సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారికి మందు కనుగొన్నామని యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద కంపెనీ ప్రకటించడం, తాము కనిపెట్టిన ‘కరోలిన్’ మందు వల్ల కలిగే ప్రయోజనాల గురించి రాందేవ్ బాబా హరిద్వార్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ చెప్పడంపై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. కరోనా మహమ్మారికి సంబంధించి ప్రయోగాలు జరపాలన్నా, మందులు విడుదల చేయాలన్నా ముందుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరంటూ ఏప్రిల్ 11వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఓ నోటీసును జారీ చేసింది. (రాందేవ్ బాబా కరోనా డ్రగ్‌కు ‘మహా’ షాక్)
ఇదే విషయమై కేంద్ర ఆయుష్ శాఖను మీడియా సంప్రతించగా, కరోనా మందులకు సంబంధించి పతంజలి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేసింది. అయితే పతంజలి కంపెనీ కరోనాకు మందు కనిపెట్టిన విషయంగానీ, దాని విడుదలకు సంబంధించి వాణిజ్య ప్రకటనలు చేసిన విషయంగానీ తమ దృష్టికి రాలేదని ఆరోగ్య శాఖ అమాయకత్వం ప్రదర్శించింది. కరోనా (కోవిడ్–10) నిరోధక మందుల తయారీకి పతంజలి కంపెనీ ఎలాంటి లైసెన్స్‌లు తీసుకోలేదని, రోగ నియంత్రణ శక్తికి, దగ్గు నివారణ మందులకు లైసెన్స్ తీసుకుందని కరోలిన్ మందుల విక్రయానికి అనుమతించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దగ్గు నివారణ మందనుకొనే తాము కరోలిన్ మందుకు అనుమతించామని ఆ ప్రభుత్వం తెలిపింది. కరోలిన్ మందుకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు పరిశీలించి పతంజలి కంపెనీకి నోటీసులు జారీ చేస్తామంది. మహారాష్ట్ర ప్రభుత్వమైతే కరోలిన్ మందులను రాష్ట్రంలోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. (ఆవనూనె, నిమ్మకాయతో కరోనాకు చెక్)
ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన డ్రగ్ నియంత్రణ సంస్థ ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్’ ఇప్పటివరకు స్పందించక పోవడం ఆశ్చర్యంగా ఉంది. కరోలిన్ మందు అమ్మకాలను నిషేధిస్తూ తక్షణం ఉత్తర్వులు జారీ చేయాల్సిన డ్రగ్స్ నియంత్రణ సంస్థ మౌనం పాటించడం అర్థరహితం. అమెరికా, యూరప్ దేశాల్లో లైసెన్స్ నిబంధనలను మందుల కంపెనీలు ఉల్లంఘించినట్లయితే వేల కోట్ల రూపాయల జరిమానాలు విధించడమే కాకుండా ఆ కంపెనీ లైసెన్స్‌లన్నింటిని రద్దు చేస్తారు. విదేశీ చట్టాలను పక్కన పెడితే కరోనా మందులకు సంబంధించి ఎవైరైనా, ఏ సంస్థ అయినా సాధారణ ప్రకటనలుగానీ, వాణిజ్య ప్రకటనలుగానీ విడుదల చేసినట్లయితే ‘నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్’ కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఏప్రిల్‌లో విడుదల చేసిన తన స్టేట్‌మెంట్‌లో ఆయూష్ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ చట్టాన్ని ఇప్పటి వరకు పలువురు జర్నలిస్టుల మీద కూడా ప్రయోగించింది.
పతంజలి తన కరోలిన్ మందుకు సంబంధించి వాణిజ్య ప్రకటనలు చేస్తున్నా, రాందేవ్ బాబా టీవీల్లో స్వయంగా ఇంటర్వ్యూలు ఇస్తూ చెబుతున్నా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం పట్ల విమర్శకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన నిబంధనలను పక్కన పెట్టినా ‘కరోలిన్’ మందుకు సంబంధించి పతంజలి కంపెనీ నిర్వహించిన ట్రయల్స్ నమ్మశక్యంగా లేవు. కరోనా లక్షణాలు స్వల్పంగా, ఓ మోస్తారుగా ఉన్న వంద మంది రోగులపై కరోలిన్ మందును ప్రయోగించామని, వారిలో 65 మంది పూర్తిగా కోలుకున్నారని పతంజలి కంపెనీ ప్రకటించింది. కరోనా లక్షణాలున్న వారిపై ప్రయోగించామని చెప్పారు. (24గంటల్లో.. 16,922 కరోనా కేసులు)
అయితే వారికి వాస్తవంగా కరోనా ఉందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు ఎలాంటి పరీక్షలు జరపలేదు. కరోనా లేకున్నా చాలామంది దగ్గు, దమ్ముతో బాధ పడుతుంటారు. ఆ విషయాన్ని పతంజలి కంపెనీ ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదు. అంతర్జాతీయ, భారతీయ ప్రమాణాల ప్రకారం ఏ మందు ట్రయల్స్‌ను నిర్వహించాలన్నా కనీసం 220 మందిపై నిర్వహించాల్సి ఉంటుంది. పతంజలి మందులకు సంబంధించి గతంలో అనేక కేసులు నమోదయ్యాయి. ఏ కేసులో కూడా రాందేవ్ బాబాను అరెస్ట్ చేయలేదు. లైసెన్స్‌ల రద్దుకు సంబంధించి కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
Comments
Please login to add a commentAdd a comment