రకాల ఉత్పత్తుల అమ్మకాలను ఆపేశామని పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సుప్రీం కోర్టుకు వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్తరఖండ్ ప్రభుత్వం పతంజలి ఉత్పత్తుల లైసెన్స్‌లు రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 5,606 ఫ్రాంచైజీ స్టోర్లకు 14 ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పతంజలి మంగళవారం సుప్రీంకోర్టుకు అఫిడవిడ్ సమర్పించింది. ఈ ఉత్పత్తులను వెనక్కి పంపించాలని స్టోర్లకు సూచించినట్లు చెప్పింది. అదేవిధంగా లైసెన్స్ రద్దు అయిన ఈ 14 ఉత్పత్తులకు సంబంధించి ప్రకటనలు సైతం నిలిపివేయాలని పలు మీడియా సంస్థలకు తెలిపామని పతంజలి అఫిడవిట్లో పేర్కొంది.ఇక.. తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సంస్థ సుప్రీంకోర్టు విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పతంజలి నకిలీ ప్రకటనల కేసు విషయంలో బాబా రాందేవ్, బాలకృష్ణ చెప్పిన క్షమాపణలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. తప్పుదోవ పట్టించేలా పతంజలి వాణిజ్య ప్రకటనలు ఇచ్చిందని నిర్ధరణ కావటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ సంస్థపై చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఈ సంస్థకు సంబంధించిన 14 రకాల ఉత్పత్తుల తయారీ లైసెన్సును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం లైసెన్స్ రద్దుచేసిన 14 రకాల తమ ఉత్పత్తుల అమ్మకాల నిలిపి వేసినట్లు పతంజలి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. -
నాటి అడ్వర్టైజ్మెంట్ల సైజులోనే క్షమాపణల యాడ్స్ వేశారా?
న్యూఢిల్లీ: కరోనా విలయకాలంలో అల్లోపతి వంటి ఆధునిక వైద్యవిధానాలను తప్పుబడుతూ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఇచ్చిన తప్పుడు అడ్వర్టైజ్మెంట్లు, ప్రకటనల కేసులో బాబా రాందేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పినా సర్వోన్నత న్యాయస్థానం వారిని వదిలిపెట్టలేదు. ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం రాందేవ్, బాలకృష్ణ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు హాజరయ్యారు. రూ.10 లక్షలు ఖర్చుపెట్టి సోమవారం 67 వార్తాపత్రికల్లో క్షమాపణల యాడ్ ఇచ్చామని కోర్టుకు తెలిపారు. ‘‘ ఆనాడు అల్లోపతిని కించపరుస్తూ, పతంజలి ఉత్పత్తులు అద్భుతమంటూ ఇచ్చిన ఫుల్‌పేజీ యాడ్ల స్థాయిలోనే ఈ యాడ్లను ప్రముఖంగా ప్రచురించారా?. అదే ఫాంట్ సైజులో అంతే పరిమాణంలో ప్రకటన ఇచ్చారా?’ అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. ‘ మా క్లయింట్లు యాడ్స్ కోసం లక్షలు వెచ్చించారు’ అని రోహత్గీ చెప్పారు. ‘ ఖర్చు ఎంతయింది అనేది మాకు అనవసరం’ అని జడ్జి అసహనం వ్యక్తంచేశారు. ‘గతంలో క్షమాపణల యాడ్స్ ఇవ్వాలని ఆదేశిస్తే ఈరోజు కోర్టు విచారణ ఉందనగా నిన్న ఎందుకు యాడ్ ఇచ్చారు?. ఈ కేసులో పతంజలికి ప్రతివాదిగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌పై రూ.100 కోట్ల పరువునష్టం దావా ఒకటి దాఖలైంది. ఆ దావాతో మీకేమైనా సంబంధం ఉందా?’ అని జడ్జి అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ తన క్లయింట్లకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. ఈసారి పెద్ద సైజులో క్షమాపణ ప్రకటనలు ఇస్తాం’’ అని రోహత్గీ చెప్పారు. దీంతో సోమవారం నాటి ప్రకటనల వివరాలను రెండ్రోజుల్లోపు సమర్పించాలని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాహ్ల ధర్మాసనం ఆదేశించింది. ఇలాగే తప్పుడు ప్రకటనలు ఇస్తున్న ఫాస్ట్‌మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని సంబంధింత మూడు కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలను కోర్టు ఆదేశించింది. ‘‘ ఈ కంపెనీల తప్పుడు ప్రకటనలు వల్లే ఆయా సంస్థల ఉత్పత్తులను చిన్నారులు, పాఠశాల స్థాయి విద్యార్థులు, వృద్ధులు విరివిగా వినియోగిస్తున్నారు’ అని కోర్టు ఆవేదన వ్యక్తంచేసింది. -
రామ్‌దేవ్ బాబాకు భారీ షాక్: నేపాల్ కూడా
సాక్షి, న్యూఢిల్లీ: యోగా గురువు, పతాంజలి సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబాకు భారీ షాక్ తగిలింది. కరోనా వైరస్ సోకకుండా తీసుకువచ్చిన కరోనిల్ మందును భూటాన్ నిలిపివేయగా.. తాజాగా నేపాల్ ఆ మందును వాడకూడదని ఆదేశించింది. భూటాన్ గతంలోనే కరోనిల్‌పై నిషేధం విధించింది. తాజాగా నేపాల్ సోమవారం ఆ మందుల పంపిణీని నిలిపివేసింది. రామ్‌దేవ్ బాబా బహుమతిగా అందించిన 1,500 కరోనిల్ కిట్లను వాడకూడదని నిర్ణయించింది. ఎందుకుంటే కరోనా వైరస్‌ను ఎదుర్కోనవడంలో కరోనిల్ విఫలం చెందిందని గుర్తించింది. ఈ మేరకు ఆ దేశ ఆయుర్వేద మంత్రిత్వ శాఖ కరోనిల్ మందును నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కరోనిల్ కిట్‌లో ఉన్న ట్యాబ్లెట్లు, నూనె కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో విఫలం పొందినట్లు పేర్కొంది. దీంతో ఆ కిట్‌ను పంపిణీ చేయడం నిలిపివేసింది. కరోనిల్‌కు ప్రత్యామ్నాయ మందులకు నేపాల్ ప్రభుత్వం ఆర్డర్లు చేసింది. కరోనిల్ కిట్‌ను పతాంజలి సంస్థ రూపొందించింది. ఈ మందును 2020 జూన్ 23వ తేదీన విడుదల చేశారు. ఈ మందు కరోనా కట్టడిలో విఫలం చెందిందని పలు సర్వేలు వెల్లడించాయి. దీంతో ఆ మందుకు డిమాండ్ లేకుండాపోయింది. అయితే పతాంజలి సంస్థ మాత్రం తమ కరోనిల్ కిట్‌ను లక్షల్లో విక్రయించినట్లు తెలిపింది. చదవండి: పతంజలి ‘కరోనిల్’తో ఉపయోగం నిల్ చదవండి: రామ్‌దేవ్ వ్యాఖ్యలు: దేశవ్యాప్తంగా వైద్యుల బ్లాక్ డే -
కరోనా ఔషధం : పతంజలి కొత్త ట్విస్టు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా నివారణకు పతంజలి ఆయుర్వేద ఔషధంలో మరో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. కోవిడ్-19 క్లినికల్ ట్రయల్‌కు సంబంధించిన అన్ని పత్రాలను ఆయుష్ మంత్రిత్వ శాఖతో పంచుకున్నామని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ప్రకటించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖకు, పతంజలికి మధ్య అభిప్రాయ భేదాలు లేవంటూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ మందులు కరోనా నివారణకు పనిచేస్తాయని ఎప్పుడూ పేర్కొనలేదని పతంజలి సీఈవో బాలకృష్ణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే తాజా పరిణామం చోటు చేసుకోవడం విశేషం. (పతంజలి కరోనా మందుకు బ్రేక్!) కరోనా కిట్‌లో "దివ్య స్వసరి వతి", "దివ్య కొరోనిల్ టాబ్లెట్", "దివ్య అను తైల్" అనే ఔషధాలను భారతదేశం అంతటా తయారు చేసి పంపిణీ చేయడానికి మంత్రిత్వ శాఖ అనుమతి ఉందని పతంజలి తాజాగా ప్రకటించింది. తమ ఔషధానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్ పత్రాలను ఆయుష్, భారత ప్రభుత్వంతో పంచుకున్నట్లు పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ తెలిపింది. కోవిడ్-19 నిర్వహణపై తగిన విధంగా పనిచేసిందని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టంగా అంగీకరించిందని ప్రకటించింది. ఈ ఔషధాన్ని తీసుకున్న కరోనా రోగులు 3 రోజుల్లో 67 శాతం, 7 రోజుల చికిత్స అనంతరం 100 శాతం కోలుకున్నారని పునరుద్ఘాటించింది. అలా మొత్తం 45 మందికి తమ చికిత్స అనంతరం కరోనా నెగిటివ్ ఫలితం వచ్చిందని తెలిపింది. (మాట మార్చిన ‘పతంజలి’.. అది కోవిడ్ మందు కాదు!) కాగా ఆయుర్వేద కంపెనీ పతంజలి కరోనా మహమ్మారికి కరోనిల్ కిట్ పేరుతో ఆయుర్వేద మందు కనుగొన్నామంటూ సంచలన ప్రకటన చేసింది. దీనిపై స్పందించిన కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పూర్తి వివరాలను ప్రకటించాలని నిర్వాహకులకు నోటీసులు లిచ్చింది. దీంతో పతంజలి ఆయుర్వేద మందుపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. Patanjali claims that "#COVID19 patients group that received its medicines, showed 67% recovery in 3 days & 100% recovery in 7 days of treatment, that is, all 45 patients became COVID negative"; says all clinical trial documents have been shared with AYUSH Ministry. pic.twitter.com/jSMTxCwLp8 — ANI (@ANI) July 1, 2020 -
కరోనాకు మందు కనిపెట్టలేదు: పతంజలి
డెహ్రాడూన్: మహమ్మారి కరోనాకు మందు కనుగొన్నామంటూ సంచలన ప్రకటన చేసిన ఆయుర్వేద కంపెనీ పతంజలి నిర్వాహకులు తాజాగా యూటర్న్ తీసుకున్నారు. తాము కరోనా నివారణకు ఎలాంటి మెడిసిన్ తయారు చేయలేదంటూ మాట మార్చారు. ‘కరోనా కిట్’ పేరిట ఎలాంటి అమ్మకాలు చేపట్టలేదని మంగళవారం వివరణ ఇచ్చారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రాణాంతక కోవిడ్-19ను కట్టడి చేసేందుకు కరోలిన్ అనే మందును కనిపెట్టినట్లు పతంజలి కంపెనీ గత మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. యోగా గురువు రాందేవ్ బాబా పతంజలి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్(పతంజలి ప్రధాన కేంద్రం)లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేగాక కరోనా లక్షణాలు కలిగి ఉన్న వంద మంది రోగులపై ఈ మందును ప్రయోగించగా, వారిలో దాదాపు 65 మంది పూర్తిగా కోలుకున్నారని పతంజలి కంపెనీ పేర్కొంది.(పతంజలి ‘కరోలిన్’పై పెను దుమారం) ఈ క్రమంలో పతంజలి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారంటూ రాందేవ్ బాబా, పతంజలి చైర్మన్ బాలకృష్ణపై పలువురు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కరోనిల్ ప్రకటనలను భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ విషయంపై స్పందించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. కరోనా నిరోధక మందుల తయారీకి పతంజలి కంపెనీ ఎలాంటి లైసెన్స్‌లు తీసుకోలేదని, దగ్గు నివారణ మందనుకొనే తాము కరోలిన్ మందుకు అనుమతించామని పేర్కొంది. ఈ క్రమంలో కరోలిన్ మందుపై వివరణ ఇవ్వాల్సిందిగా.. ఉత్తరాఖండ్ డ్రగ్ డిపార్ట్మెంట్ పతంజలి సంస్థకు నోటీసులు జారీచేసింది.(మార్కెట్లోకి కరోనా ఔషధం..!) ఈ విషయంపై మంగళవారం స్పందించిన కంపెనీ.. ‘‘‘కరోనా కిట్’ పేరును ఎక్కడా వాడటం లేదు. మందును తయారు చేయలేదు. దివ్య స్వసారి వతి, దివ్య కరోనిల్ టాబ్లెట్, దివ్య అను టేల్ అనే మెడిసిన్‌తో కూడిన ప్యాకేజీ మాత్రమే షిప్పింగ్ చేస్తున్నాం. కరోనిల్ కిట్ అనే కిట్‌ను విక్రయించడం లేదు. అంతేకాదు.. అది కరోనా చికిత్సకు ఉపయోగపడుతుందని కూడా ఎలాంటి పబ్లిసిటీ చేయలేదు. కేవలం ఈ మందులకు సంబంధించిన ప్రయోగం విజయవంతమైన విషయాన్ని మాత్రమే మీడియా ముందు తెలిపాం. కేవలం ఈ ఔషధం చేకూర్చే ప్రయోజనాల గురించి మాత్రమే వెల్లడించాం. మనుషులపై ప్రయోగించినపుడు సత్ఫలితాలు ఇచ్చిందనే చెప్పామే తప్ప.. ఇది కరోనాను నయం చేస్తుందని ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు’’ అని పేర్కొంది. అయితే అది దగ్గు మందా లేదా మరే ఇతర ఔషధమా అన్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. -
పతంజలి ‘కరోలిన్’పై పెను దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారికి మందు కనుగొన్నామని యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద కంపెనీ ప్రకటించడం, తాము కనిపెట్టిన ‘కరోలిన్’ మందు వల్ల కలిగే ప్రయోజనాల గురించి రాందేవ్ బాబా హరిద్వార్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ చెప్పడంపై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. కరోనా మహమ్మారికి సంబంధించి ప్రయోగాలు జరపాలన్నా, మందులు విడుదల చేయాలన్నా ముందుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరంటూ ఏప్రిల్ 11వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఓ నోటీసును జారీ చేసింది. (రాందేవ్ బాబా కరోనా డ్రగ్‌కు ‘మహా’ షాక్) ఇదే విషయమై కేంద్ర ఆయుష్ శాఖను మీడియా సంప్రతించగా, కరోనా మందులకు సంబంధించి పతంజలి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేసింది. అయితే పతంజలి కంపెనీ కరోనాకు మందు కనిపెట్టిన విషయంగానీ, దాని విడుదలకు సంబంధించి వాణిజ్య ప్రకటనలు చేసిన విషయంగానీ తమ దృష్టికి రాలేదని ఆరోగ్య శాఖ అమాయకత్వం ప్రదర్శించింది. కరోనా (కోవిడ్–10) నిరోధక మందుల తయారీకి పతంజలి కంపెనీ ఎలాంటి లైసెన్స్‌లు తీసుకోలేదని, రోగ నియంత్రణ శక్తికి, దగ్గు నివారణ మందులకు లైసెన్స్ తీసుకుందని కరోలిన్ మందుల విక్రయానికి అనుమతించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దగ్గు నివారణ మందనుకొనే తాము కరోలిన్ మందుకు అనుమతించామని ఆ ప్రభుత్వం తెలిపింది. కరోలిన్ మందుకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు పరిశీలించి పతంజలి కంపెనీకి నోటీసులు జారీ చేస్తామంది. మహారాష్ట్ర ప్రభుత్వమైతే కరోలిన్ మందులను రాష్ట్రంలోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. (ఆవనూనె, నిమ్మకాయతో కరోనాకు చెక్) ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన డ్రగ్ నియంత్రణ సంస్థ ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్’ ఇప్పటివరకు స్పందించక పోవడం ఆశ్చర్యంగా ఉంది. కరోలిన్ మందు అమ్మకాలను నిషేధిస్తూ తక్షణం ఉత్తర్వులు జారీ చేయాల్సిన డ్రగ్స్ నియంత్రణ సంస్థ మౌనం పాటించడం అర్థరహితం. అమెరికా, యూరప్ దేశాల్లో లైసెన్స్ నిబంధనలను మందుల కంపెనీలు ఉల్లంఘించినట్లయితే వేల కోట్ల రూపాయల జరిమానాలు విధించడమే కాకుండా ఆ కంపెనీ లైసెన్స్లన్నింటిని రద్దు చేస్తారు. విదేశీ చట్టాలను పక్కన పెడితే కరోనా మందులకు సంబంధించి ఎవైరైనా, ఏ సంస్థ అయినా సాధారణ ప్రకటనలుగానీ, వాణిజ్య ప్రకటనలుగానీ విడుదల చేసినట్లయితే ‘నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్’ కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఏప్రిల్‌లో విడుదల చేసిన తన స్టేట్మెంట్లో ఆయూష్ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ చట్టాన్ని ఇప్పటి వరకు పలువురు జర్నలిస్టుల మీద కూడా ప్రయోగించింది. పతంజలి తన కరోలిన్ మందుకు సంబంధించి వాణిజ్య ప్రకటనలు చేస్తున్నా, రాందేవ్ బాబా టీవీల్లో స్వయంగా ఇంటర్వ్యూలు ఇస్తూ చెబుతున్నా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం పట్ల విమర్శకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన నిబంధనలను పక్కన పెట్టినా ‘కరోలిన్’ మందుకు సంబంధించి పతంజలి కంపెనీ నిర్వహించిన ట్రయల్స్ నమ్మశక్యంగా లేవు. కరోనా లక్షణాలు స్వల్పంగా, ఓ మోస్తారుగా ఉన్న వంద మంది రోగులపై కరోలిన్ మందును ప్రయోగించామని, వారిలో 65 మంది పూర్తిగా కోలుకున్నారని పతంజలి కంపెనీ ప్రకటించింది. కరోనా లక్షణాలున్న వారిపై ప్రయోగించామని చెప్పారు. (24గంటల్లో.. 16,922 కరోనా కేసులు) అయితే వారికి వాస్తవంగా కరోనా ఉందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు ఎలాంటి పరీక్షలు జరపలేదు. కరోనా లేకున్నా చాలామంది దగ్గు, దమ్ముతో బాధ పడుతుంటారు. ఆ విషయాన్ని పతంజలి కంపెనీ ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదు. అంతర్జాతీయ, భారతీయ ప్రమాణాల ప్రకారం ఏ మందు ట్రయల్స్‌ను నిర్వహించాలన్నా కనీసం 220 మందిపై నిర్వహించాల్సి ఉంటుంది. పతంజలి మందులకు సంబంధించి గతంలో అనేక కేసులు నమోదయ్యాయి. ఏ కేసులో కూడా రాందేవ్ బాబాను అరెస్ట్ చేయలేదు. లైసెన్స్‌ల రద్దుకు సంబంధించి కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. -
రాందేవ్ బాబా కరోనా డ్రగ్‌కు ‘మహా’ షాక్
ముంబై : కరోనా మహమ్మారికి రాందేవ్ బాబా సంస్థ పతంజలి ఆయుర్వేద విడుదల చేసిన కొరోనిల్ డ్రగ్‌ను మహారాష్ట్రలో అనుమతించబోమని ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలో కృత్రిమ మందుల అమ్మకాలను అనుమతించమని రాందేవ్ బాబాను హెచ్చరించారు. కొరోనిల్ ఔషధం పనితీరును అథ్యయనం చేసేందుకు పూర్తిస్ధాయిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారా అనేది నిమ్స్, జైపూర్ నిగ్గుతేల్చాలని అనిల్ దేశ్‌ముఖ్ గురువారం ట్వీట్ చేశారు. కొరోనిల్ ప్రకటనలను ఆయుష్ మంత్రిత్వ శాఖ నిషేధించడాన్ని మంత్రి స్వాగతించారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా, శాంపిల్ పరిమాణం వివరాలు, నమోదు వివరాలు లేకుండా కరోనాకు మందు కనుగొన్నామని పేర్కొనడం ఆమోదయోగ్యం కాదని, ప్రజారోగ్యం విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని మంత్రి దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. (చదవండి : కోవిడ్‌కి పతంజలి ఔషధం) -
మార్కెట్లోకి కరోనా ఔషధం..
హరిద్వార్ : ఆయుర్వేదిక్ ఉత్పత్తుల దిగ్గజం పతంజలి రూపొందించిన కరోనా ఔషధం కొరోనిల్‌ను యోగా గురు రాందేవ్ బాబా మంగళవారం హరిద్వార్‌లో విడుదల చేశారు. కరోనావైరస్కు వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందని, కరోనా చికిత్సకు ఈరోజు తాము తొలి ఆయుర్వేద ఔషధం కొరోనిల్‌ను అభివృద్ధి చేశామని రాందేవ్ బాబా పేర్కొన్నారు. దాదాపు 100 మంది రోగులపై తాము క్లినికల్ పరీక్షలు నిర్వహించగా 65 శాతం మందికి మూడురోజుల్లో నెగెటివ్ ఫలితాలు వచ్చాయని చెప్పారు.ఏడు రోజుల్లో వంద శాతం మంది రోగులు కోలుకున్నారని వెల్లడించారు. తమ ఔషధం నూరు శాతం రికవరీ రేటు, సున్నా శాతం మరణాల రేటును కలిగిఉందని చెప్పుకొచ్చారు. కోవిడ్-19 రోగుల చికిత్సలో ఉపయోగించే ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసే క్రమంలో పతంజలి అన్ని శాస్త్రీయ నిబంధనలను పాటించిందని చెప్పారు. పతంజలి పరిశోధనా కేంద్రం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) సహకారంతో పరిశోధన చేపట్టామని పతంజలి పేర్కొంది. కోవిడ్-19 చికిత్స కోసం పలు వ్యాక్సిన్ల అభివృద్ధి వివిధ దశల్లో ఉన్న సమయంలో ఆయుర్వేద ఔషధం అందుబాటులోకి వచ్చింది. పలు వ్యాక్సిన్లు మానవ పరీక్షలపై కీలక దశకు చేరుకున్నాయి. ఆస్ర్టాజెనెకా, మొడెర్నా, ఫిజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మెర్క్, సనోఫి, బయోఎన్‌టెక్, కాన్సినో బయోలాజిక్స్ వంటి పలు సంస్ధలు వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నమయ్యాయి. చదవండి : యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం -
నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాం
శంషాబాద్: పతంజలి సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో వెయ్యిమంది నిరుద్యోగులకు పంపిణీదారులు, సేల్స్మెన్లుగా ఉపాధి కల్పిస్తున్నట్లు యోగా గురువు రాందేవ్ బాబా పేర్కొన్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన ఆయనకు పతంజలి సంస్థ ఉద్యోగులు, అభిమానులు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే అన్ని రంగాల్లో వేళ్లూనుకుపోయిన విదేశీ సంస్థల పెత్తనం ఇప్పుడు వ్యవసాయరంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. లక్షల కోట్ల రూపాయల భారత దేశ ధనం విదేశాలకు పోతోందన్నారు. దేశ ప్రజల్లో స్వదేశీ వస్తువుల వాడకంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించే చైతన్యవంతమైన కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తున్నామన్నారు. -
బాబా రాందేవ్ భారీగా ఉద్యోగ ఆఫర్లు
న్యూఢిల్లీ : ఉద్యోగం కోసం వెతుకుతున్నారా....? అయితే ఈ అవకాశం అందిపుచ్చుకోడంట. ఎఫ్ఎంసీజీ రంగంలో వేగవంతంగా దూసుకెళ్తోన్న బాబా రాందేవ్ భారీగా ఉద్యోగ ఆఫర్లు ప్రకటించారు. పతంజలి ఆయుర్వేద మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి 50వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని పతంజలి ఆయుర్వేద సంస్థ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. తమ పతంజలి వ్యాపారాల్లో పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఈ సంస్థ బుధవారం ఈ ప్రకటన చేసింది. ప్రతి జిల్లాలో పతంజలి ఉత్పత్తులను నిర్వహించే బాధ్యతల కోసం సేల్స్‌మెన్ పోస్టులను ప్రకటించింది. ప్రతి జిల్లాలో 40 నుంచి 50 మంది వరకు సేల్స్‌మెన్‌ను నియమించుకోవాలని గ్రూప్ ప్లాన్ చేస్తోంది. ఫుడ్, పర్సనల్ కేర్, హోమ్ కేర్, ఆశా పూజ ఐటమ్స్ వంటి పతంజలి బ్రాండుల్లో కూడా ఈ ఉద్యోగ అవకాశాలను ఆఫర్ చేస్తోంది. పతంజలి ఉద్యోగాలకు అర్హత : కనీసం 12వ తరగతి ఉత్తీర్ణత, బీఏ/ఎంఏ/ఎంబీఏ. ఎఫ్ఎంసీజీ రంగంలో ఒకటి లేదా రెండేళ్ల అనుభవమున్న వారికి ఎక్కువ ప్రాధాన్యత. ఎంపిక, శిక్షణ క్యాంప్‌ను 2018 జూన్ 23 నుంచి 27 తేదీల్లో నిర్వహిస్తారు. 2018 జూన్ 22 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. (రిజిస్ట్రేషన్ తప్పనిసరి) పతంజలి మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా సేల్స్‌మెన్‌కు వేతనాలు చెల్లిస్తారు. ప్రతి జిల్లాలో 40 నుంచి 50 సేల్స్‌మెన్ కావాలి. హోమ్ డెలివరీ, రెడీ స్టాక్ సేల్స్‌కు 50 నుంచి 100 మంది యువత కావాలి. వేతనం నగరం, కేటగిరీ, అర్హత బట్టి రూ.8000 నుంచి రూ.15000 మధ్యలో ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ గురించి తమ అధికారిక కో-ఆర్డినేటర్‌ను లేదా ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నెంబర్ల ద్వారా సంపద్రించాలని సూచించింది. ఈ ఉద్యోగానికి ఏ ఏజెంట్‌కు నగదు చెల్లించవద్దని తెలిపింది. -
బీఎస్ఎఫ్ జవాన్లకు పతంజలి ఉత్పత్తులు
న్యూఢిల్లీ: ఇప్పటికే యోగా నైపుణ్యాన్ని ఒంటబట్టించుకున్న బీఎస్ఎఫ్ దళాలు ఇకపై పతంజలి ఉత్పత్తులను వినియోగించనున్నాయి. ఢిల్లీలోని బీఎస్ఎఫ్ క్యాంపులలో తొలి పతంజలి ఉత్పత్తుల దుకాణాన్ని ప్రారంభించిన సందర్భంగా బీఎస్ఎప్ భార్యల సంక్షేమ సంఘం.. పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న డజనుకుపైగా బీఎస్ఎఫ్ క్యాంటీన్లలో పతంజలి ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నారు.